Restaurant Bill From 1985: ఇంట్లో చేసిన ఫుడ్ రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. కానీ ఈ మధ్య కాలంలో జాబ్ టెన్షన్, ఇతర పనుల వల్ల రెస్టారెంట్లలో తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కొన్నిసార్లు ఇంట్లో ఉన్నా రెస్టారెంట్స్ నుంచి తమకు కావాల్సిన ఆహారాన్ని ఆర్డర్ చేసుకుని లాగించేస్తున్నారు. వేలకు వేలు బిల్లులు అవుతాయని ఆలోచించినా, కొందరు లగ్జరీ కోసం బయటకు వెళ్లి అప్పుడప్పుడు తింటుంటారు. అయితే డిల్లీలోని లజపత్ నగర్ లో ఉన్న లజీజ్ రెస్టారెంట్ &హోటల్ 1985 డిసెంబర్ 20 నాటి బిల్లును షేర్ చేసింది. అది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
ఈ రోజుల్లో రెస్టారెంట్ బిల్లులు:
మనలో చాలా మంది బయట రెస్టారెంట్, హోటల్లో తింటూ ఉంటాం. చాలా మంది తక్కువ ఆహారం, ఎక్కువ బిల్లులు గురించి మాట్లాడుతుంటారు. ఇంకా ట్యాక్స్‌లు కలిపి బిల్లుల మోత మోగిస్తారని కొందరు ఫుడ్డీస్ భావిస్తారు. ఇద్దరు, ముగ్గురికి ఒకపూట బయట భోజనానికి 1000- 1200 రూపాయల దాకా ఖర్చవుతుంది. 4 దశాబ్దాల క్రితం ధరల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఒక రెస్టారెంట్ షేర్ చేసిన బిల్లు ఇంటర్‌నెట్‌లో హాట్ టాపిక్ గా మారింది.
ఆ పోస్ట్ లో ఏముందంటే:
నిజానికి ఆ పోస్ట్ 2013 ఆగస్టు 12న ఫేస్ బుక్ లో షేర్ చేశారు. అది ఇప్పుడు మళ్లీ వైరలవుతుంది. ఆ పోస్ట్ లోని బిల్లులో ఓ కస్టమర్ ఒక ప్లేట్ షాహిపన్నీర్, దాల్ మఖనీ, రైతా, కొన్ని చపాతీలు ఆర్డర్ చేసాడు. మొదటి రెండు వంటకాలకు 8 రూపాయలు, మిగతా రెండింటికీ 5, 6 రూపాయలు అయింది. అన్నిటికంటే ఆశ్చర్యానికి గురి చేసే విషయం మొత్తం బిల్లు విలువ కేవలం 26 రూపాయలు. అప్పుడు బిల్లులు చాలా తక్కువ అని, ప్రస్తుత ధరతో పోల్చి ఈ రోజుల్లో ఒ చిప్స్ ప్యాకెట్ ధరకు సమానం అంటున్నారు నెటిజన్స్.
వైరలవుతున్న పోస్ట్
1985 డిసెంబర్ 20న చేసిన బిల్లు ఫొటో పోస్ట్ షేర్ చేసినప్పటి నుంచి 1800లకు పైగా లైకులు, 587 షేర్లు పొందింది. చాలా మంది నెటిజన్లు ఈ పోస్ట్ చూసి.. "ఒరి దేవుడా అది చాలా తక్కువ బిల్లు, అవునులే ఆ రోజుల్లో చాలా ఎక్కువ" ఈరోజుల్లో చిప్స్ ప్యాకెట్ కూడా రాదని కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా కొన్నేళ్ల తరువాత పాత బిల్లులు చూసుకుంటే మనకు నవ్వు రావడంతో పాటు కొన్ని సందర్భాలలో ఆశ్చర్యం కలుగుతుంది.
నెటిజన్ల రియాక్షన్..
ఒ నెటిజన్ ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటూ " ఆ రోజులు చాలా బాగుండేవి,1968లో 20 లీటర్ల పెట్రోలుకు 20 రూపాయలు, పది పైసలు టైర్లలో గాలి కోసం ఖర్చుచేసేవాణ్ణి. ఆ బంకు ఇప్పటికీ వుంది, ఆంధ్ర మహిళా సభకు ఎదురుగా అనీ, 1972లో ఎస్పీఎస్ లో పని చేసేవాడినని, తన జీతం 550 రూపాయలని కామెంట్ చేశాడు. మరో నెటిజన్ పాత బిల్లును దాచుకొని షేర్ చేసినందుకు ధన్యవాదాలు అని కామెంట్ చేశాడు.