Snake In Beer Tin | బీరు టిన్నులో తల ఇరికించిన ఓ పాము దాన్నుంచి బయటకు రాలేక నరకయాతన అనుభవించింది. అది గమనించిన స్థానికులు పాము తలను టిన్ను నుంచి బయటకు తీసేందుకు చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు. దాదాపు మూడు గంటలపాటు ఆ పాము అడ్డ అవస్థలు అన్నీ ఇన్నీ కావు.
బీర్ టిన్ ఎంత పని చేసింది?
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ శివారులో ఈ ఘటన జరిగింది. రైతు వేదిక మైదానంలో మందుబాబులు తాగిపడేసిన బీర్ టిన్‌లో ఓ పాము దూరడానికి యత్నించింది. దీంతో ఆ టిన్నులో పాము తల ఇరుక్కుపోయింది. పాముకు దాహం వేసిందో ఏమో తెలియదు కానీ, టిన్నులో తల దూర్చిన పాము అందులో నుంచి బయటకు రాలేక నానా హంగామా చేసింది. టిన్నును విడిపించుకునేందుకు అక్కడే అటూ ఇటూ తిరిగింది. పాము యాతన గమనించిన స్థానికులు దాన్ని విడిపించేందుకు చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు. సమయానికి పాములను పట్టుకునేవారు కూడా అందుబాటులో లేకపోవడంతో దాదాపు 3 గంటలపాటు ఆపాము అక్కడే ఉండిపోయింది.
ముళ్ల కంచెలోకి పాము
పాము తిప్పలను చూసి అక్కడ గుమిగూడిన జనం చప్పుళ్లకు పాము మరింత కంగారు పడింది. ఇక వెళ్లిపోవాలని అననుకుందో ఏమో ముళ్ల కంచెల్లోకి చొరబడింది. ఈ క్రమంలో పాము తలకు ఇరుక్కున్న బీరు టిన్ను ముళ్ల చెట్లకు తగులుకుని ఊడిపోయింది. దీంతో పాము కూడా బతుకు జీవుడా అనుకుంటూ అక్కడి నుంచి సరసరా పొదల్లోకి పారిపోయింది. ఎట్టకేలకు పాము టిన్ను నుంచి విడిపించుకోవడం చూసి అక్కడున్నవారు కూడా హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాట్సాపు గ్రూపుల్లో తెగ షేర్ చేస్తున్నారు.
వర్షాకాలం కావడంతో పొలాల్లో పాముల సంచారం ఎక్కువగా ఉంటుంది. అవి ఆహారం కోసం ఎక్కువగా బయట తిరుగుతుంటాయి. కప్పలు, ఎలుకలను వేటాడే క్రమంలో ఎక్కువగా మన కంటపడుతుంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో అవి నివాసం ఉంటున్న ప్రదేశానికి నీరు చేరడం వల్ల కూడా కొత్త నివాసాలను వెదుక్కోవడానికి అవి అన్నేషణ సాగిస్తుంటాయి. ఎక్కువగా పొలాల్లోఈ పాముల సంచారం ఉంటుంది.