మంత్రి కేటీఆర్ సంగారెడ్డి పర్యటనకు వెళ్తున్న వేళ అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నేడు కేటీఆర్ జహీరాబాద్‌లో ఉన్న National Investment & Manufacturing Zones నిమ్జ్ లో వెమ్ అనే సంస్థ శంకుస్థాపన చేయనున్నారు. అయితే, దీన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు ప్లకార్డులు ప్రదర్శించారు. నిమ్జ్ వల్ల నిర్వాసితులు అయిన భూ నిర్వాసితులు నిరసన చేశారు. తమకు పరిహారం విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా ఎలా శంకుస్థాపన చేస్తున్నారంటూ వారు ప్రశ్నించారు.
భూ నిర్వాసితులు నిరసనలు చేసే అవకాశాన్ని ముందుగానే అంచనా వేసిన పోలీసులు సంగారెడ్డి జిల్లాలో న్యాల్ కల్, ఝరాసంగం మండలాల్లోని కొన్ని గ్రామాల్లో ఆంక్షలు విధించారు. మామిడిగి, గంగ్వార్, మెంటల్‌కుంట, న్యామతాబాద్, రుక్మాపూర్, హుసెళ్లి గ్రామాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. నిమ్జ్ భూ నిర్వాసితుల సంఘం లీడర్లను ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. నిమ్జ్ పరిధిలోని గ్రామాల్లో అత్యవసరం ఉంటేనే గ్రామస్థులను పోలీసులు బయటకు పంపుతున్నారు. కేటీఆర్ పర్యటనలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.
స్వల్ప లాఠీచార్జి
కేటీఆర్ పర్యటన సందర్భంగా నిరసనలకు దిగిన మామిడిగి, ఎల్గోయి గ్రామాల్లో భూ బాధితులపై పోలీసులు లాఠీచార్జ్ జరిపారు. పోలీసుల లాఠీఛార్జ్‌తో మహిళా రైతు స్పృహ తప్పి పడిపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఎల్గోయి, మామిడిగి గ్రామాలలో భూ బాధితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
వెమ్ టెక్నాలజీస్ సంస్థ 511 ఎకరాల్లో రూ.వెయ్యి కోట్లతో పరిశ్రమ ఏర్పాటు చేయనుంది. అనంతరం కేటీఆర్ వాయు ఈవీ పరిశ్రమను ప్రారంభిస్తారు. మహీంద్రా ట్రాక్టర్లు 3 లక్షల యూనిట్ల ఉత్పత్తి పూర్తయిన సందర్భంగా కంపెనీలో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక స్మారకాన్ని కూడా కేటీఆర్ ప్రారంభిస్తారు. తర్వాత జహీరాబాద్ పట్టణంలోని బాగారెడ్డి స్టేడియంలో బహిరంగ సభలో పాల్గొని మాట్లాడతారు.