Tropics Day 2023: ఐక్యరాజ్య సమితి జూన్ 29వ తేదీన అంతర్జాతీయ ఉష్ణమండల దినోత్సవాన్ని జరుపుతుంది. ఆ రోజు ఉష్ణమండల దేశాలు ఎదుర్కొంటున్న ప్రత్యేకమైన సవాళ్లను, అవకాశాలను హైలెట్ చేస్తుంటారు. ఉష్ణమండల దేశాల్లోని అసాధారణ జీవ వైవిధ్యంపై అవగాహన కల్పిస్తారు. అంతర్జాతీయ ఉష్ణమండల దినోత్సవం.. ఉష్ణమండలం అంతటా పురోగతిని పరీశిలించడానికి, నైపుణ్యాలను పంచుకోవడానికి, ఆ ప్రాంత వైవిధ్యాన్ని, సామర్థ్యాన్ని గుర్తించడానికి అవకాశం కల్పిస్తుంది. కర్కాటక రేఖ, మకర రేఖ మధ్య ఉండే ప్రాంతాన్ని ఉష్ణమండలంగా పరిగణిస్తారు. ఉష్ణమండలంలో ప్రకృతి వైవిధ్యం ఆకట్టుకుంటుంది. ప్రపంచంలో ఎక్కగా లేని విధంగా ఇక్కడ వర్షాలు కురుస్తుంటాయి. భూమి పరిమాణంలో ఉష్ణమండలాలు 40 శాతానికి పైగా ఆక్రమించాయి. ఇక్కడ జీవ, ప్రకృతి వైవిధ్యం గురించి అవగాహన కల్పించడం కోసం ప్రతి ఏటా జూన్ 29వ తేదీన అంతర్జాతీయ ఉష్ణమండల దినోత్సవాన్ని జరుపుకోవడం మొదలైంది. 

ఉష్ణమండల ప్రాంతాల్లో సూర్య కాంతి నేరుగా పడుతుంది. ఇక్కడి ప్రాంతాలు వేడిగా, తేమగా ఉంటాయి. భూమధ్య రేఖకు సమీపంలోని తేమతో కూడిన అంతర్గత ప్రాంతాల్లో వర్షం పడటం ఉష్ణమండల ప్రాంతాల ప్రధాన లక్షణం. ఉష్ణమండల ప్రాంతానికి వాతావరణ మార్పులు, పట్టణీకరణ, అటవీ ప్రాంత నిర్మూలన, జనాభా మార్పులు సవాళ్లగా మారుతున్నాయని ఐక్యరాజ్య సమితి గుర్తించి ఉష్ణమండల ప్రాంతాలను రక్షించుకునే లక్ష్యంలో భాగంగా ఈ దినోత్సవాన్ని జరుపుతోంది.

అంతర్జాతీయ ఉష్ణమండల దినోత్సవం చరిత్ర:

12 ప్రముఖ ఉష్ణమండల పరిశోధన సంస్థల మధ్య సహకారంగా ఈ ఇంటర్నేషనల్ ట్రాపిక్స్ డే నిలుస్తుంది. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఈ తీర్మానాన్ని ఆమోదించినప్పటికీ.. జూన్ 29, 2014 నుంచి జరుపుకోవడం మొదలైంది. ఈ తీర్మానం ప్రకారం ప్రతి సంవత్సరం జూన్ 29న ఇంటర్నేషనల్ ట్రాపిక్స్ డే ను నిర్వహిస్తోంది ఐక్యరాజ్య సమితి. 

95 శాతం ఉష్ణమండల ప్రాంతాలే!

ప్రపంచంలోని మడ అడవుల్లో దాదాపు 95 శాతానికి పైగా ఉష్ణమండల ప్రాంతాల్లోనే ఉన్నాయి. 99 శాతం మడ జాతులకు ఉష్ణమండల అడువులే నివాస ప్రాంతాలుగా ఉన్నాయి. ప్రపంచంలోని పునరుత్పాదక నీటి వనరుల్లో సగానికి పైగా ఇక్కడి ప్రాంతాల్లోనే ఉన్నప్పటికీ.. ఉష్ణమండల ప్రాంతాల ప్రజలు నీటి కొరతను ఎదుర్కొనే అవకాశాలూ ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఉష్ణమండల ప్రాంతాల్లో జీవ వైవిధ్యం ఎక్కువ. అనేక జీవరాశులకు, జంతుజాలానికి ఉష్ణమండల అడువులు నెలవు. అయితే ప్రపంచంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే.. ఉష్ణమండల అడవుల్లోని జీవవైవిధ్యం ఎక్కువగా దెబ్బ తింటున్నట్లు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

Also Read: Rahul Gandhi Convoy: మణిపూర్‌లో రాహుల్ గాంధీ పర్యటన- మధ్యలో కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అంతర్జాతీయ ఉష్ణమండల దినోత్సవం 2023 థీమ్

ఈ ఏడాది ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉష్ణమండల దినోత్సవానికి 'ది ఫ్యూచర్ బిలాంగ్స్ టు ది ట్రాపిక్స్(భవిష్యత్తు ఉష్ణమండలానిదే)' అనే థీమ్ ను నిర్ణయించింది. భవిష్యత్తుకు ఉష్ణమండలాల ప్రాముఖ్యతను, ఈ ప్రాంతాల స్థిరమైన అభివృద్ధిని, అందుకు కావాల్సిన పెట్టుబడుల గురించి ఈ థీమ్ ను తీసుకుంది ఐక్యరాజ్య సమితి.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial