Rahul Gandhi US Visit:
శాన్‌ఫ్రాన్సిస్కోలో రాహుల్
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ఇటీవలే కర్ణాటక ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఆ పార్టీ విజయం సాధించింది. ఆ తరవాత రాహుల్ తొలిసారి విదేశీ పర్యటనకు వెళ్లారు. గతంలో ఆయన లండన్‌కు వెళ్లి అక్కడ మోదీ సర్కార్‌పై విమర్శలు చేయడం వివాదాస్పదమైంది. ఈ సారి అమెరికా వెళ్లడం వల్ల మళ్లీ ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారోనన్న ఆసక్తి నెలకొంది. ఊహించినట్టుగానే మరోసారి మోదీ సర్కార్‌పై సెటైర్లు వేశారు రాహుల్. శాన్‌ఫ్రాన్సిస్కోలో ఏర్పాటు చేసిన NRIల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేశారు. ప్రధాని మోదీ ప్రతిష్ఠ తగ్గిపోతోందని వెల్లడించారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, విద్యారంగంలోని సమస్యలు తీర్చలేకపోతున్నారని మండి పడ్డారు. వాటన్నింటినీ పక్కదోవ పట్టించి పార్లమెంట్‌లో సెంగోల్‌పై అందరూ మాట్లాడుకునేలా చేశారని విమర్శించారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో భారతీయులతో మాట్లాడారు. రాజ్యసభ, లోక్‌సభలో సీట్లు పెరిగే అంశంపైనా తన అభిప్రాయాలు వెల్లడించారు. "మీ మనసుల్లో విద్వేషం, కోపం, గర్వం ఉండి ఉంటే బహుశా మీరంతా బీజేపీ మీటింగ్‌లో కూర్చుని ఉండేవారేమో" అని పరోక్షంగా బీజేపై సెటైర్లు వేశారు. ఇదే సమయంలో భారత్ జోడో యాత్ర గురించి కూడా ప్రస్తావించారు.
"భారత్ జోడో యాత్రలో దేశమంతా కలిసి నాతో నడిచింది. భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. తమ ప్రేమాభిమానాలు చూపించారు. అప్పుడే అనిపించింది. ఇన్ని విద్వేషాల మధ్య ఇంత ప్రేమ దొరకడం గొప్ప విషయం అని. భారత్ జోడో యాత్రను మోదీ సర్కార్ అడ్డుకోవాలని చూసింది. కానీ...వాళ్లు అనుకున్నది సాధ్యం కాలేదు. ఆ యాత్ర ప్రభావం పెరుగుతూ వచ్చిందే తప్ప ఎక్కడా తగ్గలేదు. బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్ అధీనంలో ఉన్న ప్రజల్ని ప్రేమ వైపు మళ్లించాలనే లక్ష్యంతోనే జోడో యాత్ర మొదలు పెట్టాం."
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత
కేంద్ర దర్యాప్తు సంస్థల్ని బీజేపీ దుర్వినియోగం చేస్తోందని ఫైర్ అయ్యారు రాహుల్ గాంధీ. ఆ సంస్థలతో దాడులు చేయిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. దేవుడి కన్నా తానే గొప్ప అని మోదీ ఫీల్ అవుతుంటారని సెటైర్లు వేశారు.
"కొంత మంది ఉంటారు. వాళ్లకు అన్నీ తెలుసని, మేధావులని భావిస్తుంటారు. ఎంతంటే...దేవుడి కన్నా ఎక్కువ తమకే తెలుసని అనుకుంటారు. మోదీ అలాంటి వ్యక్తుల్లో ఒకరు. ఒకవేళ దేవుడు వచ్చి మోదీ పక్కన కూర్చున్నా...ఆయనకు కూడా ఉపదేశాలు చేస్తారు. ఈ విశ్వమంతా ఎలా పని చేస్తోందో దేవుడికే చెబుతారేమో. నేను చెప్పేది నిజమే అనుకుంటున్నా"
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత
Also Read: Wrestlers At Haridwar: గంగా నదిలో మెడల్స్ పారవేసేందుకు సిద్ధమైన రెజ్లర్లు, అంతలోనే ఆసక్తికర పరిణామం