Breaking News Live: రుషికొండ బీచ్ లో ఇద్దరు విద్యార్థులు గల్లంతు
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం
పరదేశిపాలేనికి చెందిన శ్రీ రామా ఇంగ్లీష్ మీడియం స్కూల్ కి చెందిన ఇద్దరు విద్యార్థులు రుషికొండ బీచ్ లో గల్లంతయ్యారు. వీరిలో 8వ తరగతి చదువుతున్న మొయ్య పార్డు(15)మృతదేహం లభ్యంకాగా 10వ తరగతి విద్యార్థి సత్యాల రాజేష్(16) గల్లంతయ్యాడు. 9వ తరగతి చదువుతున్న బాలుడు పర్రి సాయి ప్రాణాలతో బయట పడగా, అతడికి గీతం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ఈ నెల 16వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రోజూ ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు బడులు నిర్వహిస్తారు. ఎండలు పెరుగుతున్నందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఒడిశాలో లఖీంపూర్ తరహా ఘటన చోటుచేసుకుంది. బీజేడీ ఎమ్మెల్యే కారు జనం పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 10 మంది పోలీసులు, స్థానికులకు గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహించిన ప్రజలు ఎమ్మె్ల్యేపై దాడి చేశారు. ఈ దాడిలో ఎమ్మెల్యేకు తీవ్రగాయాలయ్యాయి. ఆయనను పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు.
సినీ గేయ రచయిత కందికొండ యాదగిరి(49) కన్నుమూశారు. గత కొంత కాలంగా కందికొండ అనారోగ్యంతో బాధపడుతున్నారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా ఆయన గేయాలు రాశారు.
Bandi Sanjay Letter To KCR: బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ యువత కోసం స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఇందుకోసం సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ రాశారు. కోచింగ్ కేంద్రాల్లో అల్పాహారం, భోజనం ప్రభుత్వమే కల్పించాలని, ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని సైతం కోరారు.
చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం మొలగముడి, వెంగలరాజు కండ్రిగ గ్రామాలను ఏనుగుల గుంపు వదలడం లేదు. చెన్నై తిరుపతి జాతీయ రహదారికి కూతవేటు దూరంలో ఉన్న ఏనుగుల గుంపు శుక్రవారం అర్ధరాత్రి తిరిగి అటవీ ప్రాంతంలోకి వెళ్లాయి. ఏనుగులు శనివారం మధ్యాహ్నం మరల తిరిగి అదే గ్రామాల పంట పొలాల్లో తిష్ట వేసి పంట పొలాలను నాశనం చేస్తూ గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఫారెస్ట్ అధికారులు బాణసంచా పేల్చిన ఎటువంటి ప్రయోజనం కనిపించలేదు. ఏనుగుల గుంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు అటవీ అధికారులను వేడుకుంటున్నారు.
హైదరాబాద్‌లోని అసెంబ్లీ వద్ద ప్రమాదం జరిగింది. అసెంబ్లీ గేట్ 1 వద్ద కారులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది నీళ్లు చల్లి మంటలార్పారు. కాసేపు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
వేములవాడ పట్టణంలోని పలు హోటళ్ళలో మున్సిపల్ అధికారుల ఆకస్మిక తనిఖీలు చేశారు. వేములవాడ పట్టణంలోని పలు హోటళ్ళలో శుక్రవారం మున్సిపల్
అధికారుల ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇటీవల వేములవాడ మున్సిపల్ లో విలీన గ్రామమైన తిప్పపూరంలోని శ్రీ గీత భవన్ హోటల్లో భారీ మొత్తంలో కుళ్ళిన
ఆహార పదార్థాలు, చికెన్, మటన్ స్వాధీనం చేసుకున్నారు. హోటల్ యాజమాన్యానికి రూ. 5000 జరిమాన విధించి, దాదాపు 7 వేల రూపాయలు విలువ గల ఆహర పదార్థాలను అధికారులు సీజ్ చేశారు. హోటల్ నిర్వాహకుల తీరుపై పట్టణ ప్రజలు మండిపడుతున్నారు. ఈ తనిఖీల్లో సానిటరీ ఇన్స్పెక్టర్ నగేష్, జవాన్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
MLA Vanama Comments: తన కుమారుడు వనమ రాఘవపై కొందరు కుట్రలు పన్నారంటూ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అనారోగ్యంతో ఉన్న సమయంలో తన కుమారుడిపై కొందరు ఆరోపణలు చేసి, అరెస్ట్ చేయించారని ఆరోపించారు. అసెంబ్లీ లాబీలో ఎమ్మెల్యే వనమా శనివారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు అవుతాడనుకున్న తన కుమారుడిపై కొందరు ఉద్దేశపూర్వకంగానే కుట్రలు చేశారంటూ మండిపడ్డారు. త్వరలోనే వారి బండారం బయటపెడతానని, ఇతర పార్టీ నేతలతో తమ పార్టీ వాళ్లు కూడా కుమ్మక్కు అయ్యారని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆరోపించారు.
ఉద్యోగాల పై హామీ ఇచ్చి సీఎం జగన్ ఓట్లు వేయించుకున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. జాబ్‌క్యాలెండర్ విడుదల చేయాలని విజయవాడ ధర్నా చౌక్ వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఆందోళన కారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యోగాల భర్తి చేపట్టాలని విద్యార్ది సంఘాలు,ఛలో విజయవాడకు పిలుపు నిచ్చాయి. నిరసనకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. ఈక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు, పోలీసులు మధ్య తోపులాట జరిగి.. ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆందోళనకారులను అరెస్టు చేసిన పోలీసులు, స్టేషన్‌కు తరలించారు. ‘‘జగన్ మాట తప్పి మోసం చేశారు. 2.35లక్షల ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలి’’ అని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.
bhuma nagi reddy death anniversary: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో భూమా నాగిరెడ్డి వర్థంతి వేడుకల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సొంత స్థలంలో భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి విగ్రహాలను ఆళ్లగడ్డ నియోజకవర్గం బీజేపీ ఇంచార్జీ భూమా కిషోర్ రెడ్డి ఏర్పాటు చేశారు. కొద్ది నిమిషాల్లో భూమా కిషోర్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ చేస్తారనే క్రమంలో భూమా నాగిరెడ్డి దంపతుల విగ్రహలను మాజీమంత్రి భూమా అఖిల ప్రియ, భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి ప్రారంభించారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు. దీంతో భూమా కిషోర్ రెడ్డి అనుచరులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
Background
ఢిల్లీలోని గోకుల్ పురిలో శుక్రవారం అర్ధరాత్రి విషాదం చోటుచేసుకుంది. శివార్లలోని గుడిసెల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వారి బతుకులు బుగ్గిపాలయ్యాయి. గుడిసెలు కావడంతో మంటలు వేగంగా వ్యాపించడంతో ప్రాణ నష్టం అధికంగా వాటిల్లినట్లు తెలుస్తోంది. నిద్రపోతున్న సమయం కనుక, మంటల్ని త్వరగా గుర్తించక పోవడంతో పెను నష్టాన్ని మిగిల్చింది అగ్ని ప్రమాదం. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఎంగానో శ్రమించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ఇప్పటివరకు ఏడు మృతదేహాలను రెస్క్యూ టీమ్ వెలికి తీసింది. చిన్నారులు, ఇంకా ఎవరైనా ఉన్నారా అని వెతుకుతున్నారు.
ఉక్రెయిన్, రష్యా యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు బ్యారెల్ ధర 120 డాలర్లకు ఎగబాకింది. హైదరాబాద్‌లో ఇంధన ధరలు గత ఏడాది డిసెంబర్ నుంచి నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్‌లో నేడు సైతం పెట్రోల్ ధర లీటర్ రూ.108.20 కాగా, డీజిల్ ధర లీటర్ రూ.94.62 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఢిల్లీలోనూ గత డిసెంబర్ తొలి వారం నుంచి పెట్రోల్ లీటర్ ధర రూ.95.41, డీజిల్ ధర రూ.86.67 వద్ద స్థిరంగా ఉన్నాయి.
ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర (Petrol Price In Warangal) నిలకడగా ఉంది. వరంగల్‌లో 19 పైసలు తగ్గడంతో పెట్రోల్ లీటర్ ధర రూ.107.69 కాగా, డీజిల్‌పై 17 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.94.14 కు పతనమైంది. నిజామాబాద్‌లోపెట్రోల్ లీటర్ ధర రూ.109.93 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.96.23 అయింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
విజయవాడలో పెట్రోల్ (Petrol Price in Vijayawada 12th March 2022)పై 40 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.110.48 కాగా, ఇక్కడ డీజిల్ పై 37 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.96.56 అయింది.
విశాఖపట్నంలో ఇంధన ధరలు భారీగా దిగొచ్చాయి. 48 పైసలు తగ్గడంతో పెట్రోల్ లీటర్ ధర రూ.109.40 అయింది. డీజిల్‌పై 44 పైసలు పెరిగి లీటర్ ధర రూ.95.51కి పతనమైంది.
మహిళల వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళలు దుమ్మురేపారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన మిథాలీ రాజ్ సేన ప్రత్యర్థి విండీస్ మహిళల ఎదుట భారీ లక్ష్యాన్ని ఉంచారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్లు ఓపెనర్ స్మృతి మందాన (123), వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (109) శతకాలతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 317 పరుగులు చేసింది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -