Thief was caught for his book addiction | తాను వచ్చిన పనిని సైతం మర్చిపోయి, తనకు అలవాటైన పనిలో నిమగ్నమయ్యాడు ఓ దొంగ. చోరీ చేసేందుకు ఓ ఇంట్లో చొరబడిన ఓ దొంగ విలువైన వస్తువుల కోసం ఇళ్లంతా వెదకసాగాడు. ఆ క్రమంలో ఓ పుస్తకం దొంగ దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆ పుస్తకం చేతిలోకి తీసుకుని అక్కడే కుర్చీలో కుర్చుని పుస్తకం చదవనారంభించాడు. ఈ ఘటన జర్మనీ దేశంలోని రోమ్ నగరంలో చోటు చేసుకుంది.
దొంగను ఆకర్షించిన పుస్తకం
బాల్కనీ ద్వారా ఇంట్లోకి ప్రవేశించిన దొంగ (38)ని ‘గాడ్స్ ఎట్ సిక్స్ ఓ క్లాక్’. అనే ఒక పుస్తకం అమితంగా ఆకర్షించింది. గ్రీకు పురాణాలకు సంబంధించిన ఆ పుస్తకాన్ని చూసిన దొంగ తన పుస్తకాభిరుచిని ఆపుకోలేకపోయాడు. వెంటనే ఆ పుస్తకాన్ని చేతికందుకుని పక్కనే ఉన్న కుర్చీలో కూలబడిపోయాడు. అదే పనిగా పుస్తకం చదవడం మొదలుపెట్టాడు. తాను దొంగతనానికి వచ్చానన్న విషయం కూడా ఆ దొంగకు గుర్తులేదు. చివరికి ఆ ఇంటి యజమాని (71) వచ్చి భుజంపై చేయి వేసి తట్టి లేపాడు. అప్పటికి కానీ తానొక దొంగనని ఆ ఇంటికి దొంగతనానికి వచ్చాననే విషయం సదరు దొంగగారికి గుర్తుకురాలేదు. ఇంటి యజమానికి కూడా చాలా సేపు ఆ పుస్తకం చదువుతున్నది దొంగ అనే విషయం అర్థం కాలేదు. తీరిగ్గా కూర్చోబెట్టి విచారిస్తే కానీ దొంగ గారి నిర్వాకం బయటపడలేదు. దొంగ అక్కడ్నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. కానీ అప్పటికే ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చి ఉండటంతో సమయానికి అక్కడికి చేరుకున్న పోలీసులు.. దొంగను అదుపులోకి తీసుకున్నారు.
దొంగకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్న రైటర్
అయితే తాను రాసిన పుస్తకం దొంగను ఆకర్షించిందని ఆ ‘గాడ్స్ ఎట్ సిక్స్ ఓ క్లాక్’ పుస్తక రచయిత గియోవన్నీ నుచీకి తెలిసి తెగ బాధపడిపోయాడు. ఆ దొంగను ఎలాగైనా వెతికి పట్టుకుని ఆ పుస్తకాన్ని తనకు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నట్టు చెప్పాడు. తన రచనలు దొంగతనంలో ఉన్న దొంగను సైతం ఆకర్షించి కూర్చోబెట్టి లోకాన్ని మర్చిపోయేలా చదివించినందుకు తాను ఉబ్బితబ్బిబ్బై పొతున్నాడు. పాపం ఆ దొంగ పుస్తకం చదవడం కూడా పూర్తయి ఉండదని బాధపడిపోతున్నాడు. తాను దొంగను కలిసి పుస్తకాన్ని బహుమతిగా ఇస్తానని రచయిత ప్రకటించడం ఈ మొత్తం ఎపిసోడ్ లో కొసమెరుపు.
ఈ ఘటన గురించి తెలిస్తే పుస్తకాల గురించి మన పెద్దోళ్లు చెప్పే మాటలు గుర్తొస్తాయి. ఒక మంచి పుస్తకం వంద మంది స్నేహితులతో సమానం అంటారు. కందుకూరి వీరేశలింగం పంతులు వంటి మహనీయులు చిరిగిన చొక్కా అయినా తొడుక్కో ఒక మంచి పుస్తకం కొనుక్కో అనేవారు.. పుస్తకాల గొప్పతనం అలాంటిది మరి.