Viral Video: మధ్య ప్రదేశ్‌లోని కట్నీలో రెవెన్యూ విభాగానికి చెందిన వీఆర్ఓ 5 వేల రూపాయల లంచం తీసుకున్నాడు. అయితే పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన జబల్‌పూర్ లోకాయుక్త స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఎస్‌పీఈ) బృందం... అతడిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీఆర్ఓ గజేంద్ర సింగ్ ఓ భూమి కేసులో ఫిర్యాదుదారుడు చందన్ సింగ్ లోధిని లంచం ఇవ్వమని అడిగాడు. ఐదు వేలు ఇస్తే తప్ప పని చేయనని చెప్పాడు. దీంతో ఫిర్యాదుదారుడు జబల్ పూర్‌లోని లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారుల బృందం బిల్హారీకి చేరుకుంది.


రూ.4,500 లను నమిలి మింగేసిన అధికారి


ఈక్రమంలోనే ఫిర్యాదుదారుడు చందన్ సింగ్ లోధి.. వీఆర్ఓ ప్రైవేటు కార్యాలయంలో రూ.4,500 రూపాయలు లంచంగా ఇస్తుండగా... రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈక్రమంలోనే వీఆర్ఓ ఆ డబ్బును నోట్లో కుక్కుకిని నమిలి మింగేశాడు. విషయం గుర్తించిన అధికారులు వెంటనే అతడికి జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స సమయంలో వీఆర్ఓ నోటి నుంచి లంచం నోట్లు గుజ్జు రూపంలో బయట పడ్డాయి. 


"సింగ్ లంచం కోరుతున్నట్లు బర్ఖెడా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మాకు ఫిర్యాదు చేశాడు. దీంతో మేము రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలనుకున్నాం. కానీ పిర్యాదుదారుడి నుంచి డబ్బు తీసుకున్న వెంటనే వీఆర్ఓ ఎస్పీఆ బృందాన్ని గుర్తించి డబ్బును మింగేశాడు. దీంతో వెంటనే అతన్ని  మేము ఆసుపత్రికి తరలించాం. ప్రస్తుతం అతడి ఆరోగ్యం బాగానే ఉంది." అని ఎస్పీఈ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంజయ్ సాహు తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నట్లు ఎస్పీ వెల్లడించారు.