Villagers Protest: ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆగమేఘాల మీద గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్ రన్ నిర్వహించడం పట్ల నిర్వాసిత గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్‌కి ఓట్లు వేసి సతీష్‌ను ఎమ్మెల్యేగా చేయడం తమ తప్పని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ ఇంకోసారి టీఆర్ఎస్‌కి ఓట్లు వేస్తే చూడండంటూ తీవ్ర ఆందోళన చేశారు. ఎమ్మెల్యే సతీష్ కుమార్ మీద కోపంతో తమను తాము చెప్పులతో కొట్టుకున్నారు. పూర్తి స్థాయిలో నష్ట పరిహారం ఇవ్వకుండానే ప్రాజెక్టు ప్రారంభించడానికి అధికారులు, ప్రభుత్వం అత్యుత్సాహం చూపిస్తోందని ఆరోపించారు. తమకు ఏదైనా శాశ్వత పరిష్కారం చూపించే వరకు పనులు ప్రారంభించకూడదని చెప్పారు. ఒకవేళ పనులు ప్రారంభిస్తే... తీవ్రస్థాయిలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.  


గతంలోనూ అదే తంతు..


గతంలోనూ హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులు నినాదాలు చేశారు. సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లిలో నిర్వాసితులు దీక్ష చేశారు. దాన్ని విరమించాలని కోరుతూ... ఎమ్మెల్యే అక్కడకు వెళ్లగా వారు ఆందోళన విరమించబోమని చెప్పారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని, ప్రాజెక్టు పనులు జరగనివ్వాలని ఎమ్మెల్యే కోరినా వారు వినలేదు. ఎమ్మెల్యే సతీష్ కుమార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాకే పనులు చేపట్టాలని నిర్వాసితులు డిమాండ్‌ చేశారు. నిర్వాసితుల ఆందోళనతో ఎమ్మెల్యే సతీష్ కుమార్ వెనుదిరిగారు. 


అర్థరాత్రి పోలీసుల లాఠీఛార్జ్...


నెలన్నర క్రితం కూడా గుడాటిపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెండు, మూడు రోజుల్లో గౌరవెల్లి ప్రాజెక్డుకు ట్రయల్ రన్ చేస్తారనగా.. నిర్వాసితులు గొడవకు దిగారు. పరిహారం చెల్లించకుండా ట్రయల్ రన్ ఎలా చేస్తారంటూ భూనిర్వాసితులు నిలదీస్తుండటంతో గ్రామంలో భారీగా పోలీసులను మోహరించారు. ట్రయల్ రన్ అడ్డుకుంటారన్న ఉద్దేశంతో గుడాటిపల్లిలో సమారుగా 100 మంది భూ నిర్వాసితులను అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ చర్య వల్ల అక్కడి పరిస్థితులు ఒక్కసారిగా వేడెక్కాయి. గ్రామస్థులు, పోలీసుల మధ్య కాసేపు తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీఛార్జ్ కూడా చేశారు. ఈ సందర్భంగా పలువురికి గాయాలు అయ్యాయి.  


మరో 84 ఏకరాలు అయితే..


మరోవైపు గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణానికి సేకరించాల్సిన 3900 ఎకరాల భుసేకరణలో ఇంకా కేవలం 84 ఎకరాలు మాత్రమే మిగిలి పోయిందని ఎమ్మెల్యే సతీష్ కుమార్ తెలిపారు. ఆ భూమిని సైతం అతి త్వరలో ఎకరానికి 15 లక్షల రూపాయల నష్ట పరిహారం చెల్లించి సేకరిస్తామని పేర్కొన్నారు. 500 మంది మేజర్లకు జీవో 68 ప్రకారం ఆర్ అండ్ ఆర్ కాలనీ ఏర్పాటు చేసి అందులో ఒక ప్లాన్.. ఎమ్మెల్యే కోటా నుంచి ఇంటి నిర్మాణానికి మూడు లక్షల రూపాయల చొప్పున ఇస్తామని తెలిపారు. మరి ప్రాజెక్టు నిర్మాణం కాబోతుందా లేదో తెలియాలంటే ఇంకా కొంత ఆగాల్సిందే.