Rajasthan News: ప్రతిరోజూ నిద్రలో లేచి నీళ్లు, మంటలు అంటూ గట్టిగా కేకలు వేస్తున్నాడో బాలుడు. 15 ఏళ్ల వయసు ఉన్న ఇతను.. నిద్రలోనే గన్ చేతులో పెట్టుకొని కాల్పులు జరుపుతున్నట్లు చేస్తుంటాడు. ఇవి చాలవన్నట్లు ఫోన్ స్క్రీన్ పై ఆన్ లైన్ గేమ్ ఆడే కదలికలను అనుకరిస్తూ ఉంటాడు. ఇలా ఎప్పుడూ ఆయన చేతులు వణుకుతూనే ఉంటాయి. అంతేకాదండోయ్ అన్నం తినడం కూడా ఎప్పుడో మానేశాడు. ఏం జరిగిందో అర్థం కాని కుటుంబ సభ్యులు బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. పబ్ జీ గేమ్ కు బాబు బానిస కావడం వల్లే ఇలా జరిగిందని తెలిపారు.
రాజస్థాన్‌లోని అల్వార్‌కు చెందిన 15 ఏళ్ల బాలుడి స్మార్ట్ ఫోన్ లో నిరంతరం గేమ్ ఆడుతూ ఉండేవాడు. రోజుకు 15 గంటల పాటు ఆరు నెలల పాటు నిరంతరంగా పబ్ జీ , బాటిల్ రాయల్, ఫ్రీ ఫైర్ వంటి గేమ్ లు ఆడుతూనే ఉన్నాడు. ఏడో తరగతి చదువుతున్న ఈ బాలుడు తరచుగా పబ్ జీ ఆడడంతో ఆన్ లైన్ గేమ్స్ కు బానిసగా మారాడు. రోజురోజుకూ అన్నం తినడం మానేశాడు. దీంతో సన్నగా, పీలగా అయిపోయాడు. అయితే విషయం గుర్తించిన తల్లిదండ్రులు గత రెండు నెలలుగా బాలుడిని గేమ్ ఆడనీయకుండా నిరోధించారు. అయినప్పటికీ బాలుడు వారికి తెలియకుండా, వారు లేనప్పుడు, చూడనప్పుడు మొబైల్ తీసుకొని గేమ్స్ అడుతుండేవాడు. అంతేకాకుండా అర్థరాత్రుళ్లు నిద్రలో కేకలు వేయడం, మొబైల్ స్క్రీన్ పై చేతులు కదిలిస్తున్నట్లు వణుకుతూనే ఉండేవాడు.
విషయం గుర్తించిన తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొన్నాళ్ల పాటు తరచుగా ఇలాగే చేయడంతో.. మొదట జైపూర్ లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు బాలుడు ఆన్ లైన్ గేమ్స్ కు బానిసయ్యాడని, అందుకే ఇలా చేస్తున్నారని తెలిపారు. మానసిక వైద్యుల బృందం ప్రస్తుతం బాలుడికి అవసరమైన వైద్య సహాయం అందిస్తోంది. ప్రస్తుతం అతడిని అల్వార్ లోని ఓ వికలాంగ హాస్టల్ లో ఉంచుకొని చికిత్స అందిస్తున్నారు. అక్కడఉన్న కౌన్సెలర్లు అతడిని నిశితంగా గమనిస్తారు. పబ్ జీ, ఇతర ఆన్ లైన్ గైమ్ లను ఎక్కువగా ఆడడం వల్లే బాలుడికి ఈ పరిస్థితి వచ్చిందని.. వికలాంగుల సంక్షేమ ఫౌండేషన్‌లోని శిక్షకుడు భవానీ శర్మ తెలిపారు.
కౌన్సిలింగ్ సెషన్‌ల సమయంలో బాలుడు తరచుగూ గేమ్స్ ఆడడం, అవే వ్యసనంగా మారి అతని మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని స్పష్టమైందన్నారు. నిద్రలో ఉన్నప్పుడు కూడా బాలుడి వేళ్లు చురుకుగా ఉంటాయని వివరించారు. పదేపదే ఆటలు ఆడినట్లు కదులుతాయన్నారు. అతని శరీరం వణుకుతుందని, అలాగే ఎప్పుడూ మొబైల్ ఫోన్‌ను పట్టుకున్నట్లుగా తన చేతులను గట్టిగా పట్టుకుంటాడని పేర్కొన్నారు. బాలుడు వాస్తవికతతో సంబంధం కోల్పోయాడని సూచించే విధంగా ప్రవర్తిస్తాడన్నారు. అయితే బాబులో మెల్లి మెల్లిగా మార్పు వస్తుందని చెబుతున్నారు. బాలుడి తల్లి ఓ ఇంట్లో సహాయకురాలిగా పని చేస్తుండగా.. అతని తండ్రి రిక్షా నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. కుమారుడికి ఇలా జరగడంతో కన్నీటిపర్యంతం అవుతున్నారు. మరోవైపు హాస్టల్‌లో అందించే చికిత్స, కౌన్సెలింగ్ ఆ యువకుడు తన వ్యసనాన్ని అధిగమించడానికి మానసికంగా మళ్లీ దృఢంగా మారడానికి సహాయ పడుతుందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.