Fathers Day 2024: నాన్నంటే అర్థం మారుతోంది. గతంలో నాన్నంటే కేవలం ఇంటి కోసం సంపాదించడం.. బయటకు వెళ్లి కష్టపడటం, మొత్తం ఇంటి ఆర్థికావసరాలు తీర్చడం వంటివి మాత్రమే చేసేవాడు. పిల్లల బాధ్యత అమ్మ చూసుకునేది. కాలంతో పాటే పరిస్థితులూ మారుతున్నాయి. అమ్మ కూడా సంపాదించడం మొదలు పెట్టింది. నాన్నకు సమానంగా అమ్మ కూడా తయారైనప్పుడు పిల్లల పరిస్థితేంటి? అమ్మ, నాన్నలిద్దరూ పిల్లల బాధ్యత చూసుకునే ఇళ్లు కొన్నయితే.. అమ్మ బిజీగా ఉంది కాబట్టీ మీ బాధ్యత నేను చూసుకుంటా అని నాన్నలు ముందుకొచ్చే ఇళ్లు కొన్ని. వీటన్నికీ మించి అమ్మ లేకపోయినా.. నాన్నలు మాత్రమే కంటికి రెప్పలా తమ పిల్లల్ని కాపాడుకునే ఇళ్లు మరికొన్ని. అసలు అమ్మే లేకుండా పిల్లల్ని పెంచుతోన్న నాన్నలు కొందరు. సాంప్రదాయ నాన్నల్లా కాకుండా పిల్లల కోసం ఇంటినే అంటి పెట్టుకుని ఉంటోన్న నాన్నలు, అమ్మలు లేకుండా పిల్లల్ని పెంచుతోన్న ఒంటరి నాన్నల విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
పిల్లలకి చేసి చూపించాలి..
‘‘పిల్లలతో ఎక్కువ సేపు సమయం గడపడానికి నాన్నకి టైమ్ దొరకడం ఒక అదృష్టం. నా పిల్లల అమ్మ పని మీద తరచూ బయటకి వెళ్లాల్సి రావడంతో నాకా అవకాశం వచ్చింది. తండ్రిగా నేను వాళ్ల బాగోగులు చూడాలి. వారికి ఫ్రెండ్ లా ఉంటూ వారి ఇష్టా ఇష్టాలు తెలుసుకోవాలి. ఏ పనిలోనైనా వారికి ఆదర్శంగా నిలవాలి. వారికి చెప్పడం కంటే చూపించడం ద్వారా ఎక్కువ తెలుసుకుంటారు. కాబట్టీ ఇంటిపనులైనా, ఏ ఇతర విలువలైనా ఆచరించి చూపించి పిల్లలకు నేర్పించాలి. నా కూతురు ఇషితా, కొడుకు ఇషాన్లతో క్వాలిటీ టైమ్ గడుపుతోన్న నేను అదే చేస్తున్నా’’ అని చెబుతున్నారు ముంబైకి చెందిన యాక్టర్, రెస్టారెంట్ ఓనర్ సునీల్ మట్టూ.
మగవాళ్లని ఇష్టపడే నేను తండ్రిని కాలేనేమో అనుకున్నా
గ్రామీ అవార్డు విన్నర్, పాప్ స్టార్ రికీ మార్టిన్ గురించి తెలియన వారుండరు. మార్టిన్ కి ఇద్దరు కవల పిల్లలు. 2008లో వీరిని సరోగసీ విధానంలో కని మార్టిన్ సింగిల్ పేరెంట్ అవతారమెత్తారు. . 2010లో తాను గే అని ప్రకటించుకున్న మార్టిన్ ‘‘ మగవాళ్లని ఇష్టపడే నేను పిల్లల్ని ఈ జన్మకి కనలేనేమో అని అని భయపడ్డా’’ అని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. మార్టిన్‌కు తన పిల్లలంటే చాలా ఇష్టం. చాలా కార్యక్రమాల్లో ఈ కవలల్ని వెంటేసుకుని తిరుగుతారు. తరువాతి కాలంలో మార్టిన్ జ్వాన్ యోసెఫ్ అనే అతన్ని పెళ్లి చేసుకున్నారు. ఈ జంట ఆ తరువాత సైతం మరో ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకుంది. మరింత మంది పిల్లలకి తండ్రినవ్వాలని ఉందని మార్టిన్ చెబుతున్నారు.
నన్ను వెళ్లొద్దు నాన్నా అంటుంటే..
బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్‌దీ ఇదే కథ. ‘‘నన్ను నాన్న అని పిలిచే వాళ్లు ఉన్నారన్న ఆ అనుభూతి ఎలా ఉంటుందో నేను మాటల్లో చెప్పలేను. నాన్న మా రూమ్ కి ఎప్పుడు వస్తాడా అని ఆ పిల్లలు ఎదురుచూడటం. వాళ్ల రూమ్ కి వెళ్లాక అప్పుడే వెళ్లిపోకు నాన్నా అంటూ నా చేతిని పట్టుకుని ఆపడం. ప్రేమగా నన్ను హత్తుకోవడం. ఇదంతా నమ్మలేకపోతున్నా’’ అని కరణ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. నా సెక్సువాలిటీ ఏంటో అందరికీ తెలుసు అని చెప్పే కరణ్ జోహార్ 2017లో సరోగసీ విధానంలో యష్, రోహిణి అనే ఇద్దరు కవలలకి జన్మనిచ్చారు.
హాలీవుడ్ నటుడు టామ్ క్రూయిజ్ సైతం ముగ్గురు పిల్లలకి తండ్రి. ఒక పాప కేటీ హాల్మ్స్ తో రిలేషన్ లో ఉన్నప్పుడు పుట్టగా ఇద్దరిని నికోల్ కిడ్మన్తో పెళ్లయ్యాక దత్తత తీసుకున్నాడు. ఆ ఇద్దరితో తరువాతి కాలంలో విడిపోయినా.. పిల్లల బాధ్యత మాత్రం తానొక్కడే చూసుకునేలా కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఇలాంటి సింగిల్ డాడ్ ల లిస్టులో మరో హాలీవుడ్ యాక్టర్ బ్రాడ్ పిట్, ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో, బాలీవుడ్ యాక్టర్ తుషార్ కపూర్ తదితరులున్నారు.