Coin On Railway Track: భారతీయ రైల్వే చుట్టూ చాలా మందికి చాలా రకాల జ్ఞాపకాలు అల్లుకుని ఉంటాయి. కొందరు తరచూ రైళ్లలో ప్రయాణిస్తుంటారు.. మరికొందరు ఎప్పుడో ఒకప్పుడు రైలు ఎక్కుతుంటారు. మరికొందరు జీవితంలో ఒక్కసారి కూడా రైలు ఎక్కని వారుంటారు. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో జ్ఞాపకం. తరచూ రైలు ఎక్కే వారిలో ఆ ప్రయాణ మధుర స్మృతులు ఉంటే, ఎప్పుడో ఒకప్పుడు రైలు ఎక్కిన వారిలో ఒకరకమైన ఎగ్జైట్‌మెంట్ ఉంటుంది. ఎప్పుడూ రైలు ఎక్కని వారిలో ఆ ప్రయాణాన్ని ఆస్వాదించాలన్న కోరిక ఉంటుంది. 


ఇంటికి దగ్గర్లో రైల్వే ట్రాక్ ఉన్న చాలా మందికి ఓ అనుభవం, జ్ఞాపకం ఉండే ఉంటుంది. రైలు పట్టాలపై నాణెం పెట్టడం. చిన్నప్పుడు రైలు పట్టాలపై నాణెం పెట్టడం గురించి చాలా రకాల కథలు ప్రచారంలో ఉండేవి. అలా రైలు పట్టాలపై రూపాయి, రెండు రూపాయిల బిళ్లలు పెట్టడం వల్ల రైలు పట్టాలు తప్పి ప్రమాదం జరుగుతుందని చెప్పేవారు. మరికొందరేమో అలా కాయిన్ పెట్టడం వల్ల అది అయస్కాంతంలా మారుతుందనేవారు. రైలు పట్టాలపై నాణెం పెట్టడం వల్ల నిజంగా ఏమవుతుంది.. సైన్స్ ఏం చెబుతోంది.. పట్టాలపై నాణెం పెట్టడం వల్ల నిజంగానే రైలు పట్టాలు తప్పుతుందా.. లేదా నాణెం అయస్కాంతంలా మారుతుందా.. ఇప్పుడు తెలుసుకుందాం. 


గ్రాములు VS టన్నులు


రూపాయి, 2 రూపాయిలు, 5 రూపాయిల నాణెం బరువు కొన్ని గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. మరోవైపు వందలాది మందితో వచ్చే ట్రైన్ బరువు వందలాది టన్నుల బరువు ఉంటుంది. ఒక టన్ను అంటే 10 క్వింటాళ్లు, ఒక క్వింటాల్ అంటే 100 కిలోలు, ఒక కిలో అంటే 1000 గ్రాములు. కొన్ని గ్రాములు మాత్రమే బరువు ఉండే ఒక కాయిన్ కోట్లాది గ్రాముల బరువు ఉండే రైలును ఏం చేయగలదు? ఏమీ చేయలేదు. ఒక చిన్న కాయిన్.. వేగంగా వచ్చే టన్నుల బరువు ఉండే రైలును ప్రభావితం చేస్తుందని అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. 


రైళ్లు అప్పుడప్పుడు పట్టాలు తప్పుతుంటాయి. అలా జరగడానికి అనేక కారణాలు ఉంటాయి. పట్టాల స్థానంలో సమస్యలు, మానవ తప్పిదాలు, సాంకేతిక సమస్యలు, సడెన్ బ్రేకులు వేసినప్పుడు ఇలా అనేక కారణాల వల్ల రైళ్లు పట్టాలు తప్పుతుంటాయి. పట్టాలపై అడ్డంకులు పెట్టడం, మంచు, చెట్లు పడిపోయినప్పుడు, పెద్ద పెద్ద బండరాళ్లు ట్రాక్ కి అడ్డంగా పడ్డప్పుడు కూడా రైలు పట్టాలు తప్పుతుంది. ఇది కొన్ని సార్లు భారీ విపత్తుగా మారుతుంది. పట్టాలు తప్పిన బోగీల్లో ఉండే వారు తీవ్రగాయాలపాలై చనిపోవచ్చు కూడా.  ఒక రైలు బరువుతో పోలిస్తే నాణెం బరువు ఏమాత్రం కాదు. అలాంటి అతి చిన్న వస్తువు, తక్కువ బరువు ఉన్న వస్తువు అంత పెద్ద రైలును ఏమీ చేయలేదు. అలాగే అలా రైలు వెళ్లినప్పుడు నాణెం అయస్కాంతంలా మారుతుంది అని చెప్పడంలో కూడా వాస్తవం లేదు. 


నాణేనికి ఏం జరుగుతుంది?


వందల టన్నుల బరువు ఉండే రైలు నాణెం పై నుండి వెళ్లినప్పుడు ఆ నాణెం ఒత్తిడికి గురవుతుంది. దీని వల్ల దాని పరిమాణం పెరుగుతుంది. గుండ్రంగా ఉండే నాణెం ఆకారం పూర్తిగా మారిపోతుంది. ఇలా రైలు పట్టాలపై నాణెం పెట్టినప్పుడు ఆ పట్టాల వైబ్రేషన్ వల్ల చాలా సందర్భాల్లో రైలు రాకముందే ఆ కాయిన్ కింద పడిపోతుంది.