Guntur: దాదాపు 50 లక్షల రూపాయల విలువ చేసే వేల మద్యం బాటిళ్లను ఏటుకూరు డంపింగ్ యార్డు దగ్గర రోడ్డుపై వరుసగా పేర్చారు. గంటూరు ఎస్పీ ఎస్‌ సతీశ్‌ కుమార్‌ సమక్షంలో వాటిని బుల్డోజర్‌తో తొక్కించడానికి ఏర్పాట్లు చేశారు. ఎస్పీ వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కొంత మేర ధ్వంసం కూడా చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లి పోయారు. ఎస్పీ వెళ్లిన కాసేపటికే అక్కడ నుంచి ఉన్నతాధికారులు కూడా వెళ్లి పోయారు. కొందరు పోలీసులు మాత్రమే బుల్డోజర్‌తో ఆ బాటిళ్లు ధ్వంసం చేసే ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.


బాటిళ్ల ధ్వంసాన్ని చూసేందుకు చుట్టుపక్కల నుంచి భారీగా ప్రజలు అక్కడకు వచ్చారు. వాళ్లు ఈ ప్రక్రియను చూడడానికి వచ్చారని పోలీసులు భావించారు. కానీ వాళ్ల మనసు వేరేలా ఆలోచిస్తోందని అంచనా వేయలేక పోయారు. అధికారులందరూ  వెళ్లే వరకూ ఎదురు చూసిన మందుబాబులు మరి కొందరు యువకులు.. యాక్షన్‌లోకి దిగారు. ఎదురుగా మద్యం బాటిళ్లు కనిపించే సరికి వారిని వారు కంట్రోల్ చేసుకోలేక పోయిన మందుబాబులు.. నలువైపుల నుంచి ఒక్కసారిగా దూసుకొచ్చారు. బాటిళ్ల దొంగతనానికి దిగారు.


పోలీసులు కొందరు అడ్డుపడుతున్నా వారిని పక్కకు తోసి మరీ దొరికీనకాడికి బాటిళ్లతో అక్కడి నుంచి ఉడాయించారు. ఒక్కసారిగా మందుబాబులు అక్కడకు చేరుకుంటారని ఊహించని పోలీసులు.. సరిపడా బలగాలను ఉంచక పోవడంతో మందుబాబులకు అడ్డే లేక పోయింది. ఎవరో ఒకరో ఇద్దరు పోలీసులకు జడిసి బాటిళ్లను మళ్లీ అక్కడ పెట్టి వెళ్లారు కానీ మిగిలిన వాళ్లు ఒక్కొక్కరు ఒకటికి మించి మద్యం  బాటిళ్లు పట్టుకెళ్లారు.


ఫలితంగా నెలలు తరబడి పోలీసులు విజిలెన్స్ అధికారులు ఎక్సైజ్‌ అధికారులు పట్టుకున్న అక్రమ మద్యంలో కొంత భాగం మళ్లీ మందుబాబులకు చేరినట్లైంది. అదీ పోలీసులే వారికి అందించినట్లుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం ఇరవై నాలుగు వేల  ముప్ఫై ఏడు బాటిళ్లు ఉండగా వాటిలో 4 వేల 6 వందల 47 లీటర్ల లిక్కర్ ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ లిక్కర్ బాటిళ్లను ఎలక్షన్స్‌ సమయంలో కొంత పోలీసులు స్వాధీనం చేసుకోగా.. మరికొంత అక్రమ రవాణాదారుల నుంచి స్వాధీన చేసుకున్నది.


మొత్తం 9 వందల 47 కేసుల లిక్కర్‌ను వివిధ ఘటనల్లో పట్టుకోగా వాటిని ధ్వంసం చేసేందుకు తీసుకున్న చర్యల్లో ముందస్తు ఏర్పాట్లు లేకపోవడం వల్లే మందుబాబులకు పోలీసులు అవకాశం ఇచ్చినట్లైంది. ఈ ఘటనపై విచారణ ప్రారంభించినట్లు తెలిపిన పోలీసులు.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. భవిష్యత్‌లో ఇలాంటి ఇన్సిడెంట్లు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.


ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. వీటిపై భిన్నమైన కామెంట్లు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో పోలీసుల నిష్క్రియాపరత్వానికి ఈ ఘటనే ఓ ఉదాహరణ అంటూ కొందరు నెటిజన్లు పోలీసులను తిట్టి పోసేందుకు ఈ ఘటనను ఉపయోగించుకుంటున్నారు. మరికొందరు నెటిజన్లు ఐతే నవ్వులు పూయించే మీమ్స్‌తో కామెంట్లు పెడుతున్నారు.