EU Pass New Law for Removable battery: ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న అన్ని స్మార్ట్‌ఫోన్‌లు అన్నీ నాన్-రిమూవబుల్ బ్యాటరీతో వస్తున్నాయన్న సంగతి తెలిసిందే. అంటే ఫోన్ నుంచి బ్యాటరీని తీసివేయడం సాధారణ వినియోగదారుడికి కష్టం అన్నమాట. కానీ ఇప్పుడు మరోసారి రిమూవబుల్ బ్యాటరీలు మొబైల్ ఫోన్‌లలో తిరిగి రావచ్చు. దీనికి సంబంధించి యూరోపియన్ యూనియన్ ఒక చట్టాన్ని ఆమోదించింది.


మొబైల్ ఫోన్ కంపెనీలు నాన్ రిమూవబుల్ బ్యాటరీలతో వచ్చే స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించడానికి అనుమతి ఉండదు. ప్రస్తుతం ఈ చట్టానికి యూరోపియన్ యూనియన్‌లో ఆమోదం లభించింది. అంటే ఇక్కడి వినియోగదారులు రాబోయే కాలంలో స్మార్ట్‌ఫోన్ బ్యాటరీని సులభంగా చేత్తో తీసేయచ్చన్న మాట.


కానీ ఇప్పుడే కాదు
ఈ కొత్త చట్టం నేటి నుంచి మూడేళ్ల తర్వాత అమల్లోకి రానుంది. అంటే 2027 నుంచి యూరోపియన్ యూనియన్‌ దేశాల్లో విక్రయించే స్మార్ట్‌ఫోన్‌లలో రిమూవబుల్ బ్యాటరీలు అందుబాటులో ఉంటాయి. యూరోపియన్ యూనియన్ తీసుకున్న ఈ నిర్ణయంపై స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు ఎలా స్పందిస్తాయో చూడాలి.


ఈ-వ్యర్థాలను తగ్గించి పర్యావరణానికి హాని కలగకుండా కాపాడేందుకు యూరోపియన్ యూనియన్ కూడా ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. స్మార్ట్ ఫోన్ల విషయంలో యూరోప్ చాలా పెద్ద మార్కెట్. కంపెనీలు యూరోప్ కోసం ఒక మోడల్, మిగతా దేశాల కోసం మరో మోడల్ స్మార్ట్ ఫోన్లను తయారు చేయడం కష్టం. కాబట్టి త్వరలో ప్రపంచవ్యాప్తంగా రిమూవబుల్ బ్యాటరీతో స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయ్యే అవకాశం ఉంది.


టైప్-సి ఛార్జర్‌కి సంబంధించిన చట్టం కూడా
మొబైల్ ఛార్జర్ లేదా బ్యాటరీకి సంబంధించి యూరోపియన్ యూనియన్ చట్టాన్ని రూపొందించడం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం యూఎస్‌బీ టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్‌కు సంబంధించిన నియమాన్ని ఆమోదించింది. ఈ చట్టానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. 2025 నుంచి ఫోన్‌లో టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌ను అందించాలని భారత ప్రభుత్వం కూడా అన్ని మొబైల్ కంపెనీలను కోరింది. ఈ చట్టం యొక్క ఉద్దేశ్యం వినియోగదారుల ఖర్చులతో పాటు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించడం కూడా.


మరోవైపు ఇన్‌స్టాగ్రామ్‌లో నోట్స్‌ అనే కొత్త ఫీచర్‌ను మెటా గతంలో తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇందులో రెండు కొత్త ఫీచర్లను కూడా జోడించింది. ఇప్పుడు యూజర్లు తమకు ఇష్టమైన పాటను ఇన్‌స్టాగ్రామ్ నోట్‌లో సెట్ చేసుకోవచ్చు. అలాగే నోట్‌లో వ్రాసిన పదాలను ట్రాన్స్‌లేట్ చేయడం ద్వారా, ఆ వ్యక్తి తమ భాషలో ఏమి రాశారో మీరు తెలుసుకోవచ్చు.


ఇన్‌స్టాగ్రామ్‌లోని నోట్స్ ఫీచర్‌ను కంపెనీ గత ఏడాది డిసెంబర్‌లో ప్రారంభించింది. దీనిలో వినియోగదారులు 60 అక్షరాల వరకు నోట్స్‌ను రాయవచ్చు. ఈ ఫీచర్ ఒక విధంగా యూజర్ అప్‌డేట్‌ను ఫాలోయర్‌లకు అందిస్తుంది. వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి ఇప్పుడు కంపెనీ మ్యూజిక్ ఎంపికను కూడా జోడించింది. స్టోరీ లాగా 24 గంటల పాటు చాట్ సెక్షన్ పైన నోట్స్ కూడా కనిపిస్తాయి. ఎవరైనా మీ నోట్‌కి రిప్లై ఇస్తే, అది మీకు చాట్ విభాగంలో కనిపిస్తుంది.


Read Also: ప్రపంచాన్ని కళ్ల ముందుకు తెస్తున్న యాపిల్ - విజన్ ప్రో హెడ్‌సెట్ లాంచ్ - రేటు ఎంతంటే?