Viral News: గురుగ్రామ్ కు చెందిన ఓ మహిళ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గురుగ్రామ్ లోని సైబర్ సిటీలో ఓ మహిళ.. క్యాబ్ లో 13 గంటల పాటు ప్రయాణించింది. చివరికి క్యాబ్ డ్రైవర్ డబ్బులు అడగడంతో తనపై వేధింపుల కేసు పెడతానని, తప్పుడు కేసుల్లో ఇరికిస్తానని బెదిరించి డబ్బులు కట్టకుండానే వెళ్లిపోయింది. సదరు మహిళ.. క్యాబ్ డ్రైవర్ తో, పోలీసు అధికారితో వాగ్వాదానికి దిగిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జ్యోతి అనే మహిళ అర్ధరాత్రి మేదాంత ఆస్పత్రి సమీపం నుంచి ఓలా యాప్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకున్నట్లు క్యాబ్ డ్రైవర్ దీపక్ తెలిపారు. అర్ధరాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం 11 గంటల వరకు ఒక చోటు నుంచి మరో చోటుకు తిప్పుతూనే ఉన్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఇలా తరచూ డెస్టినేషన్లను మారుస్తూ ఉండటంతో.. అసలెక్కడికి వెళ్లాలో స్పష్టంగా చెప్పాలని అడిగానని, తను చెప్పకపోవడంతో సైబర్ సిటీలో డ్రాప్ చేసినట్లు దీపక్ చెప్పారు. ట్రిప్ ముగిసిన తర్వాత ఆ మహిళ డబ్బు ఇవ్వలేదని, గట్టిగా అడిగితే తప్పుడు కేసులో ఇరికిస్తానని బెదిరించినట్లు ఆ క్యాబ్ డ్రైవర్ వాపోయాడు. 


దీంతో గురుగ్రామ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పాడు డ్రైవర్ దీక్. పేటీఎం ద్వారా చెల్లింపు చేస్తానని జ్యోతి చెప్పినప్పటికీ.. రెండు గంటలు అయినా డబ్బులు పంపించలేదని దీపక్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులతోనూ జ్యోతి దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటన మొత్తాన్ని అక్కడే ఉన్న మరో మహిళ రికార్డు చేసిన ట్విట్టర్ లో సదరు వీడియోను పోస్టు చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. 






జ్యోతి ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు


క్యాబ్ లో గంటలకు గంటలు ప్రయాణించి చివరికి డబ్బులు చెల్లించకుండా డ్రైవర్లతో గొడవలకు దిగడం, తప్పుడు కేసులో ఇరికిస్తానని బెదిరించడం జ్యోతికి ఇదే మొదటిసారి కాదని.. గతంలోనూ ఇలా చేసినట్లు దీపికా నారాయణ్ భరద్వాజ్ అనే మహిళ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. సదరు మహిళ క్యాబ్ లు బుక్ చేసుకుంటూ.. వేధింపుల కేసులో ఇరికిస్తానని డ్రైవర్లను బెదిరిస్తున్నట్లు రాసుకొచ్చారు. పోలీసులు ఆ మహిళపై చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు.