1990ల్లో డెయిరీ మిల్క్ చాక్లెట్ యాడ్ ఎంత క్రేజ్ సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. ఒక అమ్మాయి క్రికెట్‌ మ్యాచ్‌ను చూస్తూ డెయిరీ మిల్క్ చాక్లెట్‌ తింటుంది. గ్రౌండ్లో ఆమె ఈబాయ్‌ఫ్రెండ్‌ 99 పరుగులతో బ్యాటింగ్‌ చేస్తుంటాడు. అతడు సెంచరీ చేయటానికి ఒక పరుగు దూరంలో ఉంటాడు. స్కోరు బోర్డును చూసిన అతడు విన్నింగ్‌ షాట్‌ కొడతాడు. వెంటనే గ్యాలరీ నుంచి మ్యాచ్ వీక్షిస్తున్న ఆ అమ్మాయి సెక్యూరిటీని దాటి డ్యాన్స్ చేసుకుంటూ మైదానంలోకి వస్తుంది. సంతోషంతో బాయ్ ఫ్రెండ్‌ని హగ్‌ చేసుకుంటోంది. అప్పుడు బ్యాక్ గ్రౌండ్లో ‘అస్లీ స్వాద్‌ జిందగీ కా’ అనే ట్యాగ్‌ లైన్‌తో మ్యూజిక్ ప్లే అవుతుంది. ఈ ప్రకటనని అప్పట్లో ప్రముఖ యాడ్‌ ఏజెన్సీ సంస్థ ఓగిల్వి క్రియేట్‌ చేసింది. చాక్లెట్‌ చిన్నారులకు మాత్రమే అనే భావనను మార్చినందుకు ఈ యాడ్‌ అప్పుడు ఎంతో పాపులర్ అయ్యింది. 



IPL - 2021 మిగతా దశ ప్రారంభంకానున్న నేపథ్యంలో ప్రేక్షకులను అలరించేందుకు యాడ్ ఏజెన్సీలు సరికొత్తగా ప్రకటనలను సిద్ధం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఓగిల్వి అప్పటి డెయిరీ మిల్క్ చాక్లెట్ యాడ్‌ని కొత్తగా రూపొందించింది. ఈ కొత్త యాడ్‌లో అబ్బాయి చాక్లెట్‌ తింటూ గ్యాలరీ నుంచి క్రికెట్‌ మ్యాచ్‌ను చూస్తుంటాడు. అతని గర్ల్‌ఫ్రెండ్‌ విన్నింగ్‌ సిక్స్‌ కొట్టగానే అతను మైదానంలోకి వచ్చి డ్యాన్స్‌ చేస్తుంటాడు. తర్వాత ఆమెను కౌగిలించుకుంటాడు. ప్రస్తుతం ఈ యాడ్ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎందుకంటే... మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఈ ప్రకటన క్రియేట్ చేసినందుకు. ప్రస్తుతం ఈ యాడ్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. 










యాడ్‌లో మార్పులు చేస్తూ స్త్రీ, పురుషులు సమానమనే భావనను తీసుకొచ్చిన ఓగిల్వి సంస్థకు ఈ సందర్భంగా పలువురు అభినందిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం డెయిరీ మిల్క్ చాక్లెట్ పాత, కొత్త యాడ్‌లపై ఓ లుక్కేయండి.