Viral News: అమెరికాలో ఓ మహిళ ట్యాబ్లెట్ అనుకుని ఆపిల్ ఎయిర్ పాడ్ మింగేసింది. బోస్టన్ కు చెందిన బార్కర్ అనే ఓ టిక్ టాక్ యూజర్ తాను మెడిసిన్ అనుకుని ఎయిర్ పాడ్ మింగేశానని ఓ వీడియో రికార్డు చేసి దానిని టిక్ టాక్ లో పోస్టు చేయగా అది కాస్త వైరల్ గా మారింది. ఒక చేతిలో ఐబుప్రోఫెన్ 800 ట్యాబ్లెట్ పట్టుకున్నానని, మరో చేతిలో ఎయిర్ పాడ్ ఉందని.. పొరపాటున ట్యాబెల్ అనుకుని ఎయిర్ పాడ్ మింగేశానని వీడియోలో చెప్పుకొచ్చింది. మరో చేతిలో ట్యాబ్లెట్ చూసి అవాక్కైనట్లు తెలిపింది. గొంతులో ఉండగానే గుర్తించినప్పటికీ.. ఎయిర్ పాడ్ ను మాత్రం బయటకు తీయలేకపోయినట్లు చెప్పింది. దీంతో వెంటనే తాను ఆస్పత్రికి పరుగు పెట్టినట్లు తన వీడియోలో చెప్పింది.
ఆమెను పరీక్షించిన వైద్యులు.. ఎక్స్ రే తీసి తన కడుపులో ఎయిర్ పాడ్ ఉన్నట్లు నిర్ధారించారు. ఎయిర్ పాడ్ ను సర్జరీ చేసిన తీయాల్సిన అవసరం లేదని, దానికదే బయటకు వచ్చేస్తుందని వైద్యులు చెప్పినట్లు ఆమె వెల్లడించారు. ఇలాంటి అనుభవం ఎవరికైనా ఉందో లేదో తెలియదు కానీ తను మాత్రం ఇలా చేశానని.. ఏం జరుగుతుందో చూడాలని పేర్కొన్నారు. ప్రస్తుతం వైద్యుల సలహాను పాటిస్తున్నానని బార్కర్ చెబుతున్నారు. పరధ్యానంలో ఉంటే ఎలాంటి సమస్యలు కొని తెచ్చుకుంటామో తనే ఓ ఉదాహరణ అని బార్కర్ నెటిజన్లకు సూచించారు.
అయితే బార్కర్ కడుపులో ఉన్న ఎయిర్ పాడ్ ఐఫోన్ కు కనెక్ట్ అవుతోంది. ఎవరైనా కాల్ చేస్తే కడుపులో నుంచి శబ్దాలు కూడా వినిపిస్తున్నాయట. కడుపులో గరగర శబ్దాలు కూడా వస్తున్నాయని బార్కర్ వెల్లడించారు. కడుపులో నుంచి ఎయిర్ పాడ్ బయటకు వచ్చిన తర్వాత దానిని తిరిగి వాడబోనని చెబుతున్నారు బార్కర్.
సత్యసాయి జిల్లాలో నల్లపూసల దండ మింగేసిన వ్యక్తి
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన రామాంజనేయులు (45) అనే వ్యక్తి మూడు నెలల క్రితం తన భార్య నల్లపూసల దండను మింగేశాడు. ఇటీవల కడుపు నొప్పి తీవ్రం కావడంతో అసలు విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు రామాంజనేయులుని అనంతపురంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చూపించారు. వేలల్లో ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో మే 29వ తేదీన ప్రభుత్వ సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుకుమార్ రామాంజనేయులును పరీక్షించారు. వివరాలు ఆరా తీయగా, తాను నల్లపూసల దండను మింగానని, అప్పటి నుండి ఏం తినలేకపోతున్నానని తన ఇబ్బంది గురించి డాక్టర్ కు వివరించాడు. ఆ తర్వాత వైద్యులు అతడికి ఎక్స్ రే తీశారు.
రామాంజనేయులకు ఎక్స్ రే తీయగా అన్నవాహిక వద్ద నల్లపూసల దండ డాలర్ ఇరుక్కున్నట్లు తేలింది. దండ కడుపులోని ఈసోఫాగస్ (ఫుడ్ పైప్) వరకు వెళ్లినట్లు కనిపించింది. దీంతో కడుపులోని నల్లపూసల దండ తీసేందుకు తనను ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకున్నారు. అనంతరం శస్త్రచికిత్స లేకుండానే కడుపులో ఉన్న నల్లపూసల దండ బయటకు తీయాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. మే 30వ తేదీన అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ సుకుమార్, డాక్టర్ కృష్ణ సౌమ్య, స్టాఫ్ నర్సులు, అనస్తీషియా వైద్యుడు డాక్టర్ వేమానాయక్, ఓటీ టెక్నీషియన్ రాజేశ్ లు కలిసి రామాంజనేయులు అన్నవాహికకు మత్తు మందు ఇచ్చారు.