Police Harrasment to Women | బ‌షీరాబాద్‌లో షాద్‌న‌గ‌ర్ త‌ర‌హా ఉదంతం చోటుచేసుకుంది. పోలీసులు మూడున్నర నెల‌లుగా మ‌హిళ‌ను చావ‌బాద‌డంతో ఆమె కాలూ చేయి క‌ద‌ప‌లేని స్థితిలో దీనంగా ప‌డి ఉంది. కొడుకు ఆచూకీ చెప్పాలని థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించి చిత్ర‌హింస‌ల‌కు గురిచేస్తున్నారు. రోజూ స్టేష‌న్‌కు పిల‌వ‌డం ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు కూర్చోబెట్ట‌డం.. మ‌ధ్య‌మ‌ధ్య‌లో లాఠీల‌తో చావ‌కొట్ట‌డం. గ‌డిచిన మే నుంచి నేటి వ‌రకు ఇదే పోలీసుల దిన‌చ‌ర్య‌. పోలీసుల లాఠీ దెబ్బ‌ల‌కు కాళ్లూ చేతులూ వాచిపోయి ఆమె క‌ద‌ల్లేని స్థితికి చేరుకుంది. ప‌నిచేసుకుంటే త‌ప్ప పూట గ‌డ‌వ‌ని ఆమెను మూడున్న‌ర నెల‌లుగా పోలీస్ స్టేష‌న్‌కు తిప్పించుకుంటూ ఉపాధికి కూడా దూరం చేశారు. స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా జ‌హీరాబాద్ స్టేష‌న్‌కు వెళ్లిన మీడియా ప్ర‌తినిధుల‌కు దీనంగా క‌న‌ప‌డిన మ‌హిళ‌ను క‌దిలిస్తే త‌న క‌డుపుకోత‌ను వెళ్ల‌గక్కింది. 


కూలీ ప‌నులు చేసుకునే త‌ల్లిదండ్రులు...
వికారాబాద్ జిల్లాలోని బషీరాబాద్ మండలం నవల్గా గ్రామానికి చెందిన లోహడ బాలుడు (17), కాశీంపూర్ గ్రామానికి చెందిన బాలిక (16) ఒక‌రినొక‌రు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని మే 2న ఇంట్లోంచి వెళ్లిపోయారు. దీంతో బాలిక త‌ల్లిదండ్రులు తమ కూతురును యువకుడు కిడ్నాప్ చేశాడంటూ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ రమేశ్ కుమార్ మే 4న బాలుడిపై కిడ్నాప్ కేసు నమోదు చేసి, కూలీ పనులు చేసుకునే బాలుడి తల్లి కళావతి, తండ్రి నర్సప్పల‌ను స్టేష‌న్‌కు పిలిపించారు. నీ కొడుకు మైన‌ర్ పిల్ల‌ను కిడ్నాప్ చేసి ఎత్తుకుని పోయాడు. వాడు ఎక్క‌డున్నా రెండు రోజుల్లో బాలిక‌ను తీసుకుని ఇంటికి రాక‌పోతే తుపాకీతో కాల్చి చంపేస్తాన‌`ని వారిని బెదిరించాడు. 


ఉద‌యం 9 గంట‌ల‌ నుంచి రాత్రి 9 వ‌ర‌కు స్టేష‌న్‌లోనే..


వారు ఎక్క‌డున్న‌రో త‌న‌కు తెలియ‌ద‌ని క‌ళావ‌తి ఎస్సైకి చెప్పింది. ప‌ట్నంలో ప‌నిచేసుకునేవాడు, ఆ పిల్ల‌తో ప్రేమ కుదిరిందంట‌, ఆ విష‌యం బాలిక త‌ల్లికి కూడా తెలుస‌ని చెప్పింది. దీంతో ఒక్క‌సారిగా కోపోద్రిక్తుడైన ఎస్సై తనను చావ‌కొట్టాడని చెప్పుకుని వాపోయింది. ఆ రోజు నుంచి రోజూ ఉద‌యం 9 గంట‌ల‌కు స్టేష‌న్ కు రావ‌డం రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు ఉండేది. వెళ్లే ముందు సారుకి వెళ్తున్నాన‌ని చెప్పి వెళ్లాలి. తాగ‌డానికి నీరు కూడా ఇచ్చేవారు కాద‌ని వాపోయింది. ఆ రోజు నుంచి ఒక్క‌రోజు త‌ప్ప రోజూ స్టేష‌న్ కు వ‌స్తున్నాన‌ని చెప్పుకుని క‌న్నీరుమున్నీరైంది. కూలీ ప‌నులు చేసుకుని క‌డుపు నింపుకునే వాళ్లం. ఇప్పుడు మాకు ఏ ప‌నీ లేకపోవ‌డంతో ఇళ్లు గ‌డ‌వ‌ని ప‌రిస్థితి నెల‌కొంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తోంది. ఈ ఘటనపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన తాండూర్ రూర‌ల్ సీఐ అశోక్ మాట్లాడుతూ.. ఈ కేసు త‌న దృష్టిలో ఉంద‌న్నారు. కిడ్నాప‌ర్ మైన‌ర్ అయినా అరెస్ట్ చేయాల్సిందేన‌ని చెప్పారు. విచార‌ణ‌లో భాగంగానే ఆమెను స్టేష‌న్‌కు పిలిచార‌ని, అయితే కొట్టాడ‌నే సంగ‌తి త‌న‌కు తెలియ‌ద‌న్నారు. దీనిపై విచార‌ణ జ‌రిపి త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు. 



ఇటీవలే షాద్‌నగర్‌ పోలీసులు విచార‌ణ సంద‌ర్భంగా దళిత మహిళపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించార‌నే ఆరోపణలొచ్చాయి. దీనిపై రాజకీయ దుమారం చెలరేగ‌డంతో పోలీసుల‌పై కేసు న‌మోదైంది. షాద్‌నగర్‌ పీఎస్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ (డీఐ) రామ్‌రెడ్డి సహా నలుగురు కానిస్టేబుళ్లపై బాధితురాలు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా వారిపై కేసు రిజిస్ట‌ర్ చేశారు.