Rains In Bengaluru News | బెంగళూరు: నైరుతి రుతుపవనాల టైమ్ ముగిసింది. ఈశాన్య రుతువనాలు దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ వ్యాపిస్తున్నాయి. వర్షాలతో ఏపీలో కొన్ని జిల్లాల్లో అధికారులు అప్రమత్తం అయ్యారు. పొరుగున్న ఉన్న కర్ణాటకలోనూ వర్షాల ప్రభావం అధికంగానే ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో బెంగళూరులో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. నగరవాసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ లో చిక్కుకుని నరకయాతన అనుభవిస్తున్నారు. టెక్ పార్కులు వాటర్ పార్కులుగా మారాయని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.






భారీ వర్షాల కారణంగా బెంగళూరుకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ పరిస్థితుల్లో బెంగళూరులో విద్యాసంస్థలకు బుధవారం హాలిడే ప్రకటించారు. మరోవైపు బెంగళూరులోని సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాలని అధికారులు సూచించారు. బెంగళూరులో మంగళవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో నగర ప్రజల జీవితం స్తంభించిపోయింది. కడుబీసనహళ్లి, వర్తూరు, హెబ్బాళ్‌ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తాయి. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ (ORR)లోని మాన్యతా టెక్ పార్క్, సర్జాపూర్ టెక్ హబ్‌లు వాటర్ పార్కుల్లా మారిపోయాయి. ఆ ప్రాంతాల్లోని సంస్థల్లో పనిచేసే సాఫ్ట్ వేర్ ఉద్యోగులు తీవ్రంగా ప్రభావితం అయ్యారు.