Monkey Helping Video: మూగజీవాలు ఒకటికొకటి సాయం చేసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నాయి. కొందరి మనుషుల కంటే తామే బెటర్ అని నిరూపించుకుంటున్నాయి. జాతి వైరం ఉన్నప్పటికీ కుక్క పిల్లికి పాలివ్వడం, కుక్కపై కోతి ఎక్కి తిరగడం, కుక్కలు, కోతులు మనుషులను కాపాడడం వంటి ఎన్నో వీడియోలను మనం నెట్టింట్లో చూస్తుంటాం. అలాంటి ఓ వీడియోనే ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. అయితే అదేంటో మనం ఇప్పుడు చూద్దాం. 






ఒక కోతి జింకకు తినేందుకు ఆకులు అందిస్తూ సాయం చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన ప్రతీ ఒక్కరూ తమ స్నేహితులు, బంధువులకూ షేర్ చేస్తున్నారు. వందలాది మంది కామెంట్లు చేస్తున్నారు. ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద  కోతి, జింక స్నేహాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఆ వీడియోలో ఒక కోతి.. జింకకు అందని చెట్టు ఆకులను తినేందుకు తెంపి ఇస్తోంది. అద్భుతమైన ఈ వీడియోలో రెండు జింకలు చెట్టు కింద నిలబడి, ఆకులను తినడానికి ప్రయత్నిస్తుంటాయి. కొమ్మ ఎత్తులో ఉండడంతో జింకలు తినలేకపోతున్నాయి. విషయం గుర్తించిన ఓ కోతి.. కొమ్మపై కూర్చొని దాన్ని కిందకు వంగేలా చేస్తుంది. దీంతో కింద ఉన్న రెండు జింకలకు కొమ్మలు అందడంతో.. ఆకులు తింటాయి.






ఈ వీడియోలో కోతి, జింక స్నేహం చక్కగా రికార్డు అయింది. జింకకు ఆహారం ఇవ్వడానికి కోతి చేసిన సహాయాన్ని వీక్షకులు అభినందించకుండా ఉండలేరు. ఒకే జాతి జంతువులు కాకపోయినా పరస్పరం సహాయం చేసుకోవటం చాలా మంచి విషయమని నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి గుణం కలిగిన జంతువులే మనుషుల కంటే నయం అని చెబుతున్నారు. ఈ వీడియో ఇప్పటి వరకు 51 వేలకు పైగా వ్యూస్ ను సాధించింది. అయితే మానవుల్లో కనిపించిన ఓ మానవీయత ఓ కోతిలో చూడడం చాలా సంతోషంగా ఉందని ఓ నెటిజెన్ రీట్వీట్ చేశాడు. అలాగే ప్రకృతి మనకు ఎన్నో మంచి విషయాలను నేర్పిస్తుంది... వీడియో చాలా బాగా తీశారంటూ మరొకరు కామెంట్ చేశారు. "జంతువులను చూసి మానవులు సాయం చేసే గుణాన్ని నేర్చుకోవాలి. మతం, జాతి వంటి వాటితో సంబంధం లేకుండా ఒకరికొకరు సాయం చేసుకోవడం మానవ లక్షణం. ఇంత మంచి వీడియో మాతో పంచుకున్నందుకు చాలా థాంక్స్ మిస్టర్ నందా" అంటూ మరో నెటిజెన్ రీట్వీట్ చేశాడు.