జీవితం మీదే..జాగ్రత్తగా ఉండండి: ఐఏఎస్ అధికారి సూచన


రైలు పట్టాలపై దాటే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని రైల్వే శాఖ హెచ్చరికలు చేస్తూనే ఉంటుంది. నిర్లక్ష్యంగా పట్టాలు దాటుతూ 
ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది. అయినా కొందరి తీరు మారదు. ఓ మహిళ ఇలాగే పట్టాలు దాటి, తృటిలో  ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఓ క్షణం ఆలస్యమైనా వేగంగా దూసుకొస్తున్న రైలు కింద పడి నుజ్జునుజ్జు అయిపోయేదే. ఐఏఎస్ ఆఫీసర్ అవనీష్ శరణ్ ట్విటర్‌లో ఈ వీడియో షేర్ చేశారు. "జీవితం మీదే. నిర్ణయమూ మీదే" అనే క్యాప్షన్‌ని కోట్ చేశారు. ఆ మహిళతో పాటు ఇంకొందరు అంతే నిర్లక్ష్యంగా పట్టాలు దాటుతూ కనిపించారు. నిజానికి ట్రైన్ ప్లాట్‌ఫామ్ వద్ద ఆగలేదు. మరో ట్రైన్‌ క్రాస్ అవ్వటానికి స్టేషన్‌ రాక ముందే ఓ సిగ్నల్ వద్ద ఆగిపోయింది. ప్లాట్‌ఫామ్ వరకూ వెళ్లటం ఎందుకు అనుకున్నారో ఏమో. కొంత మంది మధ్యలోనే ట్రైన్‌లో నుంచి దిగారు. తమ సామాన్లు తీసుకుని పట్టాలు హడావుడిగా పట్టాలు దాటారు. ఇదంతా ఓ వ్యక్తి వీడియో తీశాడు.





 


కాస్త ఆలస్యమైనా...


ట్రైన్ సమీపిస్తుండటాన్ని గమనించిన ఆ వ్యక్తి వెంటనే అందరినీ అప్రమత్తం చేశాడు. అప్పటికే పట్టాలపై ఉన్న వాళ్లు వేగంగా పక్కకు తప్పుకున్నారు. కొందరు అటు ఇటు అంటూ కన్‌ఫ్యూజ్ చివరకు ఓ చోటకు వెళ్లారు. ఓ మహిళ మాత్రం అప్పటి వరకూ ఓ వైపు ఉండి, సరిగ్గా ట్రైన్ వచ్చే సమయానికి ఇటు వైపు దూకింది. రెప్పపాటులోనే రైలు వేగంగా దూసుకుపోయింది. కాస్త ఆలస్యమయ్యుంటే అక్కడికక్కడే ఆ మహిళ మృతి చెంది ఉండేది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. "ఇలాంటి పనులు చేయకూడదని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను" అని ఐఏఎస్ ఆఫీసర్ అవనీష్ శరణ్ అన్నారు. ఇక నెటిజన్లైతే ఆ ప్రయాణికులను తిట్టి పోస్తున్నారు. "ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా" అని తీవ్రంగా మండి పడుతున్నారు. "ఖత్‌రో కా ఖిలాడీ" అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.