అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఏంటీ..? వీధుల్లో కుల్ఫీ అమ్మడం ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారా..? నిజంగా ట్రంప్ ను పోలిన ఓ వ్యక్తి పాకిస్థాన్ లో ఉన్నాడు. పాక్ పంజాబ్ లోని సాహివాల్ జిల్లాకు చెందిన  ఓ వ్యక్తికి డొనాల్డ్ ట్రంప్ ముఖ పోలికలు ఉన్నాయి. స్థానికులు అతన్ని 'చాచా బగ్గా' అని పిలుస్తారు. ప్రముఖ గాయకుడి మాదిరిగా అతడు పాటలు పాడతాడు. అతని గాత్రానికి అందరూ ఫిదా అవుతూ ఉంటారు. కుల్ఫీ అమ్మేందుకు తాను వీధుల్లోకి వచ్చినట్లు చాచా తన పాటల ద్వారా అందరికీ తెలియజేస్తాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తాజాగా వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు నిజంగా ట్రంప్ లానే ఉన్నాడే అంటూ ఆశ్చర్యపోతున్నారు. భిన్నంగా స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. 



2021లోనూ ఇలానే


అయితే, 2021లో కూడా పాకిస్థాన్ లో ఈ కుల్ఫీ విక్రేత ఇంటర్నెట్ లో హల్చల్ చేశాడు. ట్రంప్ మాదిరిగా పోలికలున్న అతను పాటలు పాడుతూ తన ఐస్ క్రీం బండి ద్వారా కుల్ఫీలు అమ్ముతున్న వీడియో కూడా అప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది నెటిజన్లను ఎంతో ఆకట్టుకుంది. పాక్ ప్రముఖ గాయకుడు హెహజాద్ రాయ్ సైతం అప్పట్లో దీన్ని షేర్ చేశారు. 'వాహ్ కుల్ఫీ భాయ్, క్యా బాత్ హై..' అంటూ అతనిపై ప్రశంసల జల్లు కురిపించారు.






 


సర్వేలో ట్రంప్ ముందంజ


మరోవైపు 2024 నవంబరులో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి తాజా పోల్ లో ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ వెనుకబడ్డారు. ట్రంప్ తో పోలిస్తే బైడెన్ 10 పాయింట్లు వరకూ వెనుకబడినట్లు వాషింగ్టన్ పోస్ట్, ABC న్యూస్ సంయుక్తంగా నిర్వహించిన పోల్ వెల్లడించింది. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష బరిలో రేసులో మిగిలిన వారి కంటే ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. 


ట్రంప్ తో పాటు


రిపబ్లికన్ పార్టీ అధికారిక నామినేషన్ ప్రక్రియ అయోవా కాకస్, న్యూహాంప్ షైర్ ప్రైమరీతో జనవరిలో మొదలుకానుంది. ట్రంప్ తో పాటు రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల వారికి ఆదరణ పెరిగినప్పటికీ ట్రంప్ వారి కంటే చాలా ముందున్నట్లు సమాచారం. ఆయనే రిపబ్లికన్ పార్టీ అధికారిక అధ్యక్ష అభ్యర్థి అవుతారని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.


దూసుకెళ్తున్న వివేక్ రామస్వామి



ఇటీవల నిర్వహించిన సర్వేలో జీవోపీ పోల్స్ లో భారత సంతతి వ్యక్తి వివేక్ రామస్వామి దూసుకెళ్తున్నట్లు తేలింది. మాజీ అధ్యక్షుడు ట్రంప్ తర్వాతి స్థానానికి వివేక్ చేరుకున్నారు. ఆయన మూడో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ ట్రంప్ నకు ప్రధాన పోటీదారుగా ఉన్న ఫ్లోరిడా గవర్నర్ రాన్ డీశాంటిస్ 2 స్థానాలు దిగజారి ఐదో స్థానానికి పడిపోయారు. మరోవైపు, భారత సంతతికి చెందిన మహిళా అభ్యర్థి నిక్కీ హేలీ సైతం 12 శాతం ఓట్లతో తృతీయ స్థానంలో కొనసాగుతున్నారు.