Viral Video:
బెంగళూరులో ఘటన..
బెంగళూరులోని కృష్ణరాజపురం రైల్వే స్టేషన్‌లో ఓ మహిళా ప్రయాణికురాలికి, టీటీకి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీటీ ఆ మహిళపై గట్టిగా అరుస్తుండగా, ఆమె కన్నీళ్లు పెట్టుకుంటోంది. చుట్టూ ఉన్న వాళ్లంతా వారిస్తున్నా టీటీ తన వైఖరి మార్చుకోలేదు. టికెట్ బుక్ చేసుకున్నానని చెబుతున్నా వినకుండా ఆ అధికారి కావాలనే వేధించాడని బాధితురాలు ఆరోపించారు. "నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నారు. నేను టికెట్ బుక్ చేసుకునే ఇక్కడి వరకూ వచ్చాను" అని ఆ మహిళ చెబుతున్నారు. ఆమెకు ఎదురుగా నిలబడ్డ టీటీ "నాకు టికెట్ చూపించే ఇక్కడి నుంచి కదలాలి. చెక్ చేయడం నా డ్యూటీ" అని గట్టిగా వాదించాడు. దీంతో ఆ మహిళ కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తరవాత చుట్టూ ఉన్న ప్రయాణికులు ఆమెకు అండగా నిలిచారు. "ఆమె ఒంటరిగా ప్రయాణిస్తోంది. అందుకే కావాలని టీటీ ఆమెను వేధిస్తున్నాడు. ఆమె ఎవరో నాకు తెలియదు. కానీ టీటీ చేసేది మాత్రం సరికాదు"అని ఓ ప్రయాణికుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే ఆ మహిళ అప్పటికే ఓ టికెట్ కలెక్టర్‌కి టికెట్ చూపించానని, కానీ మళ్లీ మళ్లీ టికెట్ చూపించాల్సిందేనని టీటీ ఇబ్బందికి గురి చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. సహనం నశించిన ప్రయాణికులు ఆ టీటీ కాలర్ పట్టుకుని వెనక్కి లాగారు. మద్యం మత్తులో ఇలా ప్రవర్తించాడని వాళ్లు ఆరోపించారు. అయితే...ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న అధికారులు వెంటనే ఆ టీటీని సస్పెండ్ చేశారు.