Vadapav Vendor Earns 2.8 Lakhs Per Month: వడాపావ్.. ముంబైలో (Mumbai) ఫేమస్ చిరుతిండి. చాలామంది వీధి వ్యాపారులు దీన్ని విక్రయిస్తూ ఉపాధి పొందుతుంటారు. అయితే, ఓ వడాపావ్ విక్రేత (Vadapav Vendor) నెలవారీ ఆదాయ వివరాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ రోజంతా ఆ వ్యాపారి వద్ద ఉంటూ చేసిన వీడియో లక్షల వ్యూస్ సాధించింది. వడాపావ్ వ్యాపారి నెలవారీ ఆదాయం రూ.2.8 లక్షలని తెలుసుకున్న నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. భిన్నంగా స్పందిస్తున్నారు.


వడాపావ్ వ్యాపారితో ఓ రోజు


సార్థక్ సచ్‌దేవ్ అనే వ్లాగర్.. ముంబైలోని ఓ వడాపావ్ వ్యాపారి ఆదాయానికి సంబంధించి ఓ డాక్యుమెంటరీ రూపొందించాడు. ఆ వడాపావ్ స్టాల్ వద్ద రోజంతా అలానే ఉంటూ కార్యకలాపాలను చిత్రీకరించాడు. సదరు వ్యాపారి మధ్యాహ్నానికే దాదాపు 200 వడాపావ్‌లు విక్రయించాడు. టైం గడిచే కొద్దీ వ్యాపారం పుంజుకోసాగింది. రోజు ముగిసే సరికి మొత్తం 622 వడాపావ్‌లు అమ్ముడయ్యాయి. ఒక్కో వడపావ్ ధర రూ.15 కాగా.. ఒక్క రోజులో వ్యాపారికి రూ.9,300 ఆదాయం సమకూరింది.


నెలకు రూ.2.8 లక్షలు..




ఈ లెక్కన ఆ వ్యాపారి నెల వారీ ఆదాయం రూ.2.8 లక్షలుగా తేలింది. నిర్వహణ ఖర్చులు మొత్తం తీసేస్తే నెలవారీ ఆదాయం సుమారు రూ.2 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంటే దాదాపు ఏడాదికి రూ.24 లక్షల ఆదాయం సమకూరుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. తక్కువ టైంలోనే దాదాపు 40 మిలియన్ల వ్యూస్ సాధించింది. నెటిజన్లు ఈ వీడియోపై రకరకాలుగా కామెంట్స్ చేశారు. 'నా ఆఫీస్ ఉద్యోగం నుంచి నేను ఇంత సంపాదించగలనా.?' అని ఓ నెటిజన్ స్పందించగా.. 'వెంటనే వడాపావ్ అమ్మకాలు ప్రారంభించాలి' అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. మరి కొంతమంది నెటిజన్లు వడాపావ్ వ్యాపారిని ప్రశంసిస్తూ కామెంట్స్ చేశారు. 'ఇది నిజంగా సంపాదన కోసం కష్టపడే వారికి గౌరవం' అంటూ స్పందించారు. 


Also Read: Lost and Found Service: విమాన ప్రయాణంలో వస్తువులు మిస్సింగ్! ఆ మరిచిపోయిన ఐటెమ్స్‌ను ఇలా తిరిగి పొందవచ్చు