తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొద్ది వారాల క్రితం నిర్వహించిన గ్రూప్ 1 పరీక్ష ప్రిలిమ్స్ ఫలితాలను అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించే వరకూ విడుదల చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ధర్మాసనం ఆదేశానుసారం తాము ఫలితాలను విడుదల చేయబోమని టీఎస్పీఎస్సీ వెల్లడించింది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్న పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో నేడు (జూలై 25) విచారణ జరిగింది. దీనికి సంబంధించిన పిటిషన్‌పై టీఎస్‌పీఎస్‌సీ కౌంటర్ దాఖలు చేసింది. వాదనలు వినిపించేందుకు వచ్చే సోమవారం వరకు సమయం ఇవ్వాలని హైకోర్టును టీఎస్పీఎస్సీ ధర్మాసనాన్ని కోరింది. సోమవారం అడ్వకేట్‌ జనరల్‌ వాదనలు వినిపిస్తారని.. అప్పటివరకు గ్రూప్‌-1 ఫలితాలు ప్రకటించబోమని హైకోర్టుకు తెలిపింది. దీంతో తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.


గ్రూప్ 1 ప్రిలిమ్స్ ని రద్దు చేయాలని ఎన్ఎస్‌యూఐతో పాటు పలువురు అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు. గ్రూప్ 1 పరీక్షలో  బయోమెట్రిక్ పెట్టలేదని పిటిషన్ లో పేర్కొన్నారు. ఇదే పిటిషన్ విచారణ సందర్భంగా త్వరలో గ్రూప్ 1 ఫలితాలను ప్రకటించేందుకు టీఎస్పీఎస్సీ ప్రయత్నాలు చేస్తుందని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు.


ఫలితాలు ప్రకటించకుండా స్టే ఇవ్వాలని పిటిషనర్లు కోర్టును కోరారు. దీంతో తదుపరి విచారణ జరిగే వరకు గ్రూప్ 1  ఫలితాలు ప్రకటించవద్దని హై కోర్ట్ మౌఖిక ఆదేశాలు ఇచ్చింది.


గ్రూప్ 1 పరీక్ష నిర్వహణలో అనేక సమస్యలు తలెత్తినప్పటికీ టీఎస్పీఎస్సీ అన్నిటినీ అధిగమించి పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే. కానీ అడుగడుగునా దీనికి అడ్డంకులు ఎదురవుతున్నాయి. తాజాగా ఎన్ఎస్‌యూఐతోపాటు మరికొంత మంది అభ్యర్దులు గ్రూప్ 1 పరీక్ష నిర్వహణలో బయోమెట్రిక్ పెట్టలేదని పిటిషన్ దాఖలు చేశారు.


గత నెలలోనే ప్రిలిమ్స్ కీ విడుదల


తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ జూన్‌ 11న నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక 'కీ' ని జూన్ 28న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందబాటులో ఉంచింది. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థులు రెస్పాన్స్ షీట్లను కూడా కమిషన్ విడుదల చేసింది. అభ్యర్థులు తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ, హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి రెస్పాన్స్ షీట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జులై 27 వరకు అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లు అందుబాటులో ఉండనున్నాయి.





Powered By





 


Video Player is loading.








 






Loaded: 0.00%
 








గ్రూప్-1 ప్రిలిమ్స్ ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే తెలిపేందుకు టీఎస్‌పీఎస్సీ అవకాశం కల్పించింది. అభ్యర్థులు జులై 1 నుంచి జులై 5న సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలు నమోదుచేయవచ్చు. ఆన్‌లైన్ ద్వారా నమోదుచేసే అభ్యంతరాలను మాత్రమే అధికారులు పరిగణనలోకి తీసుకుంటారు. మరే ఇతర విధనాాల్లోనూ అభ్యంతరాల నమోదుకు అవకాశం లేదు. నిర్ణీత గడువు తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ అభ్యంతరాలను స్వీకరించరు.


రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ పరీక్షకు 2.32లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే. మొత్తం 503 గ్రూప్‌ 1 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ప్రిలిమ్స్‌ పరీక్ష ప్రిలిమినరీ కీ, ప్రశ్నాపత్రాలు, ఓఎంఆర్‌ షీట్లను ఈ కింది లింక్‌లపై క్లిక్‌ చేయడం ద్వారా పొందొచ్చు.


గ్రూప్-1 ఆన్సర్ కీ కోసం క్లిక్ చేయండి..


అభ్యర్థులు ఓఎంఆర్ పత్రాల కోసం క్లిక్ చేయండి.. 


ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 61.16 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. గ్రూప్-1 పోస్టుల భర్తీకి  మొత్తం 3.80 లక్షల మందికి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,32,457 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ప్రశ్న పత్రం లీకేజీ కారణంగా గతేడాది అక్టోబర్ 16న జరిగిన గ్రూప్-1 పరీక్షను రద్దు చేయడంతో మళ్లీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్ష కోసం 994 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. గతంలో జరిగిన లోటుపాట్లు, గందరగోళం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.