పశ్చిమ బెంగాల్ (కోల్ కతా హౌరా) నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. షాలిమార్- కోరోమాండల్ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో బాలాసోర్ సమీపంలో గూడ్స్ రైలును ఢీకొట్టి, పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 7 బోగీలు పట్టాలు తప్పగా, దాదాపు 150 మంది వరకు గాయపడ్డారు. ప్రస్తుతానికి 132 మందిని సోరో సీహెచ్‌సీకి, గోపాల్ పూర్ సీహెచ్సీ, ఖాంటపాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చికిత్స కోసం తరలించినట్లు ఒడిశా చీఫ్ సెక్రటరీ తెలిపారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించేందుకు 50 అంబులెన్సులు కూడా సరిపోలేదని సమాచారం.
రైలు ప్రమాదం ఘటనపై బెంగాల్ సీఎం మమత దిగ్భ్రాంతి..
షాలిమార్ - కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాద ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ రాష్ట్ర ప్రజల కోసం ఒడిశా ప్రభుత్వంతో, సౌత్ ఈస్ట్రన్ రైల్వేలతో సమన్వయం చేసుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నాం అన్నారు. ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ నెంబర్లు 033- 22143526/ 22535185 ఉన్నాయని మమతా బెనర్జీ తెలిపారు. సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని, ఎవరైనా వివరాల కోసం పైన తెలిపిన నెంబర్లకు ఫోన్ చేయాలని ఆమె సూచించారు.
ఒడిశా ప్రభుత్వం, రైల్వే అధికారులతో సమన్వయం చేసుకుని రెస్క్యూ ఆపరేషన్‌లలో సహాయం చేయడానికి బెంగాల్ నుంచి 5- 6 మంది సభ్యుల బృందాన్ని సంఘటనా స్థలానికి పంపుతున్నట్లు బెంగాల్ సీఎం మమత తెలిపారు. బాధితులకు అండగా ఉంటామని, మెరుగైన వైద్యం అందిస్తామని ఆందోళన చెందవద్దని సూచించారు.
12841 షాలిమార్ - చెన్నై కోరమండల్ ఎక్స్ ప్రెస్ ఘటనపై హెల్ప్ లైన్ నెంబర్లు..
హౌరా హెల్ప్ లైన్ నెంబర్: 033-26382217
ఖరగ్ పూర్ హెల్ప్ లైన్ నెంబర్: 8972073925 & 9332392339
బాలాసోర్ హెల్ప్ లైన్ నెంబర్: 8249591559 & 7978418322
షాలిమార్ హెల్ప్ లైన్ నెంబర్: 9903370746
నెంబర్లకు సహాయం కోసం గానీ, వివరాల కోసం సంప్రదించాలని సౌత్ ఈస్ట్రన్ రైల్వే అధికారులు సూచించారు.
తమిళనాడుకు చెందిన ప్రయాణికులు భారీ సంఖ్యలో ఉండటంతో సీఎం ఎంఎకే స్టాలిన్ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కు కు కాల్ చేసి వివరాలు తెలుసుకున్నారు. తమిళనాడుకు చెందిన కొందరు ఐఏఎస్ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మరోవైపు ఒడిశా సీఎం పట్నాయక్ స్పెషల్ రిలీఫ్ కమిషనర్ కార్యాలయానికి చేరుకుని ప్రమాదం వివరాలపై సమీక్షిస్తున్నారు.