Sharmila Released From Jail: పోలీసులపై దాడి చేయలేదని పోలీసులు కొన్ని వీడియోలు విడుదల చేసి తనపై కేసులు పెట్టారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. బెయిల్ పై చంచల్ గూడ జైలు నుంచి విడుదలైన తర్వాత మీడియాతో మాట్లాడారు. కే సి ఆర్ ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నాడని మండిపడ్డారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ విషయంలో సిట్ కార్యాలయానికి వెళ్లి రిప్రజెంటేషన్ ఇవ్వాలని అనుకున్నానన్నారు. కావాలనే పోలీస్ లను పెట్టీ నన్ను అరెస్ట్ చేశారన్నారు. తనను అడ్డుకోవడానికి వచ్చిన వారిలో ఇద్దరు మాత్రమ మహిళా పోలీసులు ఉన్నారని.. తనను ఓ మహిళ అని చూడకుండా మీదపడి దాడి చేశారన్నారు.
ఇంటికి ఉద్యోగం హామీ ఏమైంది కే సి ఆర్ అని సీఎంను షర్మిల ప్రశ్నించారు. ఉద్యోగాల లేవు .. డబుల్ బెడ్ రూం ఎంత మందికి ఇచ్చారని ప్రశ్నించారు. తాను ఎవరి మీద చేయి చేసుకోలేదని స్పష్టం చేశారు. పోలీసులు కావాలనే కొన్ని సెలెక్ట్ వీడియోలు బయటపెట్టారని..తన శరీరం తాకే వీడియోలు పోలిసులు నాపై కన్నెర్ర చేసిన వీడియోలు ఎక్కడ కూడా బయట పెట్టలేదన్నారు. పోలీసులు కే.సి అర్ కు తొత్తుగా వ్యవహరిస్తున్నారని.. పోలీసుల్ని కుక్కల్లా కేసీఆర్ వాడుకుంటున్నారని మండిపడ్డారు. వైఎస్ విజయలక్ష్మి.. రాజశేఖర్ రెడ్డి బార్య అని పోలీసులకు కనీస జ్ఞానం లేదన్నారు. అనుచితంగా ప్రవర్తించిన మహిళా పోలీస్‌పై విజయమ్మ ఓ దెబ్బ వేశారని.. దానిక విజయమ్మ బాంబులు వేసినట్లు చిత్రీకరించారని విమర్శించారు.
సహనం నశించి తాను పోలీసులను తోశానని దాడి చేయలేదన్నారు. తనను హౌస్ అరెస్ట్ చేస్తున్నట్లు ఆర్డర్ కాపీ లేదన్నారు. కాలికి గాయం అయిన పోలీస్ కానిస్టేబుల్ మా తరపు వకిల్ సమక్షంలో వేరే ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాజశేఖర్ రెడ్డి బిడ్డను చూసి కేసీఆర్ భయపడుతున్నారని షర్మిల ఎద్దేవా చేశారు. ఉదయం నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో మధ్యాహ్నం సమయంలో పూచీకత్తులు సమర్పించి జైలు నుంచి విడుదలయ్యారు. కోర్టు ఆదేశాల మేరకు రూ.30 వేల పూచీకత్తుతో కూడిన రెండు షూరిటీలను షర్మిల కోర్టుకు సమర్పించారు.
కోర్టు పెట్టిన షరతులు ఇవీ
రూ. 30వేల పూచీకత్తు ఇద్దరు వ్యక్తులతో ఇప్పించాలని కోర్టు షరతు పెట్టింది. అలాగే విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. పోలీసుల విచారణకు సహకరించాలని కోర్టు స్పష్టం చేసింది. షర్మిల నిన్నే బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వాదోపవాదాల తర్వాత కోర్టు బెయిల్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద షర్మిల తల్లి వైఎస్ విజయలక్ష్మి కూడా పోలీసులపై దాడి చేశారు. అయితే పోలీసులు ఆమెపై ఎలాంటి కేసులు పెట్టలేదు. ఆమెపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని.. వైఎస్ఆర్‌టీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ప్రచారం చేశాయి.