AP CM YS Jagan tweet on new parliament building: నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంపై దేశ వ్యాప్తంగా రాజకీయం జరుగుతోంది. రాష్ట్రపతి చేతుల మీదుగా కాకుండా ప్రధాని మోదీ పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని.. తాము ఈ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేస్తున్నామని 19 విపక్ష పార్టీలు బుధవారం స్పష్టం చేశాయి. ఈ క్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నూతన పార్లమెంట్ భవనం ప్రారంభానికి వైసీపీ హాజరు అవుతుందని స్పష్టం చేశారు. ఇటీవల నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేయనున్న ప్రధాని నరేంద్ర మోదీకి జగన్ అభినందనలు తెలిపారు. తాము మహత్తర ఘట్టానికి హాజరవుతామని ట్వీట్ ద్వారా వెల్లడించారు.
వైఎస్ జగన్ ట్వీట్ లో ఏం పేర్కొన్నారంటే..
‘కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించి జాతికి అంకితం చేస్తున్న ప్రధాని మోదీకి అభినందనలు. పార్లమెంటు అంటే ప్రజాస్వామ్యానికి దేవాలయం. దేశ ఆత్మను పార్లమెంట్ ప్రతిబింబిస్తుంది. అది మన దేశ ప్రజలతో పాటు అన్ని రాజకీయ పార్టీలకు చెందినది. ఇలాంటి పార్లమెంట్ భవనం ప్రారంభాన్ని బహిష్కరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తి అనిపించుకోదు. రాజకీయంగా పార్టీలు తమ అభిప్రాయాలను పక్కనపెట్టి, ఈ అపురూప ఘట్టానికి హాజరు కావాలని కోరుతున్నాను. ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఈ చారిత్రక కార్యక్రమానికి మా పార్టీ (వైసీపీ) హాజరవుతుంది’’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.






రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో నూతన పార్లమెంట్ భవనం ప్రారంభించాలని 19 విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాల సూచనను పాటించడం లేదు. దాంతో ప్రజాస్వామ్యానికి చోటు లేని కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నామని ఈ విపక్ష పార్టీలు ప్రకటించాయి. కాంగ్రెస్, డీఎంకే, ఆప్, శివసేన (యూబీటీ), సమాజ్‌వాదీ పార్టీ, సీపీఐ, జార్ఖాండ్ ముక్తి మోర్చా, కేరళ కాంగ్రెస్ (మణి), విడుదలై చిరుతైగళ్ కట్చి, రాష్ట్రీయ లోక్‌ దళ్, తృణమూల్ కాంగ్రెస్, జనతాదళ్ (యునైటెడ్), ఎన్‌సీపీ, సీపీఎం, ఆర్జేడీ, ఇండియన్ యూనయన్ ముస్లిం లీగ్, నేషనల్ కాన్ఫరెన్స్, రివల్యూషరీ సోషలిస్ట్ పార్టీ, ఎండీఎంకే ఈ కార్యక్రమాన్ని బహిష్కరించిన జాబితాలో ఉన్నాయి. 


విపక్ష పార్టీలతో కలవని బీఆర్ఎస్, ఈవెంట్ కు డుమ్మా కొడుతుందా? నూతన పార్లమెంట్ భవనం ప్రారంభం మే 28న ప్రధాని మోదీ చేతుల మీదుగా జరగనుంది. ఈ ఈవెంట్ ను 19 విపక్ష పార్టీలు బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రకటించగా.. ఈ జాబితాలో భారత రాష్ట్ర సమితి (BRS) లేదు. దీంతో కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి బీఆర్ఎస్ వెళ్తుందా లేదా అనే విషయంపై స్పష్టత లేదు. తాము ఈ కార్యక్రమానికి హాజరు అవుతున్నట్లు అధికారికంగా బీఆర్ఎస్ ఎలాంటి ప్రకటనలు చేయలేదు.