Viral News: సాధారణంగా కొందరు కేటుగాళ్లు దొంగతనాలు చేస్తుంటారు. తమకు నచ్చిన వాటితో పాటు డబ్బు, నగలు, విలువైన వస్తువులు చోరీ చేస్తుంటారు. అలాగే ఓ వ్యక్తి కూడా బ్యాంకును దోచేసేందుకు ప్లాన్ వేశాడు. పథకం ప్రకారమే బ్యాంకు తాళాలు పగులగొట్టి మరీ లోపలికి వెళ్లాడు. అక్కడ అంతా వెతికాడు. కోట్ల రూపాయలు భావించి చోరీకి వెళ్లిన ఓ బ్యాంకులో దొంగకు ఒక్క రూపాయి కూడా దొరకలేదు. దీంతో చేసేదేమీ లేక ఆ దొంగ వెనుదిరిగాడు. అయితే వెళ్తూ వెళ్తూ బ్యాంకు అధికారులకు ఓ లేఖ రాశాడు. "నా ఫింగర్ ప్రింట్లు కూడా ఇక్కడ దొరకవు. గుడ్ బ్యాంకు, ఒక్క రూపాయి కూడా దొరకలేదు. నన్ను పట్టుకోవద్దు" అంటూ అందులో వివరించాడు. 


ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..


మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఓ వ్యక్తి దొంగతనానికి వెళ్లాడు. అయితే అక్కడ అంతా వెతికినా అతడికి ఒక్క రూపాయి కూడా దొరకలేదు. దీంతో ఏం చేయాలో పాలుపోని ఆ దొంగ వెళ్లిపోవాలనుకున్నాడు. అయితే వెళ్తూ వెళ్తూ బ్యాంకు అధికారులకు ఓ చిన్న లేఖ రాశాడు. అక్కడే ఉన్న న్యూస్ పేపర్ పై తన మనసులోని మాటలను వివరించాడు. "నా ఒక్క ఫింగర్ ప్రింట్ కూడా ఉండదు. Good Bank. ఒక్క రూపాయి దొరకలేదు. న్ను పట్టుకోవద్దు" అంటూ రాసుకొచ్చాడు. అయితే మరుసటి రోజు బ్యాంకు తెరిచిన అధికారులు దీన్ని చూసి షాకయ్యారు. ముందుగా నవ్వుకున్నారు. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దొంగ రాసిన లెటర్ కు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్ గా మారింది.