Doomsday Vault: లాకర్లలో డబ్బులు, బంగారు నగలు, విలువైన వస్తువులు దాచుకుంటారు. చాలా మంది బంగారు నగలు దొంగల పాలు కాకుండా ఉండేందుకు బ్యాంకు లాకర్లలో పెట్టుకుంటారు. సంపన్నుల ఇంట్లోనే లాకర్లు ఉంటాయి. అలాగే బ్యాంకులు, దిగ్గజ కార్పోరేట్ సంస్థల వద్ద కూడా లాకర్లు ఉంటాయన్న విషయం తెలిసిందే. అయితే ప్రపంచ దేశాలు అన్నింటికీ కలిపి ఒక లాకర్ ఉందని మీకు తెలుసా? ఈ భారీ వాల్డ్ పేరు డూమ్స్‌డే వాల్ట్. ఇందులో బంగారం, డబ్బు కంటే కూడా విలువైనవి దాచి పెడుతున్నారు. దాదాపు 100 దేశాలు కలిసి ఈ వాల్ట్ ను నిర్వహిస్తున్నాయి. ఈ డూమ్స్‌డే వాల్ట్ ప్రత్యేకత ఏంటి.. ఈ భారీ వాల్ట్ లో ఏం దాచి పెడుతున్నారు.. దాని విశిష్టత ఏంటో ఓసారి చూద్దాం.


త్వరలోనే మహా ప్రళయం - అందుకే ఈ వాల్ట్


భూమిపై దాదాపు 64 మిలియన్ సంవత్సరాల క్రితం మహా ప్రళయం వచ్చింది. డైనోసార్లు, రాకాసి బళ్లులు, సహా అనేకానేక జంతువులు, జీవరాశులు తుడిచి పెట్టుకుపోయాయి.  కోట్ల సంవత్సరాల తర్వాత ఆనాటి జీవుల అస్థిపంజరాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. అయితే త్వరలోనే భూమిపై మరో మహా ప్రళయం వస్తుందని.. ఆ ప్రళయంతో భూమిపై ఉన్న జీవరాశి మొత్తం అంతమైపోతుందని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ భారీ విపత్తులో మానవులతో పాటు పశుపక్ష్యాదులు, మొక్కలు, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు అన్ని అంతరించిపోతాయని అంటున్నారు. ఈ ఆరో విపత్తు వాతావరణం రూపంలో ఉంటుందని కూడా హెచ్చరిస్తున్నారు. ఒక వేళ ఈ మహా ప్రళయం నుంచి ఎవరైనా బయట పడగలిగితే వారు జీవించి ఉండటానికి, తినడానికి ఏదైనా ఉండాలి, అందుకోసం విత్తనాలను దాచాలన్న ఆలోచన నుంచి ఉద్భవించిందే ఈ డూమ్స్‌డే వాల్ట్.


ఆర్కిటిక్ సముద్రానికి సమీపంలో డూమ్‌డే వాల్ట్


ఆర్కిటిక్ సముద్రానికి సమీపంలో నార్వేలోని స్పిట్స్‌బర్గెన్‌ ద్వీపంలో ఉంది ఈ డూమ్స్‌డే వాల్ట్. దీనిని గ్లోబల్ సీడ్ వాల్ట్ అని కూడా పిలుస్తుంటారు. ఆర్కిటిక్ ప్రాంతంలో, ఉత్తర ధ్రువానికి అతి సమీపంలో ఈ వాల్ట్ ను నిర్మించడానికి కూడా ఓ కారణం ఉంది. ఈ వాల్ట్ ఉండే ప్రాంతం అత్యంత చల్లగా ఉంటుంది. దీని వల్ల ఇందులో నిల్వ చేస్తున్న విత్తనాలు చెడిపోకుండా సురక్షితంగా ఉంటాయి. 


2008 లో ప్రారంభమైన డూమ్స్‌డే వాల్ట్


ఈ గ్లోబల్ సీడ్ వాల్ట్ ఫిబ్రవరి 2008లో ప్రారంభమైది. ప్రస్తుతం ఇందులో 100 దేశాలు చేరాయి. నిర్దేశిత ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా ఏ దేశమైన ఇందులో చేరవచ్చు. నిబంధనల ప్రకారం ఒకసారి విత్తనాన్ని డిపాజిట్ చేసిన తర్వాత ఏ దేశమూ దానిని తిరిగి అడగడానికి వీల్లేదు. అలాగే విత్తనాలు తీసుకోవాడనికి కూడా కొన్ని నియమాలు పెట్టారు. ఈ డూమ్స్‌డే వాల్ట్ లో భద్రపరిచే విత్తనాల్లో 69 శాతం తృణధాన్యాలు, 9 శాతం చిక్కుళ్లు, పండ్లు, కూరగాయల విత్తనాలు ఉన్నాయి. అలాగే అనేక ఔషధాల విత్తనాలు కూడా ఇందులో భద్రపరుస్తున్నారు. నల్లమందు వంటి విత్తనాలను కూడా ఇందులో భద్రపరుస్తున్నారు. ఈ వాల్ట్ ను నార్వే ద్వీపంలోని ఓ పర్వతం కింద దాదాపు 400 అడుగుల లోతులో నిర్మించారు.