Delivery Man Letter: పొరపాట్లు ప్రతి ఒక్కరూ చేస్తారు. కొన్నిసార్లు తప్పు చేయాలన్న ఉద్దేశం లేకపోయినా తప్పులు జరిగిపోతుంటాయి. ఆ తర్వాత వాటిని ఎలా సరిదిద్దుకున్నామనేది ముఖ్యం. పశ్చాత్తాపంతో హృదయపూర్వకంగా చెప్పే క్షమాపణలతో ఆ తప్పులను మైమరిపించవచ్చు. అలాంటి పనే చేశాడు ఓ డెలివరీ బాయ్. అతగాడు చేసిన ఓ పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాటు నెటిజన్ల మనసును గెలుచుకుంటోంది. అంతగా ఆ డెలివరీ బాయ్ ఏం చేశాడు.. అసలు కథ ఏంటో ఓ లుక్కేయండి.


ఓ వ్యక్తి ఫుడ్ కోసం ఆన్‌లైన్ లో ఆర్డర్ చేశాడు. ఆ ఫుడ్ ఆర్డర్ ను తీసుకొచ్చిన  డెలివరీ బాయ్ అనుకోకుండా వరండాలోని పూల కుండీని పగులగొట్టాడు. తన వల్ల జరిగిన పొరపాటుకు క్షమాపణ కూడా అడిగాడు ఆ డెలివరీ బాయ్. ఆ పూల కుండీకి ఎంతనో చెబితే డబ్బులు ఇస్తానన్నాడు. కానీ ఆ ఇంట్లోని వ్యక్తి ఆ డెలివరీ బాయ్ ను డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పాడు. పొరపాట్లు ఎవరైనా చేస్తారని, అనుకోకుండా జరిగిన దానికి ఫీల్ అవ్వొద్దని చెప్పాడు. కానీ ఆ డెలివరీ బాయ్ మాత్రం తాను తప్పు చేశానని, తన వల్లే వారికి నష్టం కలిగిందన్న పశ్చాత్తాపంతోనే అక్కడి నుండి వెళ్లిపోయాడు. 






మూడ్రోజుల తర్వాత అంటే మే 31న ఆ డెలివరీ బాయ్.. ఓ కొత్త పూల కుండీని, దాంతో పాటు తన తప్పును క్షమించాలని, తన వల్ల జరిగిన పొరపాటుకు ప్రాయశ్చిత్తంగా మరో పూలకుండీని ఇస్తున్నట్లు చెబుతూ ఓ లెటర్ రాసి పెట్టాడు. వాటిని ఇంటి వద్ద పెట్టేసి వెళ్లిపోయాడు. వాటిని గమనించిన ఆ ఇంటి యజమానులు ఆ డెలివరీ బాయ్ క్షమాపణలు చెప్పిన తీరుకు ఫిదా అయిపోయారు. 






ఆ లెటర్‌లో ఏముందంటే..


'హలో, నేను ఉబర్ ఈట్స్ డ్రైవర్. నా పేరు జోర్డాన్. నేను పగులగొట్టిన పూల కుండీని ఇది భర్తీ చేయగలదని నేను అనుకోవడం లేదు. నేను పూల కుండీ పగులగొట్టినా మీరు నా పట్ల దయతో ఉన్నందుకు థ్యాంక్స్. నేనిచ్చే పూల కుండీ ఏమంత అందంగా లేదని నాకు తెలుసు. కానీ మీకిది ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను' - జోర్డాన్