Prakasam barrage : ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయానికి కాదేది అనర్హం. ఏదైనా రాజకీయమే. వరదల విషయంలో టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ మధ్య సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరిగింది. వరద సహాయ కార్యక్రమాలు సుదీర్ఘంగా జరిగిన తర్వాత.. విజయవాడ కాస్త తెరిపిన పడింది అనుకున్న తర్వాత అసలు రాజకీయం ప్రారంభమయింది. ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తినప్పుడు ఎగువ నుంచి ఐదు బోట్లు కొట్టుకు వచ్చాయి. అందులో మూడు బోట్లు వైసీపీ రంగులతో ఉన్నాయి. అన్నీ ఒకదానితో ఒకటి కట్టేసి ఉన్నాయి. అప్పట్లోనే ఇది కుట్రా అని మీడియా చంద్రబాబును అడిగితే.. దానికి స్పందించడానికి ఇది సమయం కాదని.. వరదల పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత మాట్లాడతానన్నారు. ఇప్పుడు ఆ బోట్ల వెనుక కుట్ర ఉందని ఆయన పదే పదే ఆరోపిస్తున్నారు. ఇదంతా జగన్ కనుసన్నల్లోనే జరిగిందని చెబుతున్నారు.
గతంలో ఎంత వరద వచ్చినా బోట్లు కొట్టుకు రావడం అరుదు
కృష్ణానదికి ఎన్నో సార్లు వరదలు వచ్చాయి. కానీ బోట్లు కొట్టుకు రావడం అన్నది చాలా అరుదు. జగన్ సీఎం అయిన తొలి ఏడాదిలో ఓ బోటు కొట్టుకు వచ్చి గేటుకు ఇరుక్కుపోయింది. మొత్తం బ్యారేజీని ఖాలీ చేసిన తర్వాత ఆ బోటును తీయాల్సి వచ్చింది. ఆ బోటును ఎవరు వదిలారు.. ఎందుకు వదిలారు.. ప్రమాదవశాత్తూ కొట్టుకు వచ్చిందా అన్నది మాత్రం విచారణ చేయలేదు. చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఈ ఏడాది మళ్లీ వందేళ్లలో రానంత ఇన్ ఫ్లో బ్యారేజీకి వచ్చింది. అదే సమయంలో ఓ రాత్రి పూట బోట్లు కొట్టుకు వచ్చాయి. మూడు బోట్లను తాళ్లతో కలిపి కట్టేసి ఉన్నారు. మరో రెండు బోట్లు కిందకు వెళ్లిపోయాయనని గర్తించారు. అంటే మొత్తం ఐదు బోట్లు గుర్తించారు. ఈ బోట్లు బ్యారేజీ కౌంటర్ వెయిట్స్ కు తగలడంతో అవి ధ్వంసమయ్యాయి. గేట్లను తాకి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని చెబుతున్నారు.
వరద బాధితుల కోసం విద్యుత్ ఉద్యోగులు భారీ విరాళం, సీఎం చంద్రబాబుకు చెక్కు అందజేత
కుట్రపూరితంగానే బోట్లు వదిలారని పోలీసు శాఖ నివేదిక
ఈ బోట్ల అంశంపై ఇరిగేషన్ శాఖ ఫిర్యాదు చేయడంతో పోలీసు శాఖ వెంటనే స్పందించింది. ఈ బోట్ల యజమానులు ఎవరు.. గతంలో ఈ బోట్లు ఎందుకు వాడారు.. ఎందుకు అలా వరదలో కొట్టుకుపోయేలా వదిలేశారు అన్నదానిపై సమగ్ర నివేదిక ఇచ్చారు. జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్న తలశిల రఘురాం అనుచరులు అయిన ఉషాద్రి, కోమటి రామ్మోహన్ అనే వ్యక్తుల్ని అరెస్టు చేశారు. ఆ బోట్లు వారివే. ఇంత వివాదం జరుగుతున్నా పోలీసులు గుర్తించేదాకా ఆ బోట్లు తమవేని మందుకు రాలేదు. ఆ బోట్లను అక్రమ ఇసుక రవాణా కోసం వాడుకునేవారు. బాపట్ల ఎంపీగా ఉన్నప్పుడు నందిగం సురేష్ తన నియోజకవర్గం కాకపోయినా జగన్ వద్ద ఉన్న పలకుబడితో అమరావతిలో ఇసుక అంతా ఆయన దేనన్నట్లుగా వ్యవహరించేవారు. రోజూ కనీసం వంద లారీలు పెట్టి ఇసుక తరలించేవారని .. ఇలా బోట్లలో నది మధ్య నుంచి ఇసుకను తీసుకొచ్చేవారని పోలీసులు చెబుతున్నారు. ఎప్పుడూ ఉద్దండరాయుని పాలెం దగ్గర ఉండే బోట్లు.. వరద వస్తున్నప్పుడు తీసుకొచ్చి గొల్లపూడి దగ్గర ఉంచారని గుర్తించారు. అక్కడ పెట్టినప్పుడు తలశిల రఘురాం కూడా వచ్చి పరిశీలించారని పోలీసులు గుర్తించారు. అంటే.. ఆ బోట్లను ఉద్దేశపూర్వకంగా వరదల్లో వదలడానికే ఏర్పాట్లు చేశారు.
Nara Lokesh: 'లక్షలాది మంది జలసమాధి అయ్యేలా జగన్ కుట్ర' - మంత్రి నారా లోకేశ్ సంచలన ట్వీట్
అరెస్టు చేసిన వారి ఫోన్లు, కాల్ డేటాలో కీలక విషయాలు
ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేసిన తర్వాత టీడీపీ నేతేలు నేరుగా జగన్, సజ్జల రామకృష్ణారెడ్డిపైనే ఆరోపణలు గుప్పిస్తున్నారు. వారిది దేశద్రోహమని.. పది లక్షల మందిని చంపేందుకు ప్లాన్ చేశారని అంటున్నారు. బోట్లతో ప్రకాశం బ్యారేజీకి డ్యామేజీ అయ్యేలా చేయాలని జగన్ మోహన్ రెడ్డి సజ్జలకు ఫోన్ చేశారని.. సజ్జల రామకృష్ణారెడ్డి ఆ బాధ్యతను తలశిల రఘురాంతో పాటు నందిగం సురేష్‌కు ఇచ్చారని అంటున్నారు. ఈ మేరకు వారి మధ్య వాట్సాప్ కాల్స్ జరిగాయని వాదిస్తున్నారు. పోలీసుల నుంచి వచ్చిన సమాచారం మేరకే హోంమంత్రి ఇలాంటి ఆరోపణలు చేసి ఉంటారని భావిస్తున్నారు. ఒక వేళ అదే నిజం అయితే త్వరలో పోలీసులు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. పూర్తి సాక్ష్యాలతో కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. ఓ ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు దాన్ని ఆసరాగా చేసుకుని మరో బారీ విపత్తుకు కుట్ర చేయడం అత్యంత ఘోరమైన విషయమని టీడీపీ వర్గాలంటున్నాయి.
ఇప్పటికే జగన్ సీఎంగా ఉన్న సమయంలో జరిగిన అవినీతి, అవకతవకల విషయంలో అనేక విచారణలు జరుగుతున్నాయి. ఇప్పుడు మాత్రం చంద్రబాబు సీఎం అయిన తర్వాత జరిగిన కుట్ర కేు. ఈ విషయంలో టీడీపీ నేతలు చాలా అగ్రెసివ్ గా ఉన్నారు. అందుకే ఈ కుట్రలో జగన్ పాత్రను వెలికి తీస్తారని గట్టిగా చెబుతున్నారు.