Blind Student Success Story: మనం ఏదైనా పనిని చేయలేకపోయినప్పుడు సవాలక్ష కారణాలను కుంటి సాకులుగా చెప్తూ తప్పించుకుంటాం. చదువులో మనకంటే ముందుగా ఎవరైనా వస్తే.. కావాలనే టీచర్ మనకు మార్కులు వేయలేదనో, ఉద్యోగం రాకపోతే డబ్బులకు అమ్ముకున్నారు అందుకే రాలేదనో.. లేదంటే ఇంకా ఏవో పిచ్చి కారణాలు చెబుతుంటాం. కానీ కళ్లు లేకపోయినా తన కలలను నిజం చేసుకునేందుకు చాలా కష్టపడ్డాడు. అంధత్వం తన ఆశయాలను ఏమాత్రం అడ్డుకోలేదని నిరూపించాడు. అతడే మధ్య ప్రదేశ్ కు చెందిన యశ్ సొనాకియా. అతడికి ఎనిమిదేళ్ల వయసు నుండే పూర్తిగా కళ్లు కనపడడం మానేసినా... ప్రస్తుతం 47 లక్షల వార్షిక వేతనంతో మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. అయితే అతని కథేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
గ్లకోమా కారణంగా 8 ఏళ్లకే పూర్తిగా అంధత్వం..
మధ్య ప్రదేశ్ ఇందోర్ నగరానికి చెందిన యశ్ పాల్, స్థానికంగా క్యాంటీన్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఉన్నంతలో కుమారుడు, కూతురు, భార్యను చక్కగా చూసుకునే వాడు. అయితే వీరి మొదట పుట్టిన కుమారుడే యశ్ సొనాకియా. దురదృష్టవశాత్తు సొనాకియా ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడే గ్లకోమా వల్ల పూర్తిగా చూపును కోల్పోవాల్సి వచ్చింది. అయితే అంధత్వం వల్ల ప్రత్యేక పాఠశాలలో చదివే వాడు. తర్వాత సాధారణ స్కూల్ కి మారాడు. తన సోదరి సాయంతో బాగా చది తరగతిలో అందరి కంటే ముందుండేవాడు. అయితే సొనాకియాకి గణితం, సైన్స్ పై ఆసక్తి ఎక్కువ. ఈ విషయాన్ని గుర్తించిన తల్లిదండ్రులు అతడిని ఇంజినీరింగ్ చదివించాలనుకున్నారు.
"నా కొడుకు యశ్ కు చిన్నప్పుడే గ్లకోమా అనే వ్యాధి వచ్చింది. దాని కారణంగా చూపు మందగించింది. బాబుకు 8 ఏళ్ల వయస్సు వచ్చేసరికి పూర్తిగా కళ్లు కనిపించకుండా పోయాయి. కానీ అతడిని మంచి స్థాయికి తీసుకురావాలని కష్టపడి చదివించాం. తనకు గణితం, సైన్స్ పై అమితాసక్తి ఉండడంతో ఇంజినీరింగ్ చేయించాం. యశ్ కి కూడా బాగా ఆసక్తి ఉండడంతో బాగా చదివాడు. చివరకు తాను అనకున్న ఉద్యోగాన్ని సపాదించగలిగాడు. నాకు చాలా సంతోషంగా ఉంది." - యశ్ సొనాకియా తండ్రి, యశ్ పాల్
యశ్ సొనాకియాకి కూడా ఇంజినీరింగ్ పై ఇంట్రెస్ట్ ఉండటంతో... ఇందోర్ లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చేర్పించారు. 2021లో యశ్ బీటెక్ పూర్తి చేశాడు. అనంతరం కోడింగ్ నేర్చుకున్నాడు. ఈ క్రమంలోనే ఉద్యోగాన్వేషణ ప్రారంభించాడు. పెద్ద పెద్ద కంపెనీలన్నింటికీ దరఖాస్తు చేశాడు. అందులో భాగంగానే మైక్రోసాఫ్ట్ కంపెనీకి కూడా అప్లై చేశాడు. రాత పరీక్ష, ఇంటర్వ్యూల్లో అద్భుత ప్రతిభ కనబర్చి అన్ని రౌండ్ లు పూర్తి చేశాడు. మైక్రోసాఫ్ట్ నుంచి 47 లక్షల ప్యాకేజీతో కొలుపు సంపాదించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.
వర్క్ ఫ్రం హోం చేయమన్నా.. ఆఫీసుకే యశ్ ఇంట్రెస్ట్!
అయితే యశ్ సొనాకియా త్వరలోనే బెంగళూర్ లోని మైక్రోసాఫ్ట్ కార్యాలయంలో చేరబోతున్నట్లు తెలిపాడు. మొదట్లో వర్క్ ఫ్రం హోం చేయమని యాజమాన్యం చెప్పినా... బెంగళూరు వెళ్లడానికే తాను ఆసక్తి చూపించినట్లు వివరించాడు. ఆఫీసుకు వెళ్తేనే ఈ ఎక్స్ పీరియన్స్ తెలుస్తుందని యశ్ భావిస్తున్నట్లు వివరించాడు. అయితే ఇంజినీరింగ్ అయిపోయాక స్క్రీన్ రీడర్ సాయంతో ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలిపాడు. కోడింగ్ నేర్చుకున్న తర్వాత మైక్రోసాఫ్ట్ కు అప్లై చేస్కున్నానని.. పరీక్ష ఇంటర్వ్యూ అనంతరం సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ ఉద్యోగం వచ్చిందని చెప్పాడు.