వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్థంతి సందర్భంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. తండ్రిని స్మరించుకుంటూ ఆమె గురువారం భావోద్వేగపూరిత ట్వీట్ చేశారు. అంతేకాక, ఆమె ప్రస్తుతం ఆమె ఎదుర్కొంటున్న పరిస్థితులు ఆ ట్వీట్‌లో ప్రతిబింబిస్తున్నాయి. ‘‘ఒంటరి దానినైనా విజయం సాధించాలని, అవమానాలెదురైనా ఎదురీదాలని, కష్టాలెన్నైనా ధైర్యంగా ఎదురుకోవాలని, ఎప్పుడూ ప్రేమనే పంచాలని, నా వెన్నంటి నిలిచి, ప్రోత్సహించి.. నన్ను మీ కంటిపాపలా చూసుకొన్నారు. నాకు బాధొస్తే మీ కంట్లోంచి నీరు కారేది. ఈ రోజు నా కన్నీరు ఆగనంటుంది. ఐ లవ్ అండ్ మిస్ యూ డాడ్’’ అని తండ్రిని స్మరించుకుంటూ వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు.


సోదరుడు జగన్‌తో విభేదాలు నిజమేనా..?
తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త రాజకీయ పార్టీ పెడతారని ప్రచారం మొదలైనప్పటి నుంచి ఆమె సోదరుడు, ఏపీ సీఎం జగన్‌తో షర్మిలకు విభేదాలు వచ్చాయని ఊహాగానాలు మొదలయ్యాయి. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అప్పట్లో మాట్లాడుతూ.. జగన్-షర్మిల మధ్య భిన్నాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని, విబేధాలు మాత్రం లేవని అన్నారు. తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ పెట్టడాన్ని జగన్ వద్దన్నారని అన్నారు. ఎందుకంటే నమ్ముకున్న వారికి న్యాయం చేయలేమేమోనని జగన్ వద్దన్నట్లు చెప్పారు. అయితే, తాను గతంలో పాదయాత్ర చేసినందువల్ల ప్రజాదరణ ఉంటుందనే నమ్మకంతో షర్మిల కొత్త పార్టీ వైపు మొగ్గు చూపారని సజ్జల ఓ సందర్భంలో అన్నారు.


అయితే, తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ పెట్టినప్పటి నుంచి కృష్ణా నీటి పంచాయితీ విషయంలో సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తున్న ప్రతిసారి పరోక్షంగా ఏపీ సీఎంపై కూడా విమర్శలు చేస్తున్నారు. తనకు తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. సోదరుడిపై షర్మిల పరోక్షంగా విమర్శలు చేయడంతో వారిద్దరి మధ్య నిజంగానే విభేదాలు ఉన్నాయేమోననే ప్రచారం మరింత బలపడింది. 


తాజాగా పక్కనే కూర్చున్నా.. మాట్లాడుకోకుండా..
వైఎస్ వర్థంతి సందర్భంగా ఇడుపులపాయలోని ఆయన ఘాట్ వద్ద గురువారం కుటుంబ సభ్యులంతా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్‌తో పాటు వైఎస్ షర్మిల కూడా వచ్చారు. ఆమె తెలంగాణలో పార్టీ పెడతారనే ఊహాగానాలు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ జగన్-షర్మిల ఎదురుపడ్డ బహిరంగ సందర్భం ఏదీ లేదు. తాజాగా తండ్రికి నివాళులు అర్పించిన సందర్భంగా జగన్-షర్మిల పక్కపక్కనే కూర్చున్నారు. కానీ, వారిద్దరూ మాట్లాడుకోవడం కనిపించలేదు. దీంతో వారిద్దరి మధ్య దూరం పెరిగిందనే వాదన మరింత బలంగా మారుతోంది.




నేడు (సెప్టెంబరు 2) తండ్రి వర్థంతి సందర్భంగా షర్మిల చేసిన ట్వీట్‌లోనూ తాను ఒంటరి అని పేర్కొన్నారు. ‘‘ఒంటరిదానినైనా.. అవమానాలు ఎదురైనా.. కష్టాలను ఎదుర్కోవాలని..’’ అంటూ ట్వీట్ చేశారు. దీన్ని బట్టి చూస్తే వైఎస్ షర్మిలకు ప్రస్తుతం అయిన వారి మద్దతు కొరవడుతోందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.