Pochamma Ammavaru Sips Milk In Madeenaguda Temple: పోచమ్మ అమ్మవారు పాలు తాగుతున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం అంటున్నారు అక్కడి ఆలయ పూజారులు. గత 3 రోజులుగా అమ్మవారు పాలు తాగుతున్నారంటూ గుర్తించి ఆలయం కమిటీకి తెలపగా వారు కూడా వచ్చి అమ్మవారు పాలు స్వీకరిస్తున్నట్లు గమనించి ఆశ్చర్యపోయారు. ఈ ఘటన శేరిలింగంపల్లి (Serlingampally) నియోజకవర్గంలోని మదీనాగూడలో (Madeenaguda) చోటు చేసుకుంది. గ్రామంలో శ్రీ పోచమ్మ అమ్మవారి దేవాలయం ఉంది. స్వయంభువుగా వెలసిన పోచమ్మ తల్లి అమ్మవారికి ఇక్కడి స్థానికులు నిత్యపూజలు చేస్తారు.


ఆలయంలో అద్భుతం



అయితే, గత మూడు రోజులుగా పోచమ్మ అమ్మవారు భక్తులు సమర్పించిన పాలు తాగుతున్నట్లు ఆలయ పూజారి నవీన్ కుమార్ తెలిపారు. ఇదే విషయం ఆలయ కమిటీ సభ్యులకు తెలుపగా శుక్రవారం వారు స్వయంగా అమ్మవారికి చెంచాతో పాలు పట్టించారు. అమ్మవారు పాలను స్వీకరించినట్లు గుర్తించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న భక్తులు ఆలయానికి బారులు తీరారు. అధిక సంఖ్యలో పాలు సమర్పిస్తూనే ఉన్నారు. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు తరలివస్తున్నారు. ఇది అమ్మవారి మహిమే అంటూ భక్తులు పేర్కొంటున్నారు. అయితే, ఈ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. అమ్మవారు పాలు తాగడం వెనుక శాస్త్రీయ కారణాలు ఏమైనా ఉన్నాయా.? అనే దానిపై చర్చ సాగుతోంది.


Also Read: TG ECET Counselling: తెలంగాణ ఈసెట్‌ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల, ముఖ్యమైన తేదీలివే