UP Police Solved Sharpener Stolen Case: హత్యలు, దోపీడీలు, మోసాలు, కొట్లాటలు వంటి కేసుల ఛేదనలో పోలీసులు ఎప్పుడూ బిజీగా ఉంటారు. అలాంటి పోలీసులకు తాజాగా ఓ వింత ఫిర్యాదు వచ్చింది. ఓ చిన్నారి స్కూల్‌లో తన షార్ప్‌నర్ పోయిందంటూ ఫిర్యాదు చేశాడు. దీన్ని చూసిన పోలీసులు తొలుత ఆశ్చర్యపోయినా ఆ తర్వాత సీరియస్‌గా తీసుకుని కేసు ఛేదించారు. చిన్నారి షార్ప్‌నర్‌ను వెతికి పట్టుకుని అప్పగించారు. యూపీలో ఈ వింత ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని (Uttarapradesh) హర్దోయ్ ప్రాంతంలోని పలు స్కూళ్లలో పోలీసులు ఫిర్యాదు పెట్టెలను (పింక్ బాక్సులు) ఏర్పాటు చేశారు. విద్యార్థులు తమకు స్కూళ్లలో ఏమైనా సమస్యలు ఎదురైనా.. ఫిర్యాదు చెయ్యొచ్చని, ఉత్తరాలు రాసి ఆ బాక్సుల్లో వేయాలని సూచించారు. ప్రతి వారం స్కూళ్లకు వెళ్లి ఫిర్యాదు పెట్టెల్లోని లెటర్లను చదివి.. విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తుంటారు.


షార్ప్‌నర్ పోయిందని కంప్లైంట్


కాగా, ఇటీవల ఏ పాఠశాలలోని కంప్లైంట్ బాక్స్ తెరవగా కొందరు విద్యార్థులు తమను టీచర్లు కొడుతున్నారని.. కొందరు తమ స్నేహితులు తరగతి గదిలో అల్లరి చేస్తున్నారని, ఇంకొందరు స్కూల్ బస్సులో గొడవ పడుతున్నారని వారి సమస్యలు రాశారు. అయితే, ఓ విద్యార్థి మాత్రం తన షార్ప్‌నర్ పోయిందని.. ఎవరు తీసుకున్నారో తెలియలేదని వాపోయాడు. తొలుత ఇది చదివిన పోలీసులు ఆశ్చర్యపోయినా.. తమ వంతు బాధ్యతగా కేసును ఛేదించారు. పోయిన షార్ప్‌నర్‌ను వెతికి తిరిగి విద్యార్థికి అప్పగించారు. విద్యార్థుల నుంచి మొత్తం 12 ఫిర్యాదులు అందాయని.. వెంటనే వాటిని పరిష్కరించినట్లు పోలీసులు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. 'సమాజంలో మంచిని పెంపొందించాలంటే విద్యార్థి దశలోనే సాధ్యమని భావించాం. అందుకే పాఠశాలల్లో ఫిర్యాదుల పెట్టెలు పెట్టి, వారి సమస్యలు పరిష్కరిస్తూ చట్టంపై వారికి నమ్మకం కలిగేలా చేస్తున్నాం.' అని ఎస్పీ వెల్లడించారు.


ఈ విషయం వైరల్ కావడంతో నెటిజన్లు హర్దోయ్ పోలీసుల తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలా చేయడం వల్ల పిల్లల్లో చిన్న నాటి నుంచి సత్ప్రవర్తన, సమాజం పట్ల బాధ్యత పెరుగుతుందని కామెంట్స్ చేస్తున్నారు.


Also Read: Parliament Winter Session: పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌ల్లో మ‌ళ్లీ ర‌చ్చ‌, మోదీ సర్కార్ వెనకడుగు వేస్తోందన్న కాంగ్రెస్