Viral Video : మధ్యప్రదేశ్ లో షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. ఓ అడవి పందిని వేటాడే క్రమంలో తనకు తానుగా బావిలో పడిపోయింది ఓ పులి పిల్ల. తాను తీసుకున్న గోతిలో తానే పడ్డట్టు.. ఒక్కసారిగా వేట మలుపు తిరిగింది. దీంతో ప్రాణం తీసే సందర్భం నుంచి ఆ పులి ప్రాణాలు కాపాడుకునే పరిస్థితికి చేరుకుంది. రెండు జంతువులూ బావిలో పడడంతో వాటిని సురక్షితంగా బయటికి తీయడం అధికారులకు సవాల్ గా మారింది.
అడవి పందిని వేటాడుతూ బావిలో పడ్డ పులి పిల్ల
మధ్యప్రదేశ్ సియోనిలో ఈ అరుదైన ఘటన జరిగింది. ఫిబ్రవరి 3న సాయంత్రం సియోని జిల్లాలోని లోతైన వ్యవసాయ బావిలో ఒక పులి పిల్ల, అడవి పంది కలిసి చిక్కుకున్నట్లు కొందరు స్థానికులు గుర్తించారు. ఈ అసాధారణ దృశ్యం గ్రామస్థులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎందుకంటే ఆహారం రక్షణ కోసం వేటాడే జంతువు పులి, అడవి పంది పక్కపక్కనే ఉండటాన్ని చూసి, ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత వేటాడే క్రమంలో అడవి పందిని వెంబడించిన సమయంలో ఈ అనూహ్య పరిణామం చోటుచేసుకుని ఉండొచ్చని అంతా నిర్థారణకు వచ్చారు. తప్పించుకోవడానికి మార్గం లేకపోవడంతో, ఆ రెండు జంతువులు ఆ బావిలో నుంచి బయటికి వచ్చేందుకు తీవ్ర ఇబ్బంది పడ్డట్టు వారు గుర్తించారు.
రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించిన అధికారులు
బావిలో జంతువులను గుర్తించిన స్థానికులు.. వెంటనే వన్యప్రాణుల అధికారులకు సమాచారం అందించారు. దీనికి స్పందించిన అధికారులు.. పులి పిల్ల, అడవి పంది రెండింటినీ సురక్షితంగా బయటకు తీయడానికి ఒక రెస్క్యూ టీమ్‌ను సంఘటనా స్థలానికి పంపారు. పరిస్థితి స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని, రెండు జంతువులకు హాని కలిగించకుండా ఆపరేషన్ కొనసాగించడానికి నిపుణులను పిలిపించారు. ఆ తర్వాత విజయవంతంగా ఆ రెండు జంతువులను సురక్షితంగా బయటకు తీశారు.
ఈ విషయాన్ని పెంచ్ టైగర్ రిజర్వ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. "రిజర్వ్ సమీపంలోని పిపారియా గ్రామంలో ఒక పులి, ఒక పంది ప్రమాదవశాత్తూ బావిలో పడిపోయాయి. పెంచ్ టైగర్ రిజర్వ్ రెస్క్యూ బృందం వేగవంతమైన చర్యకు ధన్యవాదాలు. పులి, పందిని సురక్షితంగా రక్షించారు. నిపుణుల సమన్వయం, సంరక్షణతో, రెండు జంతువులను క్షేమంగా బయటకు తీసి, వాటిని తమ స్థానాల్లో విడిచిపెట్టారు" అని పోస్ట్ లో తెలిపారు.
రైతులకు అధికారుల సూచనలు
అడవి జంతువులు బావులలో పడిపోయిన సందర్భాలు గతంలోనూ చోటుచేసుకున్నాయి. తాజా సంఘటన తర్వాత, అటవీ ప్రాంతాలలోని తెరిచి ఉన్న బావులను కప్పి ఉంచాలని లేదా ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి కంచె వేయాలని వన్యప్రాణి అధికారులు రైతులను, స్థానిక అధికారులను కోరారు.
Also Read : Viral Video: భయమంటే తెలియని బ్లడ్ అతనిది - భారీ కొండచిలువను ఏం చేశాడో చూడండి