Floating Biryani: 


పాపం వాళ్లు ఎంత బాధ పడుతున్నారో..? 


హైదరాబాదీ బిర్యానీ అంటే నాన్‌వెజ్‌ ఆహార ప్రియులకు నోరూరిపోతుంది. ఈ బిర్యానీ టేస్ట్ అలాంటిది. ఒక్క హైదరాబాద్‌లోనే కాదు. ఈ బిర్యానీకి ప్రపంచమంతా అభిమానులున్నారు. ఇలా నోరూరించే బిర్యానీ, ఎవరికీ పనికి రాకుండా ఊరికే నీళ్లకో కొట్టుకుపోతే..అయ్యయ్యో ఎంత పనైపోయిందే అని బాధ పడిపోతారు ఈ డిష్ లవర్స్. ఇప్పుడు హైదరాబాద్‌లో ఇదే జరిగింది. భారీగా కురుస్తున్న వర్షాలకు ఎక్కడికక్కడ వరద నీరు పారుతోంది. నవాబహ్ సాహెబ్ కుంటలోని ఓ హోటల్‌లోనూ భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఆ సమయంలో బిర్యానీతో ఉన్న రెండు పెద్ద గిన్నెలు ఆ వరద ధాటికి నీళ్లలో కొట్టుకుపోయాయి. హోటల్ ముందు నుంచే నీళ్లలో తేలుతూ వెళ్తుండటం చూసి స్థానికులు కొందరు వీడియో తీశారు. "ఈ బిర్యానీ ఆర్డర్ చేసిన వాళ్లు ఎంత బాధ పడుతున్నారో" అని ఓ వ్యక్తి వీడియో పోస్ట్ చేశాడు. బిర్యానీ లవర్స్ అంతా ఈ వీడియో చూసి తెగ బాధ పడిపోతున్నారు. "ఈ బిర్యానీ ఎవరికి దక్కుతుందో" అని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియోకు 9 లక్షల వ్యూస్ వచ్చాయి. వందలాది మందిం కామెంట్లు చేస్తున్నారు. కొందరు దీన్ని "ఫ్లోటింగ్ బిర్యానీ" అని పిలుస్తున్నారు. కొందరు "సారీ జొమాటో, స్విగ్గీ, డుంజో" అంటూ ఫుడ్ డెలివరీ యాప్స్‌ను ట్యాగ్ చేస్తూ ఫన్నీగా స్పందిస్తున్నారు.