Minister Talasani: లాల్ దర్వాజ సింహ వాహిణి ఆలయాన్ని రూ.10 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. చాంద్రాయణగుట్ట నియోజకవర్గ పరిధిలోని ఉప్పుగూడలో రూ.5 కోట్ల వ్యయంతో నిర్మించబోతున్న నాలుగు మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్స్ నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణకు తెలంగాణ  ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అత్యంత ఘనంగా బోనాల ఉత్సవాలు జరుపుతున్నామని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యం అని స్పష్టం చేశారు. ప్రజల మధ్య విబేధాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్న పార్టీల పట్ల జాగ్రత్తగా ఉండాలని మంత్రి తలసాని సూచించారు. 






మహంకాళి బోనాలకు ముహూర్తం ఖరారు


ఏటా నిర్వహించే సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి అమ్మవారి బోనాలకు ఈ ఏడాది ముహూర్తం ఖరారైంది. ఈ ఏడాది జూలై 9న బోనాలు నిర్వహించనున్నట్లుగా నిర్ణయించారు. ఈ విషయాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇటీవలే తెలిపారు. ఆ మరుసటి రోజు జులై 10న రంగం (భవిష్య వాణి) నిర్వహించనున్నట్లు చెప్పారు. ఉజ్జయిని మహాంకాళీ అమ్మవారి నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని తలసాని పాల్గొని అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల విశిష్టతను రాష్ట్ర ప్రభుత్వం నలుదిక్కులా చాటిందని అన్నారు. బోనాల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.


బోనాల విశిష్టత చాటేలా


భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం బోనాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ సంస్కృతిలో బోనానికి ప్రత్యేక స్థానం ఉంది. దేవతలను పూజించేందుకు బోనం ఎత్తే సాంప్రదాయం యావత్ తెలంగాణ అంతటా ఉంది. బోనాలను మహంకాళి బోనాలు, ఎల్లమ్మ బోనాలు, పోచమ్మ బోనాలు ఇలా రకరకాల దేవతల పేరిట నిర్వహిస్తుంటారు. అదే తరహాలో హైదరాబాద్‌లో లష్కర్ బోనాలు ఏటా జరుగుతుంటాయి. ఈ బోనాల సమయంలో అంగరంగ వైభవంగా బోనాల జాతర జరుగుతుంది.


సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారి ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి మొదలవుతుంది. బోనమెత్తే మహిళలు, శివసత్తుల పూనకాలు, పోతురాజుల నృత్యాలతో బోనాల జాతర కన్నుల పండుగగా సాగుతుంది. గత ఏడాది ఉజ్జయిని మహాంకాళి బోనాలు జూలై 17వ తేదీన జరిగిన సంగతి తెలిసిందే. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబం మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంది. ఈ సందర్భంగా తలసాని కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. రాజకీయాలకు అతీతంగా బోనాల పండగ వైభవంగా జరగనుందని అన్నారు.


Also Read: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో మహిళలకు న్యూట్రిషన్ కిట్స్ - తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం