Mount Everest Climbing: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్టు. పూర్తిగా మంచుతో కప్పబడి ఉండే ఈ అతిపెద్ద శిఖరాన్ని అధిరోహించాలని చాలా మంది ఔత్సాహికులు జీవిత లక్ష్యంగా పెట్టుకుంటారు. ఇప్పటి వరకు ఎంతో మంది ప్రపంచంలోని నలుమూల నుంచి వచ్చిన వారు ఎవరెస్ట్ ను అధిరోహించారు. మౌంట్ ఎవరెస్ట్ ను అధిరోహించడం మాటల్లో అందుకోలేని సాహసం. అక్కడి వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ, ఎముకలు కొరికే చలిలో, అతి తక్కువ ఆక్సిజన్ మాత్రమే ఉండే చోట రోజుల తరబడి ప్రయాణం సాగించడం చాలా కష్టం. అలాంటి బరువైన లగేజీ మోసుకుంటూ ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకోవడం ఎంతో సాహసోపేతమైనది.


మొట్టమొదటిసారి 1953 మే 29వ తేదీన ఎడ్మండ్ హిల్లరీ, టెన్జింగ్ నార్గే మౌంట్ ఎవరెస్ట్ ను అధిరోహించారు. అప్పట్లో అందుబాటులో ఉన్న పరికరాలు, సాంకేతికత వాడుకుని ఎవరెస్ట్ ను అధిరోహించారు. ఎన్నో ఇబ్బందులు పడి మరీ ఈ ఘనతను సాధించారు. దాదాపు 70 ఏళ్ల తర్వాత ఇప్పుడు అధునాతన పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానంతో ఎవరెస్ట్ ను ఎక్కుతున్నారు ఔత్సాహికులు. అయినా ఇప్పటికీ ఎవరెస్ట్ ప్రయాణం అత్యంత క్లిష్టమైనదే. కానీ ఈ మధ్యకాలంలో ఎవరెస్ట్ ను అధిరోహిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 


ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం ఎంతో సాహసంతో కూడుకున్నది. ఎన్నో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అయితే పర్వతారోహకులు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎలా అధిరోహిస్తారు, అత్యంత క్లిష్టమైన ఆ వాతావరణంలో ఎలా జీవిస్తారు, ఎన్ని రోజుల్లో ఎవరెస్ట్ ను అధిరోహించవచ్చు, మౌంట్ ఎవరెస్ట్ ను ఎక్కేటప్పుడు పర్వతారోహకులు ఏం తింటారు, వారితో పాటు ఏం తీసుకెళ్తారు లాంటి ప్రశ్నలు చాలా మందికి వస్తుంటాయి. వాటికి సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం.


ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించడానికి ఉత్తమ సమయం?


ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి ఉత్తమం సమయం మే నెల. ప్రపంచంలోనే ఎత్తైన ఈ శిఖరాన్ని ఎక్కడానికి అనువైన సమయం మే 15 నుంచి మొదలవుతుంది. ఈ సమయంలో ఎవరెస్ట్ పై ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. అంటే చలి తక్కువగా ఉంటుంది.


ఎవరెస్ట్ జర్నీ ఎక్కడ ప్రారంభమవుతుంది?


ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి రెండు మార్గాలు ఉన్నాయి. అందులో ఒక మార్గం దక్షిణ మార్గం, ఇది నేపాల్ లో ఉంటుంది. మరొకటి ఉత్తర మార్గం, ఇది టిబెట్ లో ఉంటుంది.


ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి ఎన్ని రోజులు పడుతుంది?


ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి దాదాపు 2 నెలల సమయం పడుతుంది. మౌంట్ ఎవరెస్ట్ ను గ్రూపులుగా అధిరోహిస్తారు. ఒక బృందంగా ఏర్పడి ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకోవాల్సి ఉంటుంది.


ఎవరెస్ట్ శిఖరానికి వెళ్లాలంటే ఎంత ఖర్చవుతుంది?


ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి 35 వేల డాలర్ల నుంచి లక్ష డాలర్ల వరకు ఖర్చు అవుతుంది. ఇది శిక్షణ, గ్రూపు ఇతర విషయాలపై ఆధారపడి ఉంటుంది. ఇందులో నేపాల్ నుంచి పర్మిట్ కోసమే 11 వేల డాలర్లు పెట్టి అనుమతి పొందాల్సి ఉంటుంది. ప్రతి ఏటా కొందరికి ఎవరెస్ట్ ను అధిరోహించేందుకు అనుమతి ఇస్తారు. వారిని మాత్రమే ఎవరెస్ట్ పైకి అనుమతిస్తారు. 


పర్వతారోహకులు తమ వెంట ఏం తీసుకెళ్తారు?


ఎవరెస్ట్ ను అధిరోహించే వారు తమ వెంట కోల్డ్ సేవింగ్ వస్తువులు, ప్రత్యేక బూట్లు, టార్చ్ లు, టెంట్లు సహా ఇతర ఎమర్జెన్సీ వస్తువులు తమ వెంట తీసుకెళ్తారు. ఇందులో వైద్య సామాగ్రి కూడా ఉంటుంది. అలాగే తక్షణ శక్తిని ఇచ్చే డ్రై ఫ్రూట్స్, చాక్లెట్లు, మాంసాహారం లాంటివి తమ వెంట తీసుకెళ్తారు.