Bengaluru Metro Telugu News: ఢిల్లీ మెట్రో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏదో విధంగా ఢిల్లీ మెట్రో (Delhi Metro) నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది. కొన్ని అసభ్యకర ఘటనల కారణంగా ఇటీవల ఢిల్లీ మెట్రో హాట్ టాపిక్ అయ్యేది. నిత్యం రద్దీగా ఉండే మెట్రో రైలులో ప్రయాణికుల అసభ్యకర చేష్టలు, ముద్దుసీన్లు, డ్యాన్స్ రీల్స్, ఘర్షణలు వంటి వీడియోలకు కేరాఫ్ గా ఢిల్లీ మెట్రో మారింది. అయితే, ఈ సంస్కృతి ఇప్పుడు బెంగళూరు నగరానికి పాకింది. తాజాగా రద్దీగా ఉండే బెంగళూరు మెట్రో రైల్లో (Bengaluru Metro Rails) ఇద్దరు ప్రయాణికులు బాక్సింగ్ తరహాలో ఘర్షణ పడ్డారు.
హోరాహోరీ పోరు
రద్దీగా ఉన్న రైలులో ఇద్దరు ప్రయాణికులు గొడవకు దిగారు. ఇద్దరి మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో నిల్చోడానికి కూడా చోటు లేని రైల్లో నాన్‌స్టాప్‌గా ఒకరిపై ఒకరు దూషించుకుంటూ పంచ్‌లు విసురుకుంటున్నారు. ఇద్దరు ప్రయాణికులు కొట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరూ ఒకరి గొంతు మరొకరు పట్టుకుని తన్నుకుంటూ, కొట్టుకుంటున్నారు. మెట్రోలో పెద్ద సంఖ్యలో జనం కనిపిస్తారు. ఒకరిద్దరు వ్యక్తులు కూడా ఇద్దరి మధ్య గొడవ సద్దుమణిగేలా చూస్తున్నారు. కానీ ఇద్దరూ హోరాహోరీగా పోట్లాడుకోవడం కనిపిస్తుంది.
వైరల్ అవుతున్న వీడియో
ఈ ఇద్దరి మధ్య నెలకొన్న గొడవకు గల కారణం మాత్రం తెలియరాలేదు. తోటి ప్రయాణికులు కలుగజేసుకుని వీరి మధ్య ఘర్షణకు అడ్డుతగిలారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో X హ్యాండిల్ @ChristinMP_లో షేర్ చేశారు. ‘బెంగళూరులో రద్దీగా ఉండే మెట్రోలో ఇద్దరు ప్రయాణికుల మధ్య గొడవ జరిగింది. BMRCL ఈ వీడియోను సమీక్షిస్తోంది, మరింత సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ’ అంటూ రాసుకొచ్చారు. ఈ వీడియో చాలా వేగంగా వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ వీడియోపై తమకు తోచినట్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.
ఢిల్లీ మెట్రో యూట్యూబ్ ఛానెల్
ఇది ఇలా ఉంటే.. ఢిల్లీ మెట్రోలో చిన్న చిన్న విషయాలకు కూడా ప్రజలు గొడవ పడుతున్నారు. సీట్లు నుండి మేకింగ్ రీల్స్ వరకు వాదనల వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్‌గా ఉంటాయి. గతంలో ఢిల్లీ మెట్రోలో అమ్మాయిలు పోల్ డ్యాన్స్ చేయడం.. ఇక లవర్స్ చుట్టూ ఉన్న సమాజాన్ని మర్చిపోయి ముద్దులు, హగ్‌లతో రెచ్చిపోవడం, మరికొందరైతే ఏకంగా హస్త ప్రయోగం, యువతీ యువకులు అసభ్యకరంగా ఉన్న వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. వీటి కారణంగా ఢిల్లీ మెట్రో తన సొంత యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించాలని, అది బాగా డబ్బులు సంపాదించి పెడుతుందని నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీ మెట్రో ప్రభావం బెంగళూరు మెట్రోపై కూడా పడినట్లు కనిపిస్తోంది.