Beautiful Handwriting : ఇప్పుడంటే కంప్యూటర్లు వచ్చాయి గానీ.. అప్పట్లో ఏ పనికైనా చేతి రాతనే ఉపయోగించేవాళ్లు. ఇప్పుడు చేత్తో కాగితంపై రాసే వాళ్లు చాలా తక్కువ. జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకునేందుకు విద్య అనేది ఒక సాధనం లాంటిది. చేతి రాతకు, చదువుకు మధ్య లోతైన సంబంధం ఉందన్నది ఎంత నిజమో.. విద్యలో చేతిరాత అనేది ఒక ముఖ్యమైన అంశం అనేది కూడా అంతే నిజం. అలాంటి చేతిరాతలోనూ చాలా రకాలు ఉంటాయి. కొందరైతే ఈ చేతిరాతను చూసి వ్యక్తి అంతఃసౌందర్యాన్ని, ప్రవర్తనను ఆలోచనల్ని అంచనా వేస్తుంటారు. ఇలా చేతిరాతలను, సంతకాలను విశ్లేషించే పద్ధతినే గ్రాఫాలజీ అంటారు. ఇంత గొప్ప ప్రాముఖ్యత ఉన్న హ్యాండ్ రైటింగ్ ను అందంగా, ముత్యాల్లా, గుండ్రంగా రాయడం కూడా ఓ కళ. ఇది అందరికీ సాధ్యం కాదు. కానీ నేపాల్‌కు చెందిన ప్రకృతి మల్లా అనే బాలిక తన చేతిరాతతో అందరి హృదయాలను గెలుచుకుంది. ఆమె అసాధారణ చేతిరాతే ఆమెకు "ప్రపంచంలోని అత్యంత అందమైన చేతిరాత" అనే బిరుదును సంపాదించిపెట్టింది.


ప్రకృతి తన అందమైన చేతిరాతకు గానూ 16 ఏళ్ల వయసులోనే మంచి పేరు తెచ్చుకుంది. ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు, ఆమె చేసిన ఒక అసైన్‌మెంట్ ఇంటర్నెట్‌లో సంచలనంగా సృష్టించింది. కాగితంపై రాసిన ఈ హ్యాండ్ రైటింగ్ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ప్రకృతి చేతిరాతను కాగితంపై చూస్తే అది చేతితో రాసిందా లేక కంప్యూటర్‌లో టైప్ చేసిందా అని చెప్పడం అసాధ్యం అని చాలా మంది నెటిజన్లు అంటున్నారు.





2022లో, నేపాల్‌లోని యూఏఈ రాయబార కార్యాలయం ప్రకృతి మల్లా గురించి ట్వీట్ చేస్తూ, 51వ స్పిరిట్ ఆఫ్ ది యూనియన్ వేడుకల్లో ఆమెకు వరల్డ్ బెస్ట్ హ్యాండ్ రైటింగ్ అవార్డు లభించిందని పేర్కొంది. ప్రకృతి హ్యాండ్ రైటింగ్ ను చూసిన యూఏఈ రాయబార కార్యాలయం అధికారులతో పాటు నేపాల్ సాయుధ దళాలు కూడా ఆమెను సత్కరించాయి. ప్రకృతి చేతిరాత ఇప్పుడు చాలా మందికి స్ఫూర్తినిస్తోంది. సాంకేతికత ఆధిపత్యం చెలాయించే నేటి టెక్నాలజీ యుగంలో కూడా, సరళమైన రచనా కళను అభినందించేవాళ్లు ఉన్నారనడానికి ఆమెకు వచ్చే ప్రశంసలే ఉదాహరణ. 


ఈ వైరల్ ట్వీట్ లో ప్రకృతి మల్లా తన హ్యాండ్ రైటింగ్ ను ప్రదర్శించింది. ఇందులో ప్రతి అక్షరం చాలా అందంగా కనిపించింది. ఆమె చేతిరాత నిజంగా అందర్నీ ఆకట్టుకునేలా ఉంది. ఆమె చేతిరాతను చూసి కంప్యూటర్ కూడా సిగ్గుపడుతుందని చెప్పడం అతిశయోక్తేం కాదు.






Also Read : Viral Video: భయమంటే తెలియని బ్లడ్ అతనిది - భారీ కొండచిలువను ఏం చేశాడో చూడండి