Karnataka News: కర్ణాటకకు చెందిన ఓ ఇంటి యజమాని కరెంటు బిల్లును చూసి ఖంగుతిన్నాడు. ఇది నిజంగా తన ఇంటికి వచ్చిందేనా అని పదే పదే మీటర్ నంబర్ చూసుకుంటూ ఉండిపోయాడు. చూస్తే అంతా కరెక్టుగానే ఉంది కానీ.. రెండు వేలో, మూడు వేలో రావాల్సిన బిల్లే లక్షల్లో వచ్చింది. ఏకంగా ఏడు లక్షలు రావడంతో ఏం చేయాలో పాలుపోలేదు. వెంటనే విద్యుత్ శాఖ అధికారుల వద్దకు వెళ్లి తనకు వచ్చిన బిల్లును చూపించాడు. తన ఇంట్లో వాడుతున్న వాటి గురించి చెప్పి.. బావురుమన్నాడు. తప్పు తమవద్దే జరిగిందని తెలుసుకున్న అధికారులు మరో బిల్లును ఇచ్చి అతడిని ఇంటికి పంపారు.
అసలేం జరిగిందంటే..?
కర్ణాటక ఉల్లాల్ కు చెందిన సదాశివ ఆచార్య అనే వ్యక్తికి ఇటీవలే కరెంట్ బిల్లు వచ్చింది. అయితే ప్రతీనెల 2 వేల నుంచి 3 వేల వరకూ బిల్లు వచ్చేంది. కానీ జూన్ నెలలో మాత్రం ఏకంగా 7 లక్షల 71 వేల 72 రూపాయలు వచ్చింది. ఇది చూసిన సదాశివ ఆచార్య ఖంగుతిన్నాడు. అది నిజంగా తన ఇంటికే వచ్చిందా అని పదే పదే చెక్ చేశాడు. తనకే వచ్చినట్లు గుర్తించి వెంటనే సంబంధిత అధికారులను కలిశాడు. ఎప్పుడూ వేలల్లో వచ్చే బిల్లు ఈసారి ఏకంగా లక్షల్లో వచ్చిందని చెప్పి వాపోయాడు. అయితే ఆ బిల్లును తీసుకొని చెక్ చేసిన అధికారులు.. బిల్లు తప్పుగా ప్రింట్ అయినట్లు గుర్తించారు. వెంటనే దాన్ని సరి చేసి రూ.2,838 బిల్లును అతడి ఇంటికి పంపారు.
‘‘ఏజెన్సీల ద్వారా బిల్లుల సేకరణ జరుగుతుంది. ఈ (ఆచార్య) విద్యుత్ బిల్లు బిల్లు రీడర్ లోపం వల్ల తప్పుగా పరింట్ అయింది. కరెంటు బిల్లులో తప్పులుంటే వినియోగదారుడికి ఇవ్వము. సవరించిన బిల్లును ఆచార్యకు అందజేస్తాం.”అని ఉల్లాల్ మెస్కామ్ సబ్-డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఎ దయానాడ అన్నారు.
గృహజ్యోతి పథకంలో భాగంగా అధికార కాంగ్రెస్ చేసిన ప్రధాన ఎన్నికల వాగ్దానాలలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఒకటి. అయితే విద్యుత్ ఛార్జీల పెంపుదల ఏప్రిల్ నుంచి అమల్లోకి రావడంతో పలు ఇళ్లకు విపరీతంగా విద్యుత్ బిల్లులు వస్తున్నాయి. మే 12 టారిఫ్ ఆర్డర్ ప్రకారం.. జూన్‌లో యూనిట్‌కు 70 పైసల పెంపుదల విధించాలనే విద్యుత్ సరఫరా కంపెనీల ప్రతిపాదనలను కర్ణాటక ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆమోదించిన తర్వాత విద్యుత్ ధర పెరిగింది. దీంతోపాటు ఏప్రిల్‌కు సంబంధించిన యూనిట్‌కు 70 పైసల బకాయిలు కూడా జూన్‌లో బిల్లులకు జతచేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇటీవలే తెలంగాణలోనూ ఇలాంటి ఘటనే
కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలంంలో కొత్తపల్లి గ్రామ పంచాయతీ ఉంది. ఆ పంచాయతీ కార్యాలయానికి ప్రతినెల తరహాలోనే జనవరి నెల కరెంట్ బిల్లు వచ్చింది. కానీ ఆ బిల్లు చూసిన సర్పంచ్, కార్యదర్శికి మాత్రం గుండె ఆగినంత పనైంది. ఎందుకంటే కొత్తపల్లి గ్రామ పంచాయతీకి జనవరి నెలకుగానూ రూ.11,41,63,672 (11 కోట్ల 41 లక్షల 63 వేల 6 వందల 72 రూపాయలు) విద్యుత్ బిల్లు వేశారు. వందలు, వేలల్లో రావాల్సిన కరెంట్ బిల్లు కోట్ల రూపాయల్లో రావడంతో గ్రామానికే షాక్ కొట్టినట్లు అయింది. వామ్మో ఇదేంది.. ఈ రేంజ్ లో కరెంట్ బిల్లులు వసూలు చేస్తున్నారా అంటూ గ్రామస్తులు షాక్ అయ్యారు.