World Richest Dog: మనుషుల్లో లక్షాధికారులు, కోటీశ్వరులు, మిలియనీర్లు, బిలియనీర్ల కావడం గురించి మన అందరికీ తెలిసిందే. కానీ జంతువులు.. అందులోనూ ముఖ్యంగా శునకాలు కోటీశ్వరులుగా ఉండడం చాలా వినడం, చూడడం ఇదే మొదటిసారి. పెంపుడు జంతువులను తమ ఇంట్లో సభ్యుల్లాగా చూస్కోవడం, వాటికి బర్త్ డేలు, డెత్ డేలు, ప్రసవాలు వంటివి చేయడం అందరికీ తెలుసు. కానీ వాటికి ఆస్తి రాసివ్వడం గురించి ఎవరూ కనీ వినీ ఉండరు.
ఇప్పుడు మనం చూడబోయే శునకానికి కోట్లాది సంపద, పెద్ద పెద్ద కార్లు, బంగ్లాలు, పని మనుషులు కూడా ఉన్నారు. అంతేకాదండోయ్ ఓ కంపెనీ కూడా ఉంది. దానికి ఈ శునకమే యజమాని. నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇదే నిజం. ఇటలీకి చెందిన గుంథర్ VI కోటీశ్వరురాలు. దీని మొత్తం ఆస్తులు దాదాపు రూ.655 కోట్ల వరకు ఉంటుంది. అంతే కాదండోయ్ ఈ శునకానికి చాలా మంది సేవకులు కూడా ఉన్నారు. దీనికి ఎప్పుడు ఏం కావాలో వాళ్లే దగ్గరుండి చూసుకుంటారు. దాని సంరక్షణ పనిలోనే వారు ఎల్లవేళలా పని చేస్తుంటారు.
జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన ఈ కుక్క ఒకప్పుడు పాప్ స్టార్ మడోన్నా ఇంట్లో ఉండేది. ఇప్పుడు వేరే కోటీశ్వరుడి ఇంట్లో ఉంది. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతోంది. త్వరలోనే ఈ కోటీశ్వరురాలైన శునకంపై నెట్‌ఫ్లిక్స్‌లో 'గుంథర్ మిలియన్స్' అనే డాక్యుమెంటరీ కూడా చిత్రీకరించారు. దీన్ని బట్టే ఈ శునకం రేంజ్ ఏంటో మీరు తెలుసుకోవచ్చు. ఈ డాక్యుమెంటరీలో గుంథర్ VIకి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇందులో శునకం ఆస్తి గురించే కాకుండా.. శునకం ఈ ఆస్తిని ఎలా సంపాదించిందో కూడా వివరించారు.
గుంథర్ VI కోటీశ్వరురాలు ఎలా అయిందంటే?
నివేదికల ప్రకారం... ఈ జర్మన్ గుంథర్ VI అనే శునకం కౌంటెస్ కార్లోటా లైబెన్‌స్టెయిన్ నుంచి కోట్ల ఆస్తిని పొందింది. లీబెన్‌స్టెయిన్ కుమారుడు గుంథర్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అతనికి వారసుడు లేకుండా పోయాడు. అలాంటి పరిస్థితిల్లో తాను చనిపోయే ముందు అంటే 1992లో ఓ ట్రస్ట్ ను నెలకొల్పాడు. అలాగే అతనికి చాలా ఇష్టమైన ఈ శునకం కోసం 6.5 బిలియన్ రూపాయల కంటే ఎక్కువ విలువైన ఆస్తిని రాసిచ్చాడు. దానికి పని మనుషులను కూడా పెట్టి సంరక్షణా బాధ్యతలను అప్పగించాడు. ఇలా ఈ గుంథర్ VI కోటీశ్వరురాలు అయింది. అంతే కాదండోయ్ గుంథర్ VI ఇటాలియన్ ఫార్మాస్యూటికల్ కంపెనీకి యజమాని అని కూడా డాక్యుమెంటరీలో తెలిపారు.
అందుకే ఈ డాక్యుమెంటరీకి విశేష స్పందన
ఈ కుక్కపై డాక్యుమెంటరీ తీసిన దర్శకుడు ఆరేలియన్ లెటర్జీ.. దీని కథ నిజంగా షాకింగ్‌గా ఉందని అంటున్నారు. ఒక కుక్క ఇంత ధనవంతురాలిగా ఇంత విలాసవంతమైన జీవనశైలిని ఎలా గడుపుతుందో తెలుసుకొని అందరూ ఆశ్యర్యపడుతున్నారని అన్నారు. ప్రపంచంలోనే అత్యంత ధనిక శునకం గురించి తెలుసుకోవాలని చాలా మంది అనుకోవడం వల్ల తాను తీసిన డాక్యుమెంటరీకి విశేష స్పందన లభిస్తోందన్నారు.