Ants Milking: ఎండాకాలం వచ్చిందంటే చాలు ఇంట్లో అక్కడక్కడా చీమలు కనిపిస్తుంటాయి. వాతావరణం వేడెక్కిన వెంటనే ఆహారం వెతుక్కుంటూ తమ నివాస స్థలాల నుంచి చీమలు బయటకు క్యూ కట్టేస్తుంటాయి. ఆహారాన్ని సేకరించి తమ ప్రాంతాల్లో నిల్వ చేసుకుంటాయి. చీమలో కష్ట జీవులు అని అంటారు. ఎంతో కష్టం చేస్తాయని, తమ బరువు ఎన్నో రెట్లు ఎక్కువైన బరువును కూడా సులభంగా మోస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే చీమల గురించి చాలా మందికి తెలియని ఓ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే.. చీమలు కూడా పాలు ఇస్తాయి. ఏంటి.. చీమలు కూడా పాలిస్తాయా అని ఆశ్చర్యపోవద్దు.
చీమలు కూడా పాలిస్తాయని తాజాగా గుర్తించిన శాస్త్రవేత్తలు
చీమలు కూడా పాలు ఇస్తాయని తాజాగా పరిశోధకులు గుర్తించారు. సాధారణంగా చీమలు కీటకాలని అందరికీ తెలిసిందే. అయితే చీమలు పాలు కూడా ఇస్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. చీమలు ఒక వయస్సుకు వచ్చిన తర్వాత ఒక రకమైన ద్రవాన్ని స్రవిస్తాయి అని పరిశోధకులు కనుగొన్నారు. ఈ ద్రవం ఒక రకమైన పాల వంటివేనని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. మరి ఈ పాలను అవేం చేసుకుంటాయి.. ఇతర క్షీరదాల్లాగే తమ బిడ్డలకు తాగిస్తాయా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
చీమల పాలు ఎవరు తాగుతారు?
వాస్తవానికి, ప్యూపా నుండి వచ్చే ఈ పాలను యుక్త వయస్సులో ఉన్న చీమలు, లార్వా రెండూ తాగుతాయి. లార్వా అనేది గుడ్డు లేదా షెల్ నుండి ఉద్భవించే ఒక క్రిమి. చీమ అభివృద్ధి ప్రక్రియలో, గుడ్డు నుంచి ఒక లార్వా ఏర్పడుతుంది. ఆ తర్వాత ప్యూపా, తర్వాత ప్యూపా యుక్త వయస్సుకు వస్తుంది. ఇది చీమ అభివృద్ధి చెందే క్రమం. ప్యూపా నుంచి పాలను విడుదల చేయడం, చీమలు దాని వినియోగం వాటి మనుగడకు అవసరం. నవజాత శిశువుకు పాలు ఎంత అవసరమో, అదే విధంగా చీమల లార్వాకు కూడా ఈ పాలు అవసరం. ఈ విషయాన్ని తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఇందులో చాలా పోషకాలు ఉన్నాయి
చీమల నుంచి వచ్చే ఈ పాలలో అమైనో ఆమ్లాలు, చక్కెర, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కాకుండా, అనేక హార్మోన్లు, ఇతర పదార్థాలు కూడా ఈ చీమ పాలలో ఉంటాయి. ఈ ద్రవంపై మాత్రమే వారి అభివృద్ధి ఆధారపడి ఉంటుందని నిపుణులు అంటున్నారు. అయినప్పటికీ, చీమల పాలను సేకరించడం సాధ్యం కాదు. ఎందుకంటే ఇది చాలా తక్కువ పరిమాణంలో ఉంటుంది. ఈ అధ్యయనం 'నేచర్' జర్నల్‌లో ప్రచురించబడింది. చీమలు పాలు కూడా ఇస్తాయన్న విషయాన్ని కనిపెట్టడం ఇదే మొదటి సారి అని ఈ అధ్యయనంలో పాలు పంచుకున్న శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
పాలు ఇవ్వకపోతే ప్యూపా చనిపోతుంది
యుక్త వయస్సుకు వచ్చే చీమలు ఈ ప్రక్రియలో చాలా ముఖ్యమైన ఈ ద్రవాన్ని తాగుతాయి. ఎందుకంటే ప్యూపా నుంచి విడుదలయ్యే ఈ ద్రవం సకాలంలో తొలగించకపోతే, అది దాని స్వంత ద్రవంతో మునిగిపోతుంది. ఇది ఆఖరికి చావుకు దారి తీస్తుంది.