పెద్దలు తన ప్రేమను నిరాకరించారని ఒక విద్యార్థిని చనిపోదామని నిర్ణయించుకుని రైలు పట్టాలపై పనుకుని నిద్రపోయిన ఘటన బిహార్‌లో చోటు చేసుకుంది. ప్రాణాలు విడుద్దామని రైలు పట్టాలపై కాలేజీ బ్యాగుతో సహా పనుకున్న ఆ యువతి.. రైలు రావడం ఆలస్యం కావడంతో మెల్లగా నిద్రలోకి జారుకుంది. ఈ ఘటన చకియా రైల్వే స్టేషన్‌ దగ్గర్లో చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం మోతిహరి నుంచి ముఝఫర్‌ పూర్‌ వరకు వెళ్లే రైలు చకియా స్టేషన్‌ అవుటర్ సిగ్నల్ దగ్గర లోకో పైలట్ సడెన్ బ్రేక్ వేయడంతో ఒక్క సారిగా నిలిచి పోయింది. ఏమైందా అని రైలులో ప్రయాణికులు ఆందోళన పడ్డారు. రైలు దిగి కిందకు వచ్చిన లోకో పైలట్‌.. పట్టాలపై కాలేజీ బ్యాగును వీపుపై వేసుకుని పనుకుని ఉన్న యువతిని అక్కడి నుంచి లేచి వెళ్లాలని సూచించాడు. నిద్రలో ఉన్న ఆమె.. తాపీగా నిద్ర లేచి తాను ఆత్మహత్య చేసుకోవాలని అక్కడి నుంచి ఎక్కడికీ వెళ్లేది లేదని తాను చనిపోవాల్సిందేనని లోకో పైలట్‌తో చెప్పింది. అతడు ఎంత ప్రయత్నించినా ఆ కాలేజీ విద్యార్థిని అక్కడి నుంచి వెళ్లలేదు. ఇదంతా దగ్గర్లో ఉండి చూసిన ఇరుగు పొరుగు వాళ్లు వచ్చి ఆమెకు నచ్చ చెప్పి పక్కకు పంపారు.


చకియా స్టేషన్‌ దాటిన తర్వాత పట్టాలపై పనుకొని ఉన్న యువతిని గుర్తించినట్లు లోకోపైలట్‌ చెప్పారు. అప్పటికి రైలు సాదారణ వేగంతో వెళ్లుతోందని అందుకే స్పీడ్‌ బ్రేక్ వేసి ఆమెను కాపాడగలిగాగనని తెలిపారు. ఆ విద్యార్థిని సమీప గ్రామానికి చెందిన యువతిగా గుర్తించారు. వ్యక్తిగత సమస్యల కారణంగా ఆమె ఆత్మహత్యకు యత్నించినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థి కావడంతో ఏ విధమైన కేసు పెట్టకుండా.. కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి స్థానికుల సాయంతో పంపినట్లు చెప్పారు. యువతి తాను ప్రేమించిన యువకుడ్ని కుటుంబ సభ్యులు నిరాకరించడంతో ఈ పనికి ఒడిగట్టు స్థానికులు పేర్కొన్నారు. రైలు పట్టాలపై నుంచి ఆమెను పక్కకు తీసే సమయంలో తన చావు తనని చావనివ్వాలని మీకు నా జీవితంతో సంబంధం ఏంటని అక్కడున్న వారిపై సదరు యువతి గొడవకు దిగడం కొసమెరుపు. చివరకు స్థానికులు పట్టాలపై నుంచి యువతిని బలవంతంగా పక్కకు తీసుకువచ్చారు.






 


యువతి నిర్వాకంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు కొంత సేపు ఆటంకం కలిగింది. యువతిని సముదాయించి అక్కడి నుంచి పక్కకు పంపిన తర్వాత.. తిరిగి ఆ ట్రాక్‌పై ట్రాఫిక్‌ను పునరుద్దించారు. లోకో పైలట్‌ సమయస్ఫూర్తి కారణంగా ఆ యువతి పెను ప్రమాదం నుంచి బయటపడిందని అక్కడి వాళ్లు లోకోపైలట్‌ను ప్రశంసించారు.


ఈ తతంగం మొత్తాన్ని అక్కడున్న వారు వీడియో తీసి ట్వీట్టర్‌లో పెట్టడంతో వైరల్‌ గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు. నిద్ర వస్తే ఇంటికి వెళ్లి నిద్ర పోవాలని.. పట్టాలపై పనుకోవడం ఏంటని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. నిద్ర దేవతే ఆ అమ్మాయిని కాపాడిందని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.