Earth Hour Day 2022 | వాతావరణ మార్పు, ఎనర్జీ పరిరక్షణపై అవగాహణ పెంచడం కోసం ఏటా ‘ఎర్త్ అవర్ డే’ను ప్రపంచమంతా పాటిస్తోంది. ‘ఎర్త్ అవర్ డే’ అనేది ఒక ఈవెంట్ పేరు. ఈ రోజు ప్రజలంతా తమ ఇళ్లు, ఆఫీసుల్లో గంట సేపు లైట్లు ఆర్పేస్తారు. సిడ్నీలోని వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఈ ‘ఎర్త్ అవర్ డే’ను నిర్వహిస్తుంది.   ‘ఎర్త్ అవర్’ పురస్కరించుకుని ఏటా మిలియన్ల మంది ప్రజలు లైట్లను ఆఫ్ చేయడం ఒక ఉద్యమంలా మారింది.


ఈ రోజే ఎందుకు?: ‘ఎర్త్ అవర్ డే’ను ఏటా మార్చి చివరి శనివారం నిర్వహిస్తారు. ఈ ఏడాది ‘ఎర్త్ అవర్ డే’ శనివారం (26,2022)న వచ్చింది. ఈ నేపథ్యంలో స్థానిక కాలమానం ప్రకారం ఈ రోజు రాత్రి 8:30 గంటలకు ఎర్త్ అవర్ మొదలవుతుంది. రాత్రి 9:30 గంటలకు ముగుస్తుంది. అంటే, మనం 8.30 గంటలకు లైట్లు ఆర్పేసి.. తిరిగి రాత్రి 9.30 గంటలకు ఆన్ చేయాలి. 


ఎర్త్ అవర్ డే 2022 థీమ్ ఇదే: ఈ ఏడాది ‘ఎర్త్ అవర్ డే’ థీమ్ ‘Shape Our Future’ (షేప్ అవర్ ఫ్యూచర్ - మన భవిష్యత్తును రూపుదిద్దుకుందాం). కాబట్టి.. మీ సోషల్ మీడియా వేదికల్లో #ShapeOurFuture హ్యాష్‌ట్యాగ్ ద్వారా ఇతరులకు కూడా అవగాహన కలిగించండి. ప్రకృతి వనరులు దుర్వినియోగం చేయకుండా కాపాడుకున్నప్పుడే.. వాటిని భవిష్యత్తు తరాలకు అందివ్వగలం. లేకపోతే అవి, మనతోనే నశించిపోతాయి. అది తెలియజేయడానికే ఏటా ‘ఎర్త్ అవర్ డే’ పేరుతో విద్యుత్త్ దీపాలను ఆర్పేస్తారు. దీనివల్ల ఒక గంటపాటు విద్యుత్తు తయారీకి వినియోగించే వనరులు ఆదా అవుతాయి. అయితే, మన ఒక గంటకే ఎంత ఆదా చేయగలరులే అని అనుకుంటే పొరపాటే. ప్రపంచంలో అంతా ఒకేసారి దీపాలను ఆర్పేయడం వల్ల ఆ ఫలితం భారీగా ఉంటుంది.


Also Read: రోజుకు మూడు కప్పుల కాఫీ తాగితే ఎన్నేళ్లు బతుకుతారో తెలుసా? ఇది మీరు ఊహించి ఉండరు!


ఎర్త్ అవర్ డే 2022 చరిత్ర ఇదీ..: 2007లో సిడ్నీలో WWF(World Wide Fund for Nature), దాని మిత్రదేశాలు నిర్వహించిన ‘సింబాలిక్ లైట్స్-అవుట్ ఈవెంట్‌’కు ఎన్నడూలేని ప్రచారం జరిగింది. అక్రమేనా ‘ఎర్త్ అవర్ డే’గా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో అతి పెద్ద ఈవెంట్‌గా మారింది. ప్రతి సంవత్సరం మార్చిలో చివరి శనివారం నాడు, 180కి పైగా దేశాల్లో మిలియన్ల మంది ప్రజలు మన భూగ్రహంపై తమకున్న గౌరవాన్ని తెలియజేసేందుకు తమ ఇళ్లలోని లైట్లను ఆఫ్ చేయడం ద్వారా ఎర్త్ అవర్‌లో పాల్గొంటారు. 2007 నుంచి వాతావరణ మార్పులపై అవగాహన పెంచడానికి మిలియన్ల మంది ప్రజలు ఈ గ్లోబల్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. పచ్చటి ప్రపంచాన్ని కాపాడుకోవడం, కాలుష్యరహిత, వ్యాధుల్లేని జీవన విధానం లభించాలంటే ప్రతి ఒక్కరూ పర్యారవణ పరిరక్షణకు నడుం కట్టాలనేది ఈ ఈవెంట్ నినాదం. మరి, ఈ రోజు రాత్రి 8.30 గంటలకు లైట్లు కట్టేసి సంఘీభావం తెలిపేందుకు మీరు సిద్ధమేనా?


Also Read: డయాబెటిస్‌ బాధితులకు ఈ సమ్మర్ పెద్ద సవాలే, ఈ జాగ్రత్తలు పాటిస్తేనే సేఫ్!