జీతం ఇచ్చేవాడికి కోపం వస్తే జీవితం తలకిందులైపోతుందని ఓ సినిమా డైలాగ్. ఇక్కడ మాత్రం సీన్ రివర్స్‌. యజమానికి కోపం వచ్చి ఉద్యోగిని ఫైర్ చేస్తే... ఆ ఉద్యోగి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 


కెనడాలోని కాల్గరీ సరస్సు పక్కన ఉన్న లగ్జరీ ఇళ్లను ఓ వ్యక్తి ధ్వంసం చేశాడు. ప్రొక్లేనర్ సాయంతో చాలా ఇళ్లను పడగొట్టాడు. అతను ఎందుకు అలా చేస్తున్నాడో ఎవరికీ అర్థం కాలేదు. ఈ విషయాన్ని కొందరు స్థానికులు పోలీసులకు ఇన్ఫామ్ చేశారు. వెంటనే స్పాట్‌కు వచ్చిన పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అప్పటికే చాలా ఇళ్లను ఆ వ్యక్తి ధ్వంసం చేశాడు.


ఇళ్లను ధ్వంసం చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించారు. అతను చెప్పిన విషయాలు పోలీసులను షాక్‌కి గురి చేశాయి. ఆ వ్యక్తి చేసిన విధ్వంసాన్ని వీడియో తీసిన కొందరు స్థానికులు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. అతను ఎందుకీ పని చేశాడో వివరించారు.  


కోపంతో ఊగిపోతూ ఇళ్ల ధ్వంసం..


ఇళ్లను ధ్వంసం చేసిన వ్యక్తి మెరీనాలో పని చేసేవాడు. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ... అతన్ని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు యజమాని చెప్పాడు. తనను ఉద్యోగంలో నుంచి తీసేయడాన్ని ఆ వ్యక్తి తట్టుకోలేకపోయాడు. ఆ కోపంలోనే ప్రొక్లేనర్ సాయంతో మెరీనా మొత్తాన్ని నాశనం చేసేందుకు సిద్ధమయ్యాడు. కొన్ని ఇళ్లను ధ్వంసం కూడా చేశాడు.


ఇలా విధ్వంసం చేస్తున్న టైంలో పోలీసులు వచ్చి అతన్ని అరెస్టు చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారిపోయింది. దీనిపై కామెంట్స్ చేసిన నెటిజన్లు... అలాంటి ఇళ్లు నిర్మించుకోవాలంటే మాత్రం మీకు చాలా టైం పడుతుందని కామెంట్స్ చేశారు. క్షణాల్లోనే వైరల్ గా మారిన ఈ వీడియోకు 2 లక్షల 72 వేల కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. మొత్తం 5 వేల కంటె ఎక్కువ మంది లైక్ చేశారు. వందల మంది కామెంట్లు చేశారు. ఇప్పటికి కార్మిక వర్గం ఉవ్వెత్తున లేచిందంటూ కామెంట్లు ఎక్కువ వచ్చాయి.



గతంలోనూ ఇతడిపై అల్లర్ల కేసులు...


59 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చాలా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతంలోనే అతనిపై కేసులు ఇప్పటికే కేసులు ఉన్నట్టు గుర్తించారు.  3 వేల 906 డాలర్ల జరిమానా పడిన అల్లర్ల కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ధ్వంసమైన ఇళ్ల యజమాని పోలీసుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఒకటి కంటె ఎక్కువ ఇళ్లు పూర్తిగా నాశనం అయ్యాయని.. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు వివరించాడు. 59 ఏళ్ల వ్యక్తి ఇంతటి దుశ్చర్యకు పాల్పడినట్టు తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని అన్నాడు. తాను ఊహించనిది జరిగిందని అయితే ఈ దుర్ఘటనలో ఎవరూ గాయపడకపోవడం మంచి విషయంగా పేర్కొన్నాడు. తనపై కోపంతో ఇలా ఇళ్లను కూల్చడం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నాడా యజమాని. ధ్వంసమైన ఇళ్లను బాగు చేయించాలంటే మిలియన్ల డబ్బు కావాలని తెలిపారు. యజమానిపై కోపంతో ఇళ్లు కూల్చిన వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు కొద్దిసేపు విచారించి తర్వాత కోర్టులో హాజరుపరిచారు.