అమెరికాలో మరోసారి ఓ ఉన్మాది కాల్పులతో భీభత్సం చేశాడు. ఈ తుపాకీ కాల్పుల్లో తెలంగాణలో నల్గొండ జిల్లాకు చెందిన యువకుడు చనిపోయాడు. మేరీలాండ్ రాష్ట్రంలో ఓ నల్ల జాతీయుడు చేసిన కాల్పుల్లో నల్గొండ వాసి నక్కా సాయి చరణ్‌ (26) మృతి చెందాడు. ఆదివారం సాయంత్రం తన ఫ్రెండ్‌ని ఎయిర్‌ పోర్ట్‌లో దిగబెట్టి కారులో వస్తుండగా నల్ల జాతీయుడు ఈ కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సాయిచరణ్ చనిపోయాడు. సాయిచరణ్ అమెరికాలో గత రెండేళ్లుగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. సాయిచరణ్ చనిపోయిన సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. అతని మృతితో వారి స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.


అమెరికాలో ప్రముఖ వార్తా పత్రిక అయిన The Baltimore Sun లో ప్రచురితం అయిన వివరాల ప్రకారం.. మేరీల్యాండ్‌లోని బాల్టీమోర్ సిటీలోస్థానిక ఎడ్నోర్ గార్డెన్స్ దగ్గర ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఈ కాల్పుల్లో నక్కా సాయి చరణ్ తో పాటు  40 ఏళ్ల వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఓ యువతి తీవ్రంగా గాయపడింది.


సమాచారం అందుకున్న బాల్టీమోర్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఘటనా స్థలం లేక్ సైడ్ అవెన్యూ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ కాల్పుల్లో తీవ్ర బుల్లెట్ గాయాలైన 40 ఏళ్ల వ్యక్తి ట్రెవర్ వైట్ ని వెంటనే హాస్పిటల్ కి తరలించారు. కానీ, అతను వెంటనే చనిపోయాడు. అనంతరం చనిపోయిన వ్యక్తుల గురించి తెలిసిన వారు ముందుకు రావాలని పోలీసులు ప్రకటన చేశారు. ఈ ఉన్మాదానికి పాల్పడ్డ వ్యక్తిని పట్టుకొనేందుకు పోలీసులు డిటెక్టివ్ అధికారులు రంగంలోకి దిగారు.