Railway Free Wi-Fi : టికెట్ల బుకింగ్, చెకింగ్ వంటి ప్రయాణికుల సౌకర్యాల కోసం రైల్వేశాఖ దేశంలోని సుమారు 6100 రైల్వేస్టేషన్లలో ఫ్రీ వైఫై సేవలు అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికుల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన ఉచిత వైఫై సేవలు దుర్వినియోగం అవుతున్నట్లు తెలుస్తోంది. రైల్వే స్టేషన్‌లలో ప్రయాణికుల రద్దీని దృష్ట్యా రైలు సర్వీసుల సమాచారం, ఫ్లాట్‌ ఫామ్‌ వివరాలు, ఆన్‌లైన్ టికెట్‌ బుకింగ్ వంటి సేవలు వినియోగించుకోడానికి రైల్వే స్టేషన్‌లలో ఉచిత వైఫై అందుబాటులోకి తెచ్చింది భారతీయ రైల్వే. ప్రయాణికులకు మేలు చేసే ఆలోచనతో దేశవ్యాప్తంగా ప్రధాన రైల్వే స్టేషన్‌లలో ఫ్రీ వైఫై సేవలు ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు ఈ వైఫై సేవలు సమస్యగా మారాయి. కొందరు ప్రయాణికులు దీనిని దుర్వినియోగం చేస్తు్న్నారు. తెలుగు రాష్ట్రాలకు కీలకమైన దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కేంద్రం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ లో ఫ్రీ వైఫై పోర్న్ వీడియోల డౌన్లోడుకు కారణం అవుతోంది. ఉచిత వైఫై సేవలతో అధికంగా అశ్లీల వీడియోలు డౌన్‌లోడ్ చేసుకుంటున్నట్లుగా తేలింది.


తిరుపతి స్టేషన్ లో కూడా! 


భారతీయ రైల్వే సంస్థ దేశంలోనే అతి పెద్ద రవాణా సంస్థ. నిత్యం లక్షలాది మందిని తమ గమ్యస్థానాలకు చేర్చుతుంది. ఇలాంటి రైల్వేశాఖ ప్రయాణికుల సౌకర్యం కోసం దేశంలోని సుమారు 6100 రైల్వే స్టేషన్‌లలో ఫ్రీ వైఫై సేవలు అందుబాటులో ఉంచింది. ఈ 6100 రైల్వే స్టేషన్లలో 5000 కంటే ఎక్కువ స్టేషన్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. ఈశాన్య ప్రాంతంలోని అనేక స్టేషన్లు, కశ్మీర్ లోయలోని మొత్తం 15 స్టేషన్లు ఈ తరహాలోనివే. దేశవ్యాప్తంగా అనేక రైల్వే స్టేషన్లలో వైఫై సౌకర్యం అందుబాటులో ఉంది. ఈ పబ్లిక్ వైఫై నెట్‌వర్క్‌లోని మెజారిటీ స్టేషన్‌లు భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు మెరుగైన కనెక్టివిటీ అందిస్తుందని రైల్ టెల్ తెలిపింది. వీటిలో తెలుగు రాష్ట్రాల్లోని పలు రైల్వే స్టేషన్‌లలో ఫ్రీ వై ఫై సేవలు ప్రయాణికులు ఉపయోగించుకుంటున్నారు. రైల్ టెల్ అందిస్తున్న ఉచిత వైఫై వాడకంపై అధికారులు ఆరా తీస్తే షాకింగ్ విషయం తెలిసింది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఫ్రీ వైఫై ద్వారా 35 శాతం మంది అశ్లీల వీడియోలు చూడటం, పోర్న్‌ వీడియోలు డౌన్‌లోడ్ చేస్తున్నట్లు తేలింది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ తర్వాత నాంపల్లి, ఏపీలోని తిరుపతి కూడా ఇదే తరహాలో వైఫై సేవలు దుర్వినియోగం అవుతున్నట్లుగా రైల్ టెల్‌ గుర్తించింది. 


30 నిమిషాల పాటు సర్వీస్ 


ఫ్రీ వైఫై కనెక్ట్ అవ్వడానికి ముందుగా కేవైసీ చెకింగ్ ఉంటుంది. మొబైల్ కనెక్షన్‌తో స్మార్ట్‌ఫోన్‌ను కలిగి ఉన్న ఏ వినియోగదారుకైనా రైల్వే స్టేషన్‌లలో Rail Wire Wi-Fi అందుబాటులో ఉంటుంది. ఈ సౌకర్యం చాలా యూజర్ ఫ్రెండ్లీ. కనెక్షన్‌ని ఆన్ చేయడానికి, ప్రయాణికులు Wi-Fi ఎంపికలను స్కాన్ చేసి, RailWire ను ఎంచుకోవాలి. బ్రౌజర్ లో రైల్‌ వైర్ పోర్టల్‌కి వెళ్లి తర్వాత, అది వన్ టైమ్ పాస్‌వర్డ్ (OTP) పంపించే మొబైల్ నంబర్‌ను అడుగుతుంది. కనెక్ట్ చేసిన తర్వాత Wi-Fi కనెక్షన్ 30 నిమిషాల పాటు కొనసాగుతుంది. ఇది రైలు ప్రయాణీకులకు సమాచారంతో కనెక్ట్ అవ్వడానికి అప్‌డేట్ చేయడానికి సహాయపడుతుంది.